AP News: రైతులకు, మీకు తేడా లేదా?

వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Updated : 11 Jan 2022 03:41 IST

వీధుల్లోకి రావడం మంచి పద్ధతి కాదు
చర్యలు ప్రారంభిస్తే మీరే నష్టపోతారు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌
విధుల్లో చేరి నిరసనలు కొనసాగిస్తామన్న సంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ప్రభుత్వ ఉద్యోగులై ఉండీ వీధుల్లోకి రావడం సరైన పద్ధతి కాదు. రైతులకూ... మీకు తేడా లేదా? మీకు కొన్ని నియమాలు, నిబంధనలున్నాయి. ప్రభుత్వం అందరికీ ప్రొబేషన్‌, కన్‌ఫర్మేషన్‌ ఇస్తుంది. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించదు. రోడ్లపైకి వస్తే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలొస్తాయని అనుకుంటున్నారేమో... ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే తర్వాత నష్టపోతారని గ్రహించండి. ఉద్యోగులు మీ మాట వినడం లేదని కొందరు అంటున్నారు. మీ మాట వారు వినడం లేదంటే మీరు నాయకులు కారన్న మాటే. అలాంటప్పుడు మిమ్మల్ని సమావేశానికి పిలిచి మాట్లాడాల్సిన పని లేదు. మీకు ఇదే చివరి సమావేశం. విధులు బహిష్కరించి రోడ్లపైకి రావడం క్షమార్హం కాదు. మీరు మూడు రోజులపాటు చేసిన కార్యక్రమాలతో రెండేళ్లపాటు కాపాడుకుంటూ వచ్చిన మంచితనం కోల్పోయారు. సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పెట్టి వాటిని ట్రోల్‌ చేస్తే మీకే నష్టం. మీపట్ల ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు.

ప్రొబేషన్‌ ఖరారే సమస్యకు పరిష్కారం
‘సచివాలయాల వ్యవస్థను సీఎం మానసపుత్రిక అని చెబుతున్నప్పుడు ప్రొబేషన్‌ ప్రక్రియ ప్రారంభించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు. మా సహచర ఉద్యోగులు మేం చెబితే వినే పరిస్థితుల్లో లేరు. ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం. వెంటనే ప్రక్రియ ప్రారంభించి సంక్రాంతి కానుకగా అందించాలి. మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్న అధికారులను కట్టడి చేయాలి’ అని వార్డు, సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.

 


జూన్‌ 30లోగా ప్రొబేషన్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు
‘ఉద్యోగుల ప్రొబేషన్‌ జూన్‌ 30లోగా పూర్తి చేస్తామని అజయ్‌ జైన్‌ హామీ ఇచ్చారు. వెంటనే విధులకు తిరిగి హాజరు కావాలని ఉద్యోగులను కోరుతున్నాం. ఆందోళనల వెనుక కొన్ని శక్తులు పని చేస్తున్నాయి. సీఎం జగన్‌పై మాకు నమ్మకం ఉంది’

- అంజన్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


వెంటనే పే స్కేల్‌ వర్తింపజేయాలి
‘వెంటనే విధుల్లో చేరాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. వెంటనే పేస్కేల్‌ వర్తింపజేయాలని మేమూ కోరాం’

- రాజేశ్‌, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు


విధుల్లో చేరి పెన్‌డౌన్‌
‘ఉద్యోగులు మంగళవారం నుంచి విధులకు హాజరవుతారు. కానీ పెన్‌డౌన్‌ చేస్తాం. ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేవరకు పనులు చేయం. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశాం’

- వి.శ్రీనివాసరావు, ఏపీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని