CM Jagan: 24,419 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం అదనంగా మరో 19 ల్యాబ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం (లీటర్‌ ప£ర్‌ మినిట్‌) సామర్థ్యం కలిగిన 176 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లతోపాటు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు,

Updated : 11 Jan 2022 04:53 IST

‘వర్చువల్‌’ విధానంలో ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌
మరో 19 ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు
రోజుకు లక్ష నమూనాల సామర్థ్యం
ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
ఆక్సిజన్‌ ప్లాంట్లు జాతికి అంకితం

ఈనాడు, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం అదనంగా మరో 19 ల్యాబ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం (లీటర్‌ పర్‌ మినిట్‌) సామర్థ్యం కలిగిన 176 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లతోపాటు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్‌ పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 24,419 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తాడేపల్లి కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కొవిడ్‌ నియంత్రణపైనా అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న 20 కాకుండా అదనంగా మరో 19 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు సిద్ధమవుతున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ట్రూనాట్‌ ల్యాబ్‌లతో కలిపితే 150 ల్యాబ్‌లు సమకూరుతాయని తెలిపారు. వీటి ద్వారా రోజుకు లక్ష నమూనాలను పరీక్షించవచ్చన్నారు. విజయవాడలో ఏర్పాటైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్‌ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని.. కరోనా చికిత్స, టీకాల పంపిణీలో ఏపీ అగ్రగామిగా ఉందని చెప్పారు. కొవిడ్‌లో ఎలాంటి వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన 32 ఆక్సిజన్‌ ప్లాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టిన 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేసినట్లు సీఎం వెల్లడించారు. ‘50 పడకల సామాజిక వైద్యశాలల్లోనూ ఆక్సిజన్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 100 పడకలు దాటిన 71 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 247 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మలి విడత కొవిడ్‌లో ఆక్సిజన్‌ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆక్సిజన్‌ ట్యాంకర్లను విమానాలు, నౌకల ద్వారా రప్పించాల్సి వచ్చింది. ఈ గుణపాఠాలతో రూ.426 కోట్లు ఖర్చు చేసి, నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. మొత్తమ్మీద 24,419 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పడింది. కొవిడ్‌ కారణంగా చిన్నపిల్లలు ఇబ్బందిపడకుండా 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం’ అని వివరించారు.


ఫిబ్రవరి నాటికి 39 వేల నియామకాలు

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయినందువల్ల రాష్ట్రంలో ఉన్నత వైద్య సంస్థలు లేకుండా పోయాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు, గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా ఏర్పాటు చేయబోతున్న వైఎస్సార్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలు 80% పూర్తయ్యాయి. కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా నాలుగుచోట్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు తరపున చికిత్సలను రోగుల అవసరాలకు తగ్గట్లు విస్తరిస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి తొలి విడత వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తయింది. 80% మందికి రెండు డోసులు అందించాం. ఇప్పటివరకు 82% మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చాం. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ వ్యవసాయ, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఆసుపత్రుల్లో అవసరాల కోసం చేపట్టిన 39వేల నియామకాలు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయి. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని సీఎం చెప్పారు.


రూ.కోటి విరాళం

కరోనా నివారణ, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ తరఫున రూ.కోటి విరాళం చెక్కును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందిస్తున్న విర్కో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఎం.మహావిష్ణు. పక్కన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.

- ఈనాడు, అమరావతి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని