Updated : 25 Jan 2022 03:19 IST

Strike: సమ్మె చేసి తీరతాం

ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యశాఖ సంఘాలు ప్రత్యేకంగా అందజేత
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి
నేడు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు
ఈనాడు - అమరావతి

వేతన సవరణ కమిషన్‌తో పాటు మరో ఐదు అంశాలపై పీఆర్సీ సాధన సమితి సోమవారం ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి (తెల్లవారితే 7వ తారీఖు) ఉద్యోగులు అందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చాక ఉద్యోగ సంఘాల్లో అపోహలు తొలగించేందుకంటూ మంత్రుల కమిటీ వేయడం ఏంటని ప్రశ్నించింది. పీఆర్సీ ఉత్తర్వులు నిలిపివేత, జనవరి నెలకు పాత వేతనాలు, అశుతోష్‌మిశ్ర నివేదిక ఇస్తామని హామీ లభిస్తేనే కమిటీతో చర్చలకు వెళ్తామని ప్రకటించింది. సమ్మెకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘాలు కార్మిక చట్టం నిబంధనల మేరకు శశిభూషణ్‌కు ప్రత్యేకంగా సమ్మె నోటీసు ఇచ్చాయి. ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి.

మంత్రుల కమిటీపై ఉత్తర్వులు
మరోపక్క, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు, సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులు కాగా, సీఎస్‌ సమీర్‌శర్మ సభ్య-కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీపై ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసినా, ఉత్తర్వులు ఇవ్వలేదని, దాని పరిధి ఏంటో తెలియదని పీఆర్సీ ఉద్యోగుల స్టీరింగ్‌ కమిటీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం అధికారిక ఉత్తర్వులను ఉద్యోగ సంఘాల నేతలకు అందించారు.

సమ్మె నోటీసులో ఏముందంటే?
న్యాయమైన డిమాండ్ల కోసమే ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే పౌర సేవలకు ఏర్పడే అంతరాయాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
* 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, 26న తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ, 27 నుంచి 30 వరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ, 5న యాప్‌ల్లో వివరాల నమోదుకు సహకరించకపోవడం, ఆరున అర్ధరాత్రి (ఏడో తేదీ నుంచి) సమ్మెలోకి వెళ్తున్నాం.


5 డిమాండ్లు

1.  పీఆర్సీ దాని అనుబంధ అంశాల కింద అశుతోష్‌మిశ్ర కమిటీ నివేదిక బహిర్గతం చేయడం, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి పాత హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛన్‌, గ్రాట్యుటీ అమలు తేదీ, ఉద్యోగి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు, మోనిటరీ ప్రయోజనాల నుంచి రికవరీ నిలుపుదల, కేంద్ర పీఆర్సీ అమలు నిలిపివేత.
2.   సీఎం హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ రద్దు
3.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు
4.  కాంటింజెంట్‌, ఎన్‌ఎంఆర్‌, రోజువారీ వేతన ఉద్యోగుల క్రమబద్ధీకరణ
5. సమాన పనికి సమాన వేతనం కింద  పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపు


ఆషామాషీ ఉద్యమం కాదు
- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

తమ ఉద్యమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, సమ్మెలో ఉద్యోగులందరూ పాల్గొంటున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ‘గతంలో చర్చించిన సంఘాలే కదా అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వదులుకోవాలి. ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. కొత్త పీఆర్సీ జీతాల బిల్లుల నిలిపివేసి, పాత జీతాలు ఇవ్వడం, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను అందిస్తేనే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్తాం. ఉద్యమ కార్యాచరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ వివాదాలకు తావివ్వకుండా ఉద్యోగులు వ్యవహరించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులకు ఇది బాధాకరమైన రోజు. కావాలని కోరుకున్న ప్రభుత్వంలో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రభుత్వంలో ఎక్కడో లోపం జరిగింది. చర్చల తర్వాతే పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. జీతాల పెంపు అంటూ ప్రభుత్వం పౌరసమాజాన్ని తప్పుదారి పట్టిస్తోంది. పాత జీతాలు చెల్లించాలని ఇప్పటికే సీఎస్‌ సమీర్‌శర్మను కోరినా సానుకూలంగా కన్పించలేదు. సమ్మె సహా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్టీరింగ్‌ కమిటీలో నిర్ణయించాం. పీఆర్సీ, అనుబంధ అంశాలు హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ నిలుపుదల, అదనపు పింఛన్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి ప్రత్యేక హెచ్‌ఆర్‌ఏ, సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని నోటీసు ఇచ్చాం’ అని వెల్లడించారు.


కొత్త జీతాలకు హడావుడి ఎందుకు?
- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఉద్యోగుల రుణాలు, అడ్వాన్సులుగా ఇవ్వాల్సిన రూ.2,100 కోట్లు ఇచ్చేందుకు లేని హడావుడి కొత్త జీతాలకు ఎందుకు? అని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘పాత పీఆర్సీ కావాలా? కొత్తది కావాలా? అనే దానిపై ఉద్యోగులకు ఐచ్చికం ఇవ్వాలి. కొత్త జీతాల బిల్లులు చేసేందుకు ట్రెజరీ విభాగంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగులకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకు? పీఆర్సీ, ఇతర అంశాలపై 12సార్లు చర్చలకు వచ్చినా న్యాయం జరగలేదు. అధికారుల కమిటీ నివేదిక ప్రకారమే పీఆర్సీ అమలు ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని నిలిపేసి అశుతోష్‌ మిశ్ర నివేదికను బయటపెడితేనే మంత్రుల కమిటీపై నమ్మకం కలుగుతుంది. మంగళవారం జరిగే ధర్నాలు, ర్యాలీలను విజయవంతం చేయాలి. ఉద్యోగుల బలాన్ని ప్రభుత్వానికి చూపించాలి. ఉద్యోగులు రాజకీయ దూషణలు చేయొద్దు. సీఎం జగన్‌ హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలి. పాత పింఛన్‌ను పునరుద్ధరించాలి’ అని డిమాండ్‌ చేశారు.


సమ్మెకు ఏకగ్రీవంగా ఆమోదం
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఏకగ్రీవంగా ఆమోదించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.‘గతంలో ఎప్పుడూ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి వెళ్లేది కాదు. ఇప్పుడు బయటపడ్డామంటే ప్రభుత్వం ఆలోచించాలి. పీఆర్సీలో నష్టం జరిగినందునే ఆందోళన చేస్తున్నాం.  జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలి. పీఆర్సీ అమలు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అశుతోష్‌మిశ్ర నివేదికను ఇవ్వాలి. పట్టింపులకు పోయి ప్రభుత్వం ఉద్యోగులను దూరం చేసుకుంటోంది. మంత్రుల కమిటీ సీఎంకు చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. కొన్ని అంశాల్లో సర్దుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. పీఆర్సీపై చర్చల సందర్భంగా అంగీకరించిన వాటినే కాకుండా ఇతర వాటిల్లోనూ కోత విధించారు. జీతం తగ్గితే భద్రత ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీలో ఉద్యోగులకు నష్టం కలిగించే వాటిని ఉత్తర్వుల్లో తీసుకువచ్చారు. సీసీఏ రద్దు చేశారు. అలాగని కేంద్రం ఇచ్చే రవాణా భత్యం ఇవ్వడం లేదు’ అని వెల్లడించారు. అంతకుముందు సచివాలయంలో ఆ సంఘం సమావేశంలోనూ మాట్లాడుతూ సమ్మె నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.


పీఆర్సీ ప్రకటించాక మంత్రుల కమిటీ ఏంటి?
- ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అపోహలు తొలగించేందుకు మంత్రులు కమిటీ ఏర్పాటు చేయడం ఎక్కడైనా ఉందా? అని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ‘మంత్రుల కమిటీ వేయడంలో సంప్రదాయాన్ని పాటించలేదు. ఉద్యోగుల ఆందోళన తెలిసేలా ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాం. పొరుగుసేవల ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉండగా, 23శాతమే ఇచ్చారు. ఫిట్‌మెంట్‌పై తప్ప ఇతర అంశాలపై కనీసం చర్చించలేదు. పీఆర్సీ సహా ప్రభుత్వ హామీలన్నింటినీ అమలు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఉద్యమ కార్యాచరణలో పాల్గొనే ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయొద్దు. ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు. పోలీసుల సమస్యలపైనా గతంలో పోరాడాం. పోలీసులు ఈ ఉద్యమంలో పాల్గొనకపోయినా ఆటంకం కలిగించవద్ద’ని కోరారు.


ఉపాధ్యాయులకు సమ్మె కొత్తకాదు
- ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు

ఉపాధ్యాయులకు సమ్మెలు కొత్త కాదని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు గుర్తుచేశారు. ‘ఉపాధ్యాయులందరూ ఐకాస ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. గతంలో అప్రెంటిస్‌షిష్‌ విధానం రద్దుకు ఆందోళనలు చేశాం. ప్రభుత్వాలు ఐదేళ్లు మాత్రమే ఉంటాయి. సంఘాలకు 75ఏళ్ల చరిత్ర ఉంది. ఇంటి అద్దెభత్యం పెంచకపోయినా, ఇప్పుడున్నదాన్ని కొనసాగించాలి. రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులు ఆవేదనతో ఉన్నారు. కలెక్టరేట్ల ముట్టడితోనైనా ప్రభుత్వం ఆలోచించాలి. పింఛన్‌ పాత శ్లాబులనే కొనసాగించాలి’ అని డిమాండ్‌ చేశారు.


మేలైన పీఆర్సీ సాధించే వరకు ఉద్యమం
- సీహెచ్‌ జోషప్‌ సుధీర్‌బాబు, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

మేలైన పీఆర్సీ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. తాజా జీవోలు తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగించే చర్యలను అడ్డుకుంటాం. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలైన నిర్ణయాలు తీసుకోవాలి.


మిగతా సంఘాలతో కలిసి పనిచేస్తాం
- ఆస్కారరావు, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఉద్యోగులకు అన్నివిధాలా న్యాయమైన నిర్ణయం తీసుకోవాలి. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాలు కొనసాగిస్తాం.


సమ్మెలో పాల్గొంటాం
-
వైవీ రావు, ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో కలిసి సమ్మెలో పాల్గొంటాం. ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించినప్పుడు మాకు కొంత నష్టం జరిగింది. కొన్ని ప్రయోజనాల కోల్పోయాం. వీటిని తిరిగి సాధించుకోవాల్సి ఉంది. ఇందుకు మిగతా సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం.


రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించాలి
తాత్కాలిక ఉద్యోగుల సభలో సంఘాల నేతల వ్యాఖ్య

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విజ్ఞతతో ఆలోచించాలని, సహేతుక డిమాండ్లను అంగీకరించాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఎన్‌ఎంఆర్‌, దినసరి వేతన, ఫుల్‌టైం, పార్ట్‌టైం, కంటింజెంట్‌, మినిమమ్‌ టైం స్కేల్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ‘ముఖ్యమంత్రి గారికి వేడుకోలు సభ’ నిర్వహించారు. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని సర్వీసులను క్రమబద్ధీకరించాలని గతంలోనే ప్రభుత్వం పదో పీఆర్సీకి సూచించిందని, ఈ ప్రభుత్వమైనా క్రమబద్ధీకరించాలని కోరారు. ఏపీఎన్జీవో జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వ ఉన్నతాధికారులకు అనేక దఫాలుగా సర్వీస్‌ క్రమబద్ధీకరణపై వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదని వాపోయారు. నాలుగు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా వివిధ విభాగాల్లో సేవలు అందించిన తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ నిర్వహించామని చెప్పారు. పీఆర్సీతో తాత్కాలిక చిరుద్యోగులు ఎక్కువగా నష్టపోయారని తెలిపారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, షేక్‌ సాబ్జీ సభకు మద్దతు తెలిపారు. ఏపీఎన్జీవో జేఏసీ నాయకులు శివారెడ్డి, వై.వి.రావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ నాయకుడు పాండురంగారావు, కాంట్రాక్టు, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకుడు కె.చంద్రకిరణ్‌, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని