Teachers: టీచర్లు కావలెను!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం, ఉపాధ్యాయుల పదవీ విరమణలు, మరణాలకు తోడు.. కొత్త నియామకాలు లేకపోవడంతో బోధించేవారు కరవయ్యారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అధికారులు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకొస్తున్నారు.

Updated : 31 Dec 2021 16:16 IST

కొత్త నియామకాల్లేక తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత
ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న అధికారులు
వందల మంది విద్యార్థులకు ముగ్గురు, నలుగురితో బోధన
చదువులు కుంటుపడుతున్నాయని తల్లిదండ్రుల ఆవేదన

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ ఉన్నత పాఠశాలలో 3-10  తరగతుల్లో 550 మంది విద్యార్థులున్నారు. ఉపాధ్యాయులు ఏడుగురే.


నెల్లూరు జిల్లా డక్కిలి మండలం కేవీపల్లి పాఠశాలలో ఉన్నది ఒకే ఉపాధ్యాయుడు. 5 తరగతుల్లోని 64 మంది విద్యార్థులకు ఆయనే పాఠాలు చెప్పాల్సి వస్తోంది.


ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం, ఉపాధ్యాయుల పదవీ విరమణలు, మరణాలకు తోడు.. కొత్త నియామకాలు లేకపోవడంతో బోధించేవారు కరవయ్యారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అధికారులు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకొస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో 30, ఉన్నత పాఠశాలల్లో 40 మంది పిల్లలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతులతో సంబంధం లేకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను ఇస్తున్నారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు అన్ని తరగతులకు పాఠాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు, గదుల కొరత కారణంగా కొన్నిచోట్ల 70-90 మంది పిల్లలు ఒకే గదిలో కిక్కిరిసి కూర్చోవాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4 ,5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది.

పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 6 లక్షల మంది పిల్లలు పెరిగారు. ప్రైవేటు బడుల నుంచి వీరు సర్కారు పాఠశాలల్లో చేరారు. మరోవైపు 2018 తర్వాత డీఎస్సీ నిర్వహించలేదు. గత మూడేళ్లలో పదవీ విరమణలు, కొవిడ్‌ మరణాల కారణంగా దాదాపు 2వేల ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. నిబంధనల ప్రకారం 40 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలి. సరిపడా ఉపాధ్యాయులు లేక కొన్నిచోట్ల 90 మంది పిల్లలకు ఒకే సెక్షన్‌ నిర్వహిస్తున్నారు. దీంతో గదిలో చివర ఉన్నవారికి పాఠం అర్థం కావడం లేదు.

* గతేడాది ఉపాధ్యాయుల బదిలీల సమయంలో 15 వేల పోస్టులను బ్లాక్‌ చేశారు. అంటే అవన్నీ ఖాళీలే.

* బదిలీలు జరిగే సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 1,795 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది.

అరుణాచల్‌ప్రదేశ్‌ తర్వాత మనమే

రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు (18.94%) జాతీయ సగటు (6.80%) కన్నా ఏకంగా 3 రెట్లు అధికంగా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ 21.85 శాతం తర్వాత అత్యధిక ఏకోపాధ్యాయ బడులు రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. నూతన విద్యా విధానం ప్రకారం 250 మీటర్ల దూరంలోని 2,663 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వీటిలో సగానికిపైగా ఏకోపాధ్యాయ బడులే. దీంతో ఇక్కడి నుంచి పిల్లలే తప్ప ఉపాధ్యాయులు రావడం లేదు. ఫలితంగా హైస్కూళ్లపై ఒత్తిడి పెరుగుతోంది.

తెలుగు మాధ్యమం మూతతో సర్దుబాటు

ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలుండగా.. ఈ రెండింటిలోని విద్యార్థులను కలిపేసి, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. ఒకే తరగతిలో తెలుగు, ఆంగ్ల   మాధ్యమాల పిల్లల్ని కూర్చోబెట్టి బోధిస్తుండటంతో ఏం చెబుతున్నారో పిల్లలకు అర్థం కావడం లేదు. చాలాచోట్ల అనధికారికంగా తెలుగు మాధ్యమాన్ని మూసేసి, ఆ విద్యార్థులను ఆంగ్లానికి మార్చేస్తున్నారు. నెల్లూరు,  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు.  నెల్లూరు జిల్లాలో మిగులు ఉపాధ్యాయులకు బదిలీ ఆదేశాలు ఇచ్చేశారు.

* 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కలిపి లెక్కిస్తున్నారు. 60 మంది ఉంటేనే రెండో టీచర్‌ను ఇస్తున్నారు.

* ప్రాథమిక పాఠశాలల్లో ఎన్ని తరగతులున్నా 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ని కేటాయిస్తున్నారు. 46 మంది ఉంటేనే రెండో పోస్టు ఇస్తున్నారు.

ఉపాధ్యాయులు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు

విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కావాలంటూ చిన్నారులు నడిరోడ్డుపై బైఠాయించిన ఈ దృశ్యం కుప్పం- తిరుపత్తూరు ప్రధాన మార్గంలోనిది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుండ్లమడుగు ప్రాథమిక పాఠశాలలో 1-5 వరకు 162 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడిలో ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారు. దీంతో పిల్లల చదువు సరిగా సాగడం లేదంటూ తల్లిదండ్రులు గురువారం తరగతి గదులకు తాళాలు వేశారు. విద్యార్థులతో కలిసి బైఠాయించి గంటపాటు ధర్నా చేపట్టారు.

- న్యూస్‌టుడే, కుప్పం గ్రామీణ


310 మంది విద్యార్థులు.. నలుగురు ఉపాధ్యాయులు

నంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం మడెనహళ్లి ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 3, 4, 5 తరగతులను విలీనం చేశారు. దీంతో 8 తరగతులకు కలిపి 310 మంది విద్యార్థులయ్యారు. కానీ అక్కడున్నది నలుగురు ఉపాధ్యాయులే. దీంతో మిగిలిన సబ్జెక్టుల బోధన కుంటుపడుతోంది. పాఠశాలలో రెండు గదులే ఉండటంతో మిగిలిన తరగతులకు చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు.

- ఈనాడు డిజిటల్‌, అనంతపురం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు