Cold: రాష్ట్రం గజగజ

కొద్ది రోజులుగా రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతోపాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హిమాలయ పరిసర ప్రాంతాల

Updated : 22 Dec 2021 04:20 IST

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

సంక్రాంతి వరకు చలిచలిగానే..

జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు వస్తే  అప్రమత్తంగా ఉండాలి

వైద్య నిపుణుల సూచన

ఈనాడు- అమరావతి, విశాఖపట్నం

కొద్ది రోజులుగా రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతోపాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హిమాలయ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మంచు గాలులు రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక్కడి వాతావరణం బాగా చల్లబడటంతో వాయవ్య గాలుల కారణంగా ఉత్తర కోస్తా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై చలి పంజా విసురుతోంది. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావారణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా గతేడాది కన్నా ఈసారి శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 17న 8.4 డిగ్రీలు, 18న 6.1, 19న 5.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. చలితోపాటే జలుబు, దగ్గు, ఫ్లూ తరహా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో జలుబు, దగ్గు వచ్చినా మరింత కంగారుపడుతున్నారు.


ఈ జాగ్రత్తలు పాటించాలి

* చలి సమయంలో బయటకు వెళ్తే, శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి.

* చర్మం పొడిబారి, పాదాలు, చేతులు పగలకుండా కొబ్బరినూనె, ఆలివ్‌నూనె వంటివి రాయాలి.

* చలిగా ఉందని చాలామంది వ్యాయామానికి సెలవిచ్చేస్తుంటారు. ఎక్కువగా తినడం వల్ల బరువూ పెరుగుతారు. బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే రోజుకు కనీసం ఆరగంటసేపైనా వ్యాయామం చేయాలి. గుండె జబ్బులు, మధుమేహ బాధితులకు ఇది మరింత అవసరం.

* వేడి పానీయాలు తీసుకోవాలి. ఆహారాన్ని కూడా వేడివేడిగానే తినాలి.

* చలిని తట్టుకునేందుకు కొందరు ధూమపానం, మద్యపానం మోతాదుకు మించి తీసుకుంటారు. దీనివల్ల గుండె స్పందన లయ తప్పి, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు.

* చలి తీవ్రంగా ఉన్నప్పుడు చేతులు పట్టుతప్పుతాయి. కాబట్టి రాత్రిళ్లు వాహనాలు నడపకపోవడం మంచిది.


ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి

- డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, జనరల్‌ ఫిజిషియన్‌, విజయవాడ జీజీహెచ్‌

కొవిడ్‌ లక్షణాల్లో కొన్ని చలికాలంలో సహజంగా వస్తుంటాయి. కాబట్టి వైద్యులను సంప్రదించి మందులు వాడితే మంచిది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి జ్వరాలు వస్తాయి. లక్షణాల తీవ్రతను బట్టి కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే మంచిది. అయిదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకుముందే ఆరోగ్య సమస్యలు ఉంటే.. మందులు వాడే విషయంలో వైద్యులను సంప్రదించాలి. చలితీవ్రత పెరిగినప్పుడు.. జలుబు, గొంతునొప్పి, న్యుమోనియా, ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయి. చలి తీవ్రతకు కొందరికి గుండెలోని రక్తనాళాలు కుంచించుకుపోయి.. గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. గుండె సంబంధిత వ్యాధులున్నవారు వైద్యులను ముందుగానే సంప్రదించి, సలహాలు పొందాలి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు