Perni Nani:ఎవరిపైనా కక్ష లేదు

తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరికి వారుగా ఆపాదించుకుని, వారి కోసమే సినిమా టికెట్ల రేట్లను తగ్గించారనడం సరికాదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

Updated : 29 Dec 2021 05:30 IST

సినిమా టికెట్‌ ధరలను కమిటీ పరిశీలిస్తుంది
పంపిణీదారుల సంఘం నేతలతో మంత్రి పేర్ని నాని
ఈనాడు - అమరావతి

మ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరికి వారుగా ఆపాదించుకుని, వారి కోసమే సినిమా టికెట్ల రేట్లను తగ్గించారనడం సరికాదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన సినిమా పంపిణీదారుల సంఘం నేతలతో మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘హైకోర్టు సూచన మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ... టికెట్లు, బెనిఫిట్‌ షోలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పంపిణీదారులు, నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌, సినిమాహాళ్ల యజమానులతోపాటు వివిధ వర్గాల విజ్ఞప్తులను కమిటీకి అందిస్తాం. చాలా థియేటర్లకు అనుమతులు లేవని సెప్టెంబరులోనే చెప్పినా... స్పందించని వారిపైనే చర్యలు తీసుకుంటున్నాం. అనుమతులకు దరఖాస్తు చేసిన వారి జోలికి వెళ్లలేదు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో 130 సినిమాహాళ్లు నిబంధనలను పాటించడం లేదని గుర్తించాం. ఇందులో 25 హాళ్లకు జరిమానా విధించాం. 83 సీజ్‌ చేశాం. 22 రెన్యువల్‌ చేసుకోకుండా సొంతంగా మూసేశారు. టికెట్ల ధరలు, సినిమాహాళ్ల అనుమతుల పునరుద్ధరణకు 4 వారాల సమయం ఇవ్వాలని కోరారు. సినిమా టికెట్ల అంశంపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నిర్మాత దానయ్య నాకు రెండు సార్లు ఫోన్‌ చేశారు. ఈ విషయాలనూ కమిటీ పరిశీలిస్తుంది. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమల్లోకి తెస్తాం’ అని మంత్రి వివరించారు.

నాని... ఎక్కడి థియేటర్‌, కిరాణా కొట్టు లెక్క లేశారో... సినీ హీరో నాని ఏ ఊళ్లో సినిమా హాలు, దాని పక్కనున్న కిరాణ కొట్టు లెక్కలేశారో తెలియదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టికెట్‌ ధరలపై హీరో నాని వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా... ‘ఆయన బాధ్యతాయుతంగానే ప్రకటన ఇచ్చారనుకుంటా. సినిమా హాలు కౌంటరు, పక్కన వెచ్చాల కొట్టు కౌంటరును లెక్క పెట్టే ఉంటారు’ అని మంత్రి స్పందించారు. చెన్నైలో ఉండే సినీ హీరో సిద్దార్థ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్ల గురించి ఎందుకు మాట్లాడతారని మంత్రి నాని ప్రశ్నించారు. ‘మేం విలాసంగా బతుకుతున్నామో లేదో ఆయనొచ్చి చూశారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌, అక్కడి మంత్రులను, లేదంటే మోదీని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు’ అని పేర్కొన్నారు.

టికెట్ల రేట్లు పెంచండి

కార్పొరేషన్ల పరిధిలో ఏసీ హాళ్లకు రూ.150 - రూ.50 (గరిష్ఠం-కనిష్ఠం), ఏసీలేని వాటిలో రూ.100- రూ.40 చొప్పున, ఇతర ప్రాంతాల్లోని ఏసీ హాళ్లలో రూ.100- రూ.40(గరిష్ఠం- కనిష్ఠం), ఏసీ లేని వాటిలో రూ.80- రూ.30 చొప్పున ధరలను నిర్ణయించాలి. కొత్త సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వాలని మంత్రి నానిని కోరాం. 

వీరినాయుడు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు, పంపిణీదారుల సంఘం కార్యదర్శి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని