Justice NV Ramana: తెలుగోడి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటండి

తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్‌ టీకా అద్భుతంగా పనిచేస్తుందని

Updated : 24 Dec 2021 05:53 IST

విమర్శించే బానిస మనస్తత్వాన్ని విడనాడాలి
తెలుగు భాష, సంస్కృతులను గౌరవించండి
రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్‌ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అయినా మన దేశంలో తయారైందంటూ కొందరు నిరుత్సాహపరిచారని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశారని, గుర్తింపురాకుండా పలు ప్రయత్నాలు చేశారని అన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్యాక్సిన్‌ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనవాళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనవారితో కలిసి తెలుగువారి గొప్పదనాన్ని తెలియజేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృమూర్తిని, మాతృభాషను, దేశాన్ని గౌరవించడం సంప్రదాయమన్నారు. బాధ్యతగల వ్యక్తులు సమాజం కోసం పనిచేయాల్సి ఉందంటూ గురజాడ చెప్పిన ‘దేశమంటే మనుషులోయ్‌’ అన్న గేయాన్ని వినిపించారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని, కనీసం ఇంట్లో అయినా మాట్లాడే అవకాశం కల్పించాలని, సాహిత్యాన్ని చదవడంతోపాటు తెలుగు నాటకాలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు తదితరాలను ప్రోత్సహించాలన్నారు.  

కృష్ణ ఎల్ల దంపతులు కష్టాలతో ఎదిగారు
అవార్డు గ్రహీతల్లో చాలా మంది తన జీవన గమనంలో సుపరిచితులని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. వారికి పురస్కారాలు ప్రదానం చేయడం గొప్ప అవకాశమన్నారు. వారు ఇతరుల సహకారంతో కాకుండా కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పలు కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. అమెరికాలో చిన్నచిన్న ఉద్యోగాలు చేశారని తెలిపారు. కృష్ణ పరిశోధనలు చేస్తున్నపుడు సుచిత్ర ఉద్యోగం చేస్తూ అండగా నిలిచారన్నారు. దేశానికి ఏదైనా సేవ చేయాలని ఇక్కడికి వచ్చి పలు కష్టాలు ఎదుర్కొని ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోవాలనుకున్నారన్నారు. అయితే మనోనిబ్బరంతో నిలబడి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసి భారత కీర్తిపతాకను గగన వీధుల్లో ఎగురవేశారన్నారు. అవార్డు అందుకున్న డాక్టర్‌ మస్తాన్‌ 20 ఏళ్లుగా తనతోపాటు మరో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మలయాళీ అయిన సుమ గత జన్మలో తెలుగువారై ఉంటారని, తెలుగు గొప్పదనాన్ని చాటుతున్న సుమ ఈ తరానికి ఆదర్శప్రాయమన్నారు. బండ్లమూడి శ్రీనివాస్‌ శిరిడీలో వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆహారం అందజేస్తున్నారన్నారు. అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందం హాస్యనటుడనుకోరాదని, డైనమేట్‌లాంటి వ్యక్తి అన్నారు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిని తనకు కల్పించారని, కష్టపడి పైకి వచ్చారని తెలిపారు. డాక్టర్‌ దుర్గా పద్మజ పలువురికి సేవలందించారని, ఎస్వీ రామారావు సినిమా రంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు ఆయన సేవలను మనం సరిగా వాడుకోలేదనిపిస్తోందన్నారు. నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజు వ్యవసాయ కుటుంబంలో పుట్టారని, కరోనా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు, గ్రామీణ మహిళలకు అండగా నిలిచారన్నారు. రామినేని దంపతులు 1950 ప్రాంతంలోనే ఆమెరికా వెళ్లినా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మూలాలను మర్చిపోకుండా పిల్లలకు, సంస్కృతిని, భాషను నేర్పించారన్నారు. ఆ పిల్లలే మహావృక్షాలుగా నిలబడి ప్రముఖులను గుర్తించి 20 ఏళ్లకుపైగా అవార్డులను అందజేయడం గొప్పవిషయమని అభినందనలు తెలిపారు.

టీకాల తయారీలో భారత నాయకత్వం గర్వకారణం: కృష్ణ ఎల్ల
టీకాల తయారీలో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. రామినేని ఫౌండేషన్‌ విశిష్ఠ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇతర దేశాల మీద ఆధార పడుతున్నామన్నారు. ఆవిష్కరణల వైపు అడుగులు వేయలేకపోతున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ఇప్పుడు వచ్చిందని, తాను 20 ఏళ్ల క్రితమే దీన్ని నమ్మానని గుర్తు చేశారు. ఎంచుకున్న మార్గంలో ఎంతటి ప్రమాదం ఎదురైనా ముందుకే వెళ్లాలన్నారు. భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు  విషయంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తనకు తానే సాటి అన్నారు. అంతగొప్ప వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు. టీకా తయారీ ఘనత తమది మాత్రమే కాదని.. అది భారత్‌ బయోటెక్‌లో పనిచేసే 2000 మంది ఉద్యోగుల కష్టంతో సాధించిన విజయమన్నారు. నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజు మాట్లాడుతూ సామాజికసేవ చేస్తున్న వారికి అవార్డులు అందించటం హర్షణీయమన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పక్కవాళ్ల కష్టం, సమన్యాయం తెలిసిన మనిషి అన్నారు. వ్యాఖ్యాత సుమ మాట్లాడుతూ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ మహిళా సాధికారికతకు పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ధర్మప్రచారక్‌, కన్వీనర్‌ పాతూరి నాగభూషణం, మాజీ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, రామినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజుకు నాగలి బహూకరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని