Booster Dose: బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా!

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి

Updated : 05 Jan 2022 08:22 IST

ఎస్‌ఈసీ పరిశీలన త్వరలో అనుమతి లభించే అవకాశం

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి (డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పరిశీలిస్తోంది. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. ‘ఒమిక్రాన్‌’ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ‘బూస్టర్‌ డోసు’పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దాదాపు 5,000 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో సగం మందిని కొవాగ్జిన్‌, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్‌ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా చుక్కల మందు టీకాపై క్లినికల్‌ పరీక్షలను నిర్వహించి, టీకాను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫారసు, డీసీజీఐ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని