Education: బడి దూరం.. చదువు భారం

ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. దీంతో విద్యార్థులకు బడి దూరం పెరగడంతో పాటు రవాణా ఛార్జీల భారం పడనుంది. తొలుత విడతల వారీగా విలీనం చేయాలని భావించారు.

Updated : 11 Jan 2022 15:46 IST

3 కిలోమీటర్ల పరిధిలోని తరగతుల విలీనం వేగవంతం
ఉన్నత పాఠశాలలకు 3,4,5 క్లాసుల తరలింపునకు మ్యాపింగ్‌
విద్యార్థులపై పడనున్న రవాణా ఛార్జీల భారం

ఈనాడు, అమరావతి: ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. దీంతో విద్యార్థులకు బడి దూరం పెరగడంతో పాటు రవాణా ఛార్జీల భారం పడనుంది. తొలుత విడతల వారీగా విలీనం చేయాలని భావించారు. ఇటీవల జరిగిన పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశించిన నేపథ్యంలో ఒకేసారి మూడు కిలోమీటర్ల దూరానికి సంబంధించిన మ్యాపింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం కిలోమీటరు దూరంలో ఉన్న 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేస్తే బడి 3 నుంచి 4.5 కిలోమీటర్ల దూరం పెరగనుంది. కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువ దూరమే ఉండవచ్చు. ప్రాథమిక పాఠశాల నుంచి మ్యాపింగ్‌ చేస్తున్నారు. విద్యార్థి నివాసానికి ప్రాథమిక బడులు కిలోమీటరు, కొన్నిచోట్ల కిలోమీటరున్నర దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు తీసుకుంటే దూరం 4 నుంచి 4.5 కిలోమీటర్లు అవుతుంది. 10 ఏళ్లలోపు పిల్లలు ఇంత దూరం ప్రతి రోజు వెళ్లి రావాల్సి ఉంటుంది.

తనిఖీకి ప్రత్యేక కమిటీ: ఇప్పటికే కొందరు ప్రధానోపాధ్యాయులు మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టగా.. దీన్ని పరిశీలించేందుకు మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు రూపొందించిన నివేదికలను ఈ కమిటీ పరిశీలించి కమిషనరేట్‌కు ఆన్‌లైన్‌లో వివరాలు పంపిస్తోంది. నివేదిక హార్డ్‌ కాపీని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు కలిపినవి ఎంత దూరంలో ఉన్నాయి? ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? బైపాస్‌ రోడ్‌, కాల్వలు, రైల్వేగేటు లాంటివి దాటాల్సి వస్తుందా? ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఎన్ని తరగతి గదులు ఉన్నాయి? 3, 4, 5 తరగతుల వారు రావడంతో అదనంగా ఎన్ని గదులు అవసరం? వంటి వివరాలను సేకరించారు.

44 మంది వరకు ఒక్కరే..: ఫౌండేషన్‌ బడుల్లోని 1, 2 తరగతుల్లో 30 నుంచి 44 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించనున్నారు. 45-74 మధ్య ఉంటేనే రెండో టీచర్‌ను ఇస్తారు. రాష్ట్రంలో 1-5తరగతుల్లో 1-30 విద్యార్థులున్నవి 13,536 కాగా.. 31-60 వరకు ఉన్నవి 11,070 బడులు ఉన్నాయి. వీటిల్లో నుంచి 3,4,5 తరగతులు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనమైతే 1,2 తరగతుల్లో ఉండే విద్యార్థుల సంఖ్య 40లోపే ఉంటుంది. దీంతో ఆయా పాఠశాలల్లో ఒక్క ఎస్జీటీని ఉంచి, మిగతా వారిని ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు.

బాలికల విద్యపై ప్రభావం..: పాఠశాల దూరం పెరగడంతో విద్యార్థులు ఆటోలు, రవాణా సదుపాయాన్ని వినియోగించుకుంటే అదనంగా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయం లేని చోట పుస్తకాల బ్యాగు బరువులను మోసుకుంటూ రాకపోకలు సాగించాలి. బడి దూరం పెరగడం బాలికల విద్యపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

తగ్గిపోనున్న పాఠశాలలు..
నూతన విద్యా విధానం కింద తీసుకుంటున్న చర్యల ప్రకారం రాష్ట్రంలో ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి చివరికి 10,826 పాఠశాలలే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న 33,813 ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని మినహా 3, 4, 5 తరగతులు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. వందలోపు విద్యార్థులు ఉన్న వాటిలో ప్రాథమిక తరగతులను విలీనం చేయడం లేదు. భవిష్యత్తులో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని