Updated : 10 Dec 2021 06:23 IST

RAILWAY ZONE: రైల్వే జోన్‌పై వైకాపా రెండు మాటలు

మంజూరు చేసినందుకు కృతజ్ఞతలన్న బీవీ సత్యవతి
ఏర్పాటుపై అయోమయం ఉందన్న మార్గాని భరత్‌

ఈనాడు, దిల్లీ: విశాఖ రైల్వే జోన్‌పై వైకాపా ఎంపీలు లోక్‌సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గురువారం శూన్యగంటలో ఈ అంశంపై అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు వేర్వేరు సమయాల్లో మాట్లాడారు. జోన్‌ మంజూరు చేయడంతోపాటు, దానికి రూ.300 కోట్లు కేటాయించినందుకు సత్యవతి ధన్యవాదాలు తెలపగా.. అసలు జోన్‌ అమల్లోకి వస్తుందా? రాదా? అన్న అమోయయం రాష్ట్ర ప్రజల్లో నెలకొందని భరత్‌ పేర్కొన్నారు.

‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక పెండింగ్‌ డిమాండు. జోన్‌ మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇటీవల కాలంలో ప్రత్యేక అధికారిని నియమించడంతోపాటు, జోనల్‌ కార్యకలాపాల కోసం రూ.300 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో నేను చిన్న డిమాండు చేస్తున్నా. విశాఖ కేంద్రంగా పని చేస్తూ దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే డివిజన్లలో 5వ స్థానంలో ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ను విశాఖ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు తరలించడంవల్ల భద్రత, నిర్వహణలపై పర్యవేక్షణ తగ్గుతుంది. వాల్తేర్‌ డివిజన్‌ను యథాతథంగా ఉంచి రాయగడ డివిజన్‌తో దాని సరిహద్దులను ఖరారు చేయాలి. ఈవిషయంలో ఏపీ ప్రజల సెంటిమెంట్లనూ పరిగణనలోకి తీసుకోవాలి’ అని సత్యవతి కోరారు.

‘రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటింది. అప్పట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి వాగ్దానం ఇచ్చినా అమలు చేయలేదు. ఇంతకుముందు మాట్లాడిన వక్త (తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు) చెప్పినట్లు 2021-22 బడ్జెట్‌లో ఈ జోన్‌ కోసం రూ.40 లక్షలే కేటాయించారు. కానీ దక్షిణ కోస్తా జోన్‌ను ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న తీవ్రమైన అయోమయం, సందిగ్ధత ఏపీ ప్రజల్లో నెలకొంది. దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజల తరఫున డిమాండు చేస్తున్నాం. రైల్వే మంత్రి సభాముఖంగా జోన్‌పై స్పష్టత ఇవ్వాలి’ అని భరత్‌ కోరారు


రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలి: రామ్మోహన్‌ నాయుడు  

విశాఖపట్నం కేంద్రంగా  ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలని శ్రీకాకుళం తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌ నాయుడు డిమాండు చేశారు. దేశంలో కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం లేదంటూ రైల్వే మంత్రి బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ అంశంపై గురువారం లోక్‌సభ శూన్య గంటలో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా పేరుతో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని 2019 ఫిబ్రవరిలో కేంద్రం వాగ్దానం చేసింది. జోన్‌ ఏర్పాటు కోసం 2021-22లో ఎంత బడ్జెట్‌ కేటాయించారని ఇటీవల నేను అడిగిన ప్రశ్నకు రూ.40 లక్షలు కేటాయించినట్లు రైల్వేశాఖ చెప్పింది. ఇది రాష్ట్రాన్ని అవమానించడమే కాదు.. వాగ్దానం అమలులో కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి లోపాన్ని చాటుతోంది. రూ.40 లక్షలు భవనం కోసం కాదు.. కొత్త రైల్వే జోన్‌ కోసం అని చెబుతున్నారు. దేశంలో ఉన్న రైల్వే జోన్ల గురించి బుధవారం అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో దక్షిణ కోస్తా జోన్‌ పేరును చేర్చలేదు. కొత్త జోన్లు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? అని అడిగితే అందులోనూ దక్షిణ కోస్తా పేరు చెప్పలేదు. రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసి, వెంటనే కార్యకలాపాలను ప్రారంభించాలని ఉత్తరాంధ్ర ప్రజల తరఫున డిమాండు చేస్తున్నాం. విశాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలి’ అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts