Goreti Venkanna:గోరటి కవితకు జాతీయ ఘనత

ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. అద్భుతమైన ప్రకృతి వర్ణనతో కూడిన 32 గేయ కవితలతో ఆయన వెలువరించిన ‘వల్లంకి తాళం’ సంకలనానికి 2021కి గాను

Updated : 31 Dec 2021 04:38 IST

‘వల్లంకి తాళం’ కవితా సంకలనానికి గుర్తింపు
తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
దేవరాజు మహారాజుకు బాల సాహిత్య పురస్కారం

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. అద్భుతమైన ప్రకృతి వర్ణనతో కూడిన 32 గేయ కవితలతో ఆయన వెలువరించిన ‘వల్లంకి తాళం’ సంకలనానికి 2021కి గాను ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 20 భాషల్లో వెలువడిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర సాహిత్య యువ, బాల పురస్కారాలనూ ప్రకటించింది. కేంద్ర సాహిత్య పురస్కారం కింద రూ.లక్ష, తామ్ర పత్రం బహూకరిస్తారు. యువ, బాల పురస్కారాలకు రూ.50 వేల నగదు, తామ్రఫలకం ప్రదానం చేస్తారు. తెలుగు భాష నుంచి గోరటి వెంకన్నకు పురస్కారం దక్కింది.

‘గాలి పెదవులు తాకి వెదురు గానాలు
నీలి మబ్బులజూసి నెమలి నాట్యాలు
వద్ది మద్దెల మీద వల్లంకి తాళాలు
ఆటలపాటల దరువుకడవి తొలి గురువు’

అంటూ అద్భుతమైన ప్రకృతి వర్ణనతో మనస్సును కట్టిపడేసే 32 కవితలతో ‘వల్లంకి తాళం’ కవితా సంకలనాన్ని గోరటి వెంకన్న వెలువరించారు. ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..., గల్లీ సిన్నది..గరీబోళ్ల కథ పెద్దది’’ వంటి పాటలతో ప్రసిద్ధి చెందిన కవి గోరటి వెంకన్న (వెంకటయ్య) నాగర్‌కర్నూలు జిల్లా గౌరారంలో 1963లో నర్సింహా, ఈరమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన  పలు పుస్తకాలను, కవితలు, పాటలను రాశారు. తెలంగాణ జానపదాన్ని తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేశారు. పల్లె ప్రజల జీవన విధానం, రైతుల జీవితాలు, కులవృత్తులపైనే ఆయన ఎక్కువగా రచనలు చేశారు. ఈ పురస్కారానికి నందిని సిధారెడ్డి నీటి మనసు, అమ్మంగి వేణుగోపాల్‌ సహృదయ సాహిత్య విమర్శ వైవిధ్యం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కొండపొలంతో పాటు మరో పది రచనలు పరిశీలనకు వచ్చాయి. జ్యూరీ సభ్యులుగా డాక్టర్‌ సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్‌ కాత్యాయనీ విద్మహే వ్యవహరించారు.

‘దండకడియం’కు గుర్తింపు

సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు తగుళ్ల గోపాల్‌ కవితా సంకలనం ‘దండకడియం’ ఎంపికైంది. గోపాల్‌ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ.

* కేంద్ర సాహిత్య బాల పురస్కారానికి దేవరాజు మహారాజు రచన ‘నేను అంటే ఎవరు?’ (ఒక వైజ్ఞానిక వివరణ) ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి ఆయన స్వగ్రామం. జంతుశాస్త్రం ప్రొఫెసర్‌ అయిన దేవరాజు మహారాజు సుమారు మూడు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో కొనసాగుతున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లోనూ కథా సంపుటాలు, కథలు వెలువరించడంతో పాటు పలు అనువాదాలు చేశారు.  


తెలంగాణ సాహిత్యానికి, మట్టి మనిషి జీవన తాత్వికతకు గౌరవం: సీఎం కేసీఆర్‌

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం... తెలంగాణ సాహిత్యానికి, మట్టి మనిషి జీవనతాత్వికతకు దక్కిన గౌరవమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. వల్లంకి తాళం కవితా సంపుటికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమని ఆయన హర్షం వ్యక్తంచేశారు. గోరటి వెంకన్నకు ఏపీ సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు.


సాహితీ ప్రపంచంలో ఇది చాలా గొప్ప పురస్కారం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. వాగ్గేయ కవితా సంప్రదాయానికి దీనిని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా జీవితానికి ఇదో మధురానుభూతి. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపు నా ‘వల్లంకి తాళం’.

-గోరటి వెంకన్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని