AP News: వసూల్‌ రాజాలా.. ఎమ్మెల్యే బాబూరావు

ప్రజల కష్ట సుఖాలు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వసూల్‌ రాజాలా మారారని ఆయన వ్యతిరేక వర్గ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం

Updated : 03 Jan 2022 07:13 IST

వ్యతిరేక వర్గీయుల ఆరోపణ
జాతీయ రహదారిపై మానవహారం.. ఉద్రిక్తత

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ప్రజల కష్ట సుఖాలు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వసూల్‌ రాజాలా మారారని ఆయన వ్యతిరేక వర్గ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం అడ్డురోడ్డులో వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీపీ బొలిశెట్టి శారదా కుమారి, ఆమె భర్త గోవిందరావు మాట్లాడుతూ.. ‘ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే 68 వాహనాల నుంచి రూ.50వేల చొప్పున వసూలు చేశారు. సచివాలయాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నుంచి వసూళ్లు చేసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుంది. సీసీ రోడ్డులోనూ పర్సంటేజీ తీసుకున్నారు. లింగరాజుపాలెం రెసిడెన్షియల్‌ పాఠశాలలో రెండు ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రూ.2 లక్షల చొప్పున తీసుకున్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఇచ్చే లేఖలకూ విలువ కట్టి విక్రయించారు’ అని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓటమికి ఎమ్మెల్యేనే కారణమని విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, వైకాపా మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హితవు పలికారు.

నిరసన ర్యాలీ.. పోలీసుల అడ్డగింత
సమావేశం తర్వాత ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా ఎంపీపీ శారదా కుమారి దంపతులు, మద్దతుదారులు నిరసన ర్యాలీ చేపట్టారు. పెదగుమ్ములూరు నుంచి వెయ్యిమందితో జాతీయ రహదారి వద్దకు చేరుకోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జాతీయ రహదారిపైకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎస్సై శ్రీనివాస్‌ ఎంపీపీ దంపతులకు సర్దిచెప్పగా.. పాత జాతీయ రహదారి కూడలికి చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ‘జగన్‌ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు’ అంటూ నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని