CBI: శ్యాంప్రసాద్‌రెడ్డి వాటా వైవీ సుబ్బారెడ్డికి..ఇందూ కేసులో సీబీఐ వాదనలు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ప్రాజెక్టును చేపట్టడానికి ఏర్పాటు చేసిన వసంత ప్రాజెక్ట్స్‌లో వాటాలను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారని.. ప్రతిఫలంగా కూకట్‌పల్లిలోని చిడ్కో (సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)కు

Updated : 08 Jan 2022 07:19 IST

ప్రతిఫలంగా చిడ్కో ప్రాజెక్టుకు అదనంగా ప్రభుత్వ భూమి
జగన్‌ కంపెనీల్లో శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.70 కోట్ల పెట్టుబడుల

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ప్రాజెక్టును చేపట్టడానికి ఏర్పాటు చేసిన వసంత ప్రాజెక్ట్స్‌లో వాటాలను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారని.. ప్రతిఫలంగా కూకట్‌పల్లిలోని చిడ్కో (సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)కు అదనంగా ఎలాంటి బిడ్‌ లేకుండా 15 ఎకరాలను నాటి ప్రభుత్వం నుంచి పొందారంటూ సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఎంబసీ కన్సార్షియం పేరుతో ప్రాజెక్టు పొందిన శ్యాంప్రసాద్‌ వసంత్‌ ప్రాజెక్ట్స్‌ను ఎస్పీవీగా చూపుతూ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పింది. ఒప్పందం కుదిరేనాటికి కన్సార్షియంలోని భాగస్వాములకు ఎలాంటి వాటాలు లేవని, కేవలం వసంత్‌ ప్రాజెక్ట్స్‌ యజమాని వసంత కృష్ణప్రసాద్‌ తల్లి పేరుతో మాత్రమే కంపెనీ ఉందని తెలిపింది. గచ్చిబౌలి ప్రాజెక్టులో కృష్ణప్రసాద్‌, వై.వి.సుబ్బారెడ్డి సమాన భాగస్వాములని పేర్కొంది. ఇందూ- గృహనిర్మాణ మండలి వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వసంత్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు దాని అధినేత, ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు.

తప్పుడు పత్రాలు సృష్టించిన వసంత ప్రాజెక్ట్స్‌
సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ గచ్చిబౌలిలో 4.29 ఎకరాల్లో నిర్మించిన విల్లాలను కృష్ణప్రసాద్‌, వై.వి.సుబ్బారెడ్డి తమ బంధువులకు కేటాయించుకుని లబ్ధి పొందారన్నారు. గృహనిర్మాణ మండలి నుంచి ప్రాజెక్టును పొందడానికి.. కృష్ణప్రసాద్‌ ఒత్తిడితో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వసంత ప్రాజెక్ట్స్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ వాంగ్మూలం ఇచ్చారన్నారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ టెక్‌జోన్‌, గృహనిర్మాణ మండలి ప్రాజెక్టులను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి పొందారని, ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌లో రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. 48 మంది సాక్షులు, 6 వేల పత్రాల ఆధారాలతో అభియోగపత్రాన్ని దాఖలు చేశామన్నారు. అప్పటి గృహనిర్మాణ మండలి వీసీ మహంతితో కలిపి కుట్ర చేయడం ద్వారా గృహనిర్మాణ మండలికి నష్టం చేకూర్చి వ్యక్తిగతంగా లబ్ధి పొందారన్నారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయలేదని.. ఎంఐజీ, ఎల్‌ఐజీ గృహాలను నిర్మించలేదని చెప్పారు. విచారణలో నేరం రుజువవుతుందని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కృష్ణప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వినోద్‌ దేశ్‌పాండే సీబీఐ వాదనలను తోసిపుచ్చారు. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులతో ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేశామంటూ రాతపూర్వక వాదనలు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

మరో రెండు పిటిషన్ల ఉపసంహరణ
ఇందూ-గృహ నిర్మాణ మండలి కేసులో నిందితులుగా ఉన్న బెంగళూరుకు చెందిన ఎంబసీ రియల్టర్స్‌, దాని అధినేత జితేంద్ర (జితూ) వీర్వాణిలు తమపై కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. గృహనిర్మాణ మండలి ప్రాజెక్టును పొందడంలో అర్హత సాధించడానికి ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి ఎంబసీ గ్రూపు సాయాన్ని తీసుకున్నారు. ప్రతిఫలంగా ఈ కంపెనీ రూ.28.70 కోట్లు లబ్ధి పొందిందని, అంతేగాకుండా వీర్వాణి తనతోపాటు కుమారుడి పేరుతో మూడు విల్లాలను బుక్‌ చేసుకుని వాటిని నిర్మాణం పూర్తికాకుండానే విక్రయించి, రూ.1.46 కోట్లు లబ్ధి పొందారని సీబీఐ ఆరోపించింది. తమపై కేసు కొట్టివేయాలంటూ 2016లో వీర్వాణి హైకోర్టులో పిటిషన్‌ వేసి, స్టే తెచ్చుకోవడంతో విచారణ ఆగిపోయింది. శుక్రవారం ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. నిందితుల తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి పిటిషన్ల ఉపసంహరణకు అనుమతి కోరారు. అనుమతించిన న్యాయమూర్తి పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని