Somu Veerraju:మాకు అధికారమిస్తే...మూడేళ్లలో అమరావతిని నిర్మిస్తాం

తమ పార్టీకి అధికారమిస్తే అమరావతిలో రాష్ట్ర రాజధానిని మూడేళ్లలోనే నిర్మిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ... ‘ఆయన రాజధాని పేరిట సింగపుర్‌, జపాన్‌, చైనా అని రైతులను

Updated : 29 Dec 2021 04:54 IST

ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం
రూ.50కే చీప్‌లిక్కర్‌ ఇస్తాం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

మ పార్టీకి అధికారమిస్తే అమరావతిలో రాష్ట్ర రాజధానిని మూడేళ్లలోనే నిర్మిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ... ‘ఆయన రాజధాని పేరిట సింగపుర్‌, జపాన్‌, చైనా అని రైతులను మోసం చేశాడు. ఈయన రాజధాని లేకుండాచేసి, మడమతిప్పి విశాఖ పారిపోయి అక్కడ భూములను ఆక్రమించేస్తాడట. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... చీప్‌ లిక్కర్‌ తయారుచేసి అమ్ముతోంది. రూ.3 ఖరీదు ఉండే సీసాను రూ.25కి అమ్ముతోంది. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు రాబట్టి, వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోంది. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది భాజపాకు ఓటేసి గెలిపించండి. చీప్‌ లిక్కర్‌ రూ.70కే ఇస్తాం. రాబడి బాగుంటే రూ.50కే ఇస్తాం.
అధికారంలోకి వచ్చాక అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తిని సీఎం చేస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. పాదయాత్రలో అరిగిపోయిన రోడ్లకు జగన్‌ గుప్పెడు మట్టి కూడా వేయలేకపోయారు. సర్పంచ్‌ల ఖాతాల్లోకి మేం డబ్బులు వేస్తుంటే, వాటిని ‘వారు’ విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఉపాధిహామీ పథకం, రైతు భరోసా కేంద్రాలకు కేంద్రం నిధులిస్తుంటే.. అన్నింటికీ జగనన్న పేరు పెట్టుకుంటున్నారు. గత సీఎంను సింగిల్‌ స్టిక్కర్‌ బాబు అని మోదీ అన్నారు. ఇపుడు ఈ సీఎం డబుల్‌, త్రిబుల్‌ స్టిక్కర్లు వేస్తున్నారు. డెయిరీలు, షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు అమ్మేశారు. ప్రభుత్వ భూములనూ అమ్మేస్తున్నారు. ఆర్టీసీ భవనాలు లీజుకు ఇస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదా? బిహార్‌కు ప్రత్యేక హోదా పరిశీలిస్తే.. ఏపీకి కూడా పరిశీలిస్తారు’ అని స్పష్టంచేశారు.

కమ్యూనిస్టుల వసూళ్లు నెలకు రూ.2 కోట్లు

‘కమ్యూనిస్టులు దేశ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో సంఘాలు పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. రాష్ట్రంలో ఐసీడీఎస్‌ అంగన్‌వాడీ కేంద్రాల నుంచి కూడా కమ్యూనిస్టులు నెలకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు’ అని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.


సోము వీర్రాజు బండి పరిగెత్తాల్సిందే!
- పరిపూర్ణానంద స్వామి

రాష్ట్రంలో 2022 చివర్లో లేదా 2023 మొదట్లోనే వైకాపా పాలన పోతుందనిపిస్తుంది. నేను అడుగుపెడితే బండ్లు, ఓడలు కదులుతాయి. తెలంగాణలో 2018లో అడుగు పెట్టగా అక్కడ ‘బండి’ పరిగెడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ సోము వీర్రాజు బండి కదలాలి. 2024 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుంది. బొట్టుపెట్టుకుని సీఎం జగన్‌ హిందువునని నమ్మించాడు. రామతీర్థంలో రాములవారి విగ్రహానికి అవమానం జరిగితే... అరెస్టులు లేవు. అంతర్వేదిలో రథాన్ని కాల్చేస్తే మంత్రి చెక్క అని హేళనగా మాట్లాడారు. చంద్రబాబు.. 2018లో ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను కాంగ్రెస్‌ కాళ్లకింద పెట్టడంతోనే 2019లో ఓడారు. ఏపీకి చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ అన్యాయంచేశారు.


ఏపీలో విధ్వంసకర, విద్వేషపూరిత పాలన
-పురందేశ్వరి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా ప్రభుత్వ విధ్వంసకర పాలన మొదలై గుళ్లు, గర్భగుడిలోని దేవుళ్ల వరకు కొనసాగిందంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాలి. ఈ విద్వేషపూరిత వాతావరణం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులొచ్చే పరిస్థితి లేదు. విద్యుత్తు పీపీఏల రద్దు నుంచి అమరావతికి అన్యాయం చేసిన వరకు చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రికి దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలవడం... లేదంటే అప్పులు ఎక్కడ పుడతాయా? అని చూడడంతోనే సరిపోతోంది.


వివేకాను వాళ్లే చంపి.. మృతదేహానికి కుట్లు వేశారు
-ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

వివేకా హత్య కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నా పేరును చేర్చారు. వైకాపా వాళ్లే వివేకాను చంపారు. వారే రక్తపు మరకలు కడిగారు. శవానికి కుట్లు కూడా వేశారు. కానీ... నా ఆధ్వర్యంలోనే హత్య జరిగిందని పైకి ప్రచారం చేశారు. దీనికితోడు చంద్రబాబు, లోకేశ్‌ పేర్లనూ చెప్పారు. చంద్రబాబు హయాంలో సిట్‌ వేస్తే, సీబీఐ దర్యాప్తు కావాలని జగన్‌ అడిగారు. ఎన్నికలలో గెలిచాక... మరో సిట్‌ను వేశారు. నన్ను కూడా విచారించారు. హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వాళ్లే సూత్రధారులని తేలింది.


దేశంలో 31 కేసులున్న నేత జగన్‌ ఒక్కరే
-విష్ణుకుమార్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

దేశంలో... 31 కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమే. ఇలాంటి వ్యక్తిని ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు. నాపై ఒక్క కేసు లేకున్నా... నన్ను ఓడించారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నప్పుడు అందరికీ ఎంతో ప్రేమగా ముద్దులు పెట్టాడు. నిజమేనని నమ్మి ఓట్లు వేశారు.


వికేంద్రీకరణ అంటే ఊరికో ఇళ్లు కట్టుకోవడమా?:  సత్యకుమార్‌, పార్టీ జాతీయ కార్యదర్శి
జగన్‌ దృష్టిలో అభివృద్ధి వికేంద్రీరణ అంటే ఊరుకో ఇళ్లు కట్టుకోవడంలా ఉంది. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌, బెంగళూరులో ప్యాలెస్‌, ఇడుపులపాయలో ఇంద్రభవనం నిర్మించుకున్నారు. ఇపుడు తాడేపల్లిలోనూ మరో ప్యాలెస్‌ కట్టుకొని... విశాఖలో సముద్రం కనిపించేలా కొండను వెతుకుతున్నారు. మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు.


రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
-కన్నా లక్ష్మీనారాయణ, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు

ప్రజలకు చాక్లెట్లు ఇచ్చి... వైకాపా ప్రభుత్వం నిలువుదోపిడీకి పాల్పడుతోంది. జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది. అమరావతి మొదలు ప్రతి వ్యవస్థ, సంస్థను నాశనంచేశారు. రెండున్నరేళ్ల జగన్‌ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతోనే ఆయనకు మళ్లీ ‘పీకే’ అవసరం వచ్చింది. కేంద్రంలో 110 రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది.


భారతి సిమెంట్‌ను తక్కువ ధరకు ఇవ్వొచ్చుగా
-సుజనా చౌదరి, ఎంపీ

వినోదాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటోంది. ప్రజలపై  ప్రేముంటే... భారతి సిమెంట్‌ను తక్కువ ధరకే ఇవ్వొచ్చుగా. భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించవచ్చు కదా. గత రెండున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. కనిపించనవి మరో రూ.2.5 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. తెదేపా, వైకాపా కుటుంబ పాలనతో రాష్ట్రానికి నష్టమే. వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులు, పారిశ్రామికవేత్తలపైనా కేంద్రం నిఘా ఉంది.


గనులు, ఇసుక, మద్యం.. అన్నీ వాళ్ల చేతుల్లోనే
- సీఎం రమేష్‌, ఎంపీ

వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు మేలుచేసే ఒక్క పనీ చేయలేదు. రాష్ట్రంలో ఇసుక లీజును వాళ్ల కుటుంబంలోని వారికే ఇచ్చారు. మద్యం విషయంలోనూ ఇంతే. డిస్టల్లరీలను తీసుకుని వాళ్లే కావాల్సిన బ్రాండ్లు తయారు చేసి, అమ్ముకుంటున్నారు. మైనింగ్‌లోనూ లీజుదారులను బెదిరించి, జరిమానాలు విధించి, కేసులు పెట్టి గనులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కడప జిల్లాలో వచ్చిన వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.


ఇది ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’
-జీవీఎల్‌ నరసింహారావు, ఎంపీ

వైసీపీ అంటే ‘ఏమీ.. చేతగాని.. ప్రభుత్వం’ అని అర్థం. కానీ అరాచకంలో మాత్రం ముందుంటోంది. ఏపీకి కేంద్రం రూ.77 వేల కోట్లిచ్చినా రాష్ట్రం అప్పుల్లో ఎందుకు ఉంటోంది. రాష్ట్ర ప్రజలకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. కేంద్ర పథకాలకు వైకాపా ప్రభుత్వం తన స్టిక్కర్లు వేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా మోదీని దైవస్వరూపుడిగా చూస్తున్నారు. బీజేపీ అంటే ‘భవిష్యత్తులో జయించే పార్టీ’ అని అందరూ గుర్తు పెట్టుకోవాలి.


కమలం అంటే ఫైర్‌: సునీల్‌ దేవధర్‌
కమలం అంటే ఫైర్‌ అని భాజపా రాష్ట్ర సహ బాధ్యుడు సునీల్‌ దేవధర్‌ వ్యాఖ్యానించారు. నేతల ప్రసంగాల మధ్యలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు