CM JAGAN:వరద బాధితులకు పక్కా ఇళ్లు

కడప, చిత్తూరు జిల్లాల్లో వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని.. ప్రతి ఇంటికీ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. వరదల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated : 03 Dec 2021 05:33 IST

అన్ని విధాలా ఆదుకుంటాం
నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం
కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో సీఎం జగన్‌ భరోసా
బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

కడప జిల్లా పులపుత్తూరులో వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

ఒంటిమిట్ట- న్యూస్‌టుడే; ఈనాడు- తిరుపతి: కడప, చిత్తూరు జిల్లాల్లో వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని.. ప్రతి ఇంటికీ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. వరదల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు 5 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తూ ఇళ్లపట్టాలు అందజేశారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా సహాయ కార్యక్రమాలను శరవేగంగా చేపట్టామన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు, దిగువ మందపల్లి, ఎగువ మందపల్లి, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదళ్ల్లచెరువు, ఏర్పేడు మండలం పాపానాయుడుపేటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనలను తిలకించారు.

గురువారం మధ్యాహ్నం 12.10 నుంచి 3.10 గంటల వరకు మూడు గంటలపాటు పులపుత్తూరు గ్రామంలోనే గడిపారు. తర్వాత ఎగువ, దిగువ మందపల్లి గ్రామాల్లో సీఎం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ‘కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి.. పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించవచ్చు. 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఒత్తిడిని తట్టుకోలేక కట్ట దెబ్బతింది. ఆ నీరంతా చెయ్యేరు నది పరీవాహక గ్రామాల్లోకి చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. బాధితులకు ఇప్పటికే 99 శాతం సాయం చేశాం. సాయం అందనివారు ఉంటే మీ వివరాలను గ్రామ సచివాలయాల్లో అందజేస్తే, విచారించి మేలు చేస్తాం. పింఛ, అన్నమయ్య జలాశయాల పునరుద్ధరణ పనులను కొత్త ఆకృతి ప్రకారం చేపడతాం. భవిష్యత్తులో ఎంతటి ప్రవాహం వచ్చినా గ్రామాల్లోకి వరద రాకుండా చర్యలు చేపడతాం. నదికి ఇరువైపులా నందలూరు వంతెన వరకు రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు దెబ్బతిన్న వారికి రానున్న రోజుల్లో ప్రమాదం లేకుండా ఎత్తయిన ప్రదేశంలో పక్కాగృహాలు కట్టించడానికి కృషి చేస్తాం. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేస్తాం. ఇళ్లు నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారం ఇస్తాం. పొలాల్లో ఇసుక మేటలను తొలగించడానికి హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తాం. స్వయం సహాయ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకు కంతులు చెల్లించలేమని నాతో చెప్పారు. ఉన్నతస్థాయిలో చర్చించి వారికి మంచి చేస్తాం. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తాం. పనులు లేనివారికి ఉపాధిహామీ పథకంలో పనులు కల్పిస్తాం. వాహనాలు కొట్టుకుపోయిన వారికీ న్యాయం చేస్తాం’ అని సీఎం భరోసా ఇచ్చారు. విపత్తు వేళ జిల్లా అధికారులు చక్కగా పనిచేశారని అభినందించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.

కడప జిల్లా పులపుత్తూరులో వరద బాధితురాలికి ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్‌

చిత్తూరు జిల్లాకు భారీ నష్టం

వరదల వల్ల చిత్తూరు జిల్లాకు ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నేరుగా రేణిగుంట మండలం వెదళ్ల్లచెరువు ప్రాంతంలోని యానాది కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. వరదలతో తాము ఎదుర్కొన్న కష్టాలను పలువురు ఆయనకు చెప్పారు. అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు బాధితులు.. కొందరు అధికారులు తమ సమస్యలు పరిష్కరించట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆ కాలనీలో ఇంటింటికీ తిరిగి దెబ్బతిన్న గృహాలు పరిశీలించారు. బాధితులకు ఇళ్ల పట్టాలతోపాటు నిత్యావసర సరకులు అందజేశారు. అక్కడి నుంచి ఏర్పేడు మండలం పాపానాయుడుపేట- గుడిమల్లం వెళ్లే మార్గంలో స్వర్ణముఖి నదిపై వంతెన కూలిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. శుక్రవారం తిరుపతిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి, నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని