Updated : 12 Jan 2022 06:03 IST

Ticket Rates: టికెట్ల ధరలు గిట్టుబాటు కావు

బీ, సీ కేంద్రాల్లో పెంచాలి

ప్రతిపాదించిన ఫిల్మ్‌ ఛాంబర్‌, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు

తక్కువ ధరలు ఉంటేనే మేలన్న సినీగోయర్స్‌ ప్రతినిధులు

సినిమా టికెట్లపై ఏర్పాటైన కమిటీ సమావేశంలో చర్చ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సినిమా థియేటర్లకు జీవో 35 ప్రకారం నిర్దేశించిన టికెట్ల ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావని.. ఆ రేట్లకు టికెట్లు అమ్మితే విద్యుత్తు ఛార్జీలు, నిర్వహణ ఖర్చులూ రావని తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులు పేర్కొన్నారు. బీ, సీ కేంద్రాల్లోని థియేటర్లలో కనిష్ఠంగా రూ.40, గరిష్ఠంగా రూ.100 వరకూ టికెట్‌ ధర ఉండేలా వెంటనే సవరించాలని ప్రతిపాదించారు. సినిమా టికెట్ల ధరలపై పరిశీలనకు ప్రభుత్వం నియమించిన కమిటీ సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షుడు ముత్యాల రామ్‌దాస్‌, డిస్ట్రిబ్యూటర్‌ తుమ్మల సీతారామ ప్రసాద్‌, ఎగ్జిబిటర్‌ వేమూరి బాలరత్నం మాట్లాడుతూ... అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా టికెట్ల ధరలు పెంచాలన్నారు.

అవన్నీ ఒకేలా.. టికెట్‌ ధరల్లోనే వ్యత్యాసమా?

‘పంచాయతీ, నగర పంచాయతీలు, పురపాలక, నగరపాలక సంస్థలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా సినిమా థియేటర్లకు విద్యుత్తు ఛార్జీలు, జీఎస్టీ, డిజిటల్‌ ఛార్జీలు ఒకేలా వసూలు చేస్తున్నప్పుడు నిర్ణయించిన టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఎందుకు? భౌగోళిక పరిధిని బట్టి కాకుండా. ఏసీ, నాన్‌ ఏసీ కేటగిరీలుగా విభజించి టికెట్ల ధరలు నిర్ణయించాలి’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులు కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే...
నీ బీ, సీ కేంద్రాల్లో టికెట్ల ధరలు మరీ తక్కువగా ఉండటంతో ఇప్పటికే 200 వరకూ థియేటర్లు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 200-300 థియేటర్లు మూసేయాల్సి వస్తుంది. రాయలసీమ తదితర ప్రాంతాల్లో బీ, సీ కేంద్రాలే అధికం.

అలాంటిచోట ఈ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుంది. ప్రేక్షకులకు వినోదం అందదు.

* సంక్రాంతిలోగా బీ, సీ కేంద్రాల్లో టికెట్ల ధరలు పెంచితే ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సీజన్‌లో వచ్చే కలెక్షన్లు మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లు నిర్వహణకు ఉపయోగపడతాయి. వీలైనంత త్వరగా టికెట్ల ధరలు పెంచాలి.

* సాధారణంగా ఏ సినిమాకైనా లభించే మొత్తం వసూళ్లలో తెలంగాణ నుంచి 40%, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 60% ఉండేవి. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గడంతో ‘పుష్ప’ సినిమాకి లభించిన మొత్తం వసూళ్లలో తెలంగాణ నుంచి 60%, ఏపీ నుంచి 40% వచ్చాయి. రాత్రి కర్ఫ్యూ విధించడంతో సెకండ్‌ షోపై ప్రభావం పడుతోంది.

టికెట్‌ ధర తక్కువుంటే.. పదే పదే వస్తారు

సినీ గోయర్స్‌ ప్రతినిధులుగా కమిటీలో సభ్యులుగా ఉన్న ఓంప్రకాశ్‌ నారాయణ, డాక్టర్‌ జూపల్లి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరల వీలైనంత తక్కువగా ఉంటే ప్రేక్షకులు కూడా పదే పదే (రిపీట్‌ ఆడియన్స్‌) థియేటర్‌కు వచ్చే అవకాశం ఉంటుందని, బ్లాక్‌మార్కెట్‌ అరికట్టొచ్చని వివరించారు. సినీ గోయర్స్‌ ప్రతినిధిగా కమిటీలో సభ్యురాలిగా ఉన్న గంప లక్ష్మి మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్ల కంటే తినుబండారాల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లో కనీసం మంచినీళ్ల సీసాలనూ అనుమతించట్లేదు. మధుమేహంతో బాధపడేవారు జేబులో చాక్లెట్లు తీసుకెళ్లినా వాటినీ థియేటర్‌ సిబ్బంది అనుమతించట్లేదు. ఇది సరికాదు. టికెట్ల రేట్లు పెంచాలని కోరటం కాదు.. థియేటర్లలో సదుపాయాలు మెరుగుపరచాలి’ అని వివరించారు.

వారం, పది రోజుల్లో మరో సమావేశం

ప్రతిపాదనలపై చర్చించేందుకు వారం, పది రోజుల్లో మరోమారు సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని