Updated : 02 Jan 2022 10:05 IST

AP News: రూ.23 వేల కోట్ల అప్పు కావాలట!

చివరి 3 నెలలకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థన

రిజర్వు బ్యాంకు క్యాలెండర్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో రూ.23వేల కోట్ల రుణం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు తెలియజేసింది. ఆ బ్యాంకు వర్గాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత మొత్తం రుణం అవసరం అవుతుందో సమాచారం సేకరించాయి. ఆ సమాచారం మేరకు రుణ డిమాండ్‌ క్యాలెండర్‌ను రూపొందించాయి. దాని ప్రకారం జనవరిలో రూ.5,000 కోట్లు, ఫిబ్రవరిలో 11,000 కోట్లు, మార్చిలో రూ.7,000 కోట్ల చొప్పున మొత్తం రూ.23వేల కోట్లు అవసరమని ఏపీ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఇవి మారుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు తుది వివరాలు ఇస్తుంటాయి.

కేంద్రం అనుమతులు రావాలి: రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రాష్ట్రాలు రుణాలు తీసుకుంటాయి. వీటిని పొందేందుకు కేంద్రం నుంచి అనుమతి ఉండాలి. అప్పుడే బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తొలి 9 నెలల కాలంలో అంటే... ఏప్రిల్‌ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఉన్న రుణ పరిమితి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే అప్పులు తీసుకుంది. చివరి మూడు నెలలకు రాష్ట్రం ఎంత మేర అప్పు తీసుకోవచ్చనేది కేంద్రం నిర్ణయించాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది.

రూ.8,368 కోట్లకే పరిమితి: ఒక వైపు కేంద్రం పార్లమెంటులో చెప్పిన లెక్కలు, ఇతర సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో కేవలం రూ.8,368 కోట్ల రుణం తీసుకునేందుకే వెసులుబాటు ఉందని విశ్రాంత ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది రాష్ట్రం ఏకంగా రూ.23 వేల కోట్లు అవసరమని పేర్కొనడం చర్చనీయాంశమవుతోంది.

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.44,396.18 కోట్లను బహిరంగ మార్కెట్‌ రుణంగా తీసుకునే అవకాశం వచ్చింది. అందులో ఇంతవరకు రాష్ట్రం రూ.36,028 కోట్ల రుణం తీసుకుంది. ఇక రుణ అర్హత పరిమితి రూ.8,368 కోట్లే ఉంది.


Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts