Buddha Venkanna: అదుపులోకి తీసుకుని.. అర్ధరాత్రి విడుదల

మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Updated : 25 Jan 2022 07:44 IST

బుద్దా వెంకన్నను పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి, డీజీపీలపై ఆరోపణలు చేశారనే ఫిర్యాదుపై కేసు

ఈనాడు- అమరావతి, విద్యాధరపురం, న్యూస్‌టుడే: మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల మోహరింపు, తెదేపా కార్యకర్తల ప్రతిఘటనల మధ్య వెంకన్నను ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి వరకు ఆయన్ను విచారించారు. అనంతరం ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రాత్రి 11.15 గంటల సమయంలో విడిచిపెట్టారు. సోమవారం ఉదయం 11గంటలకు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, నాయకులతో కలిసి బుద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం రెండింటికి బుద్దా నివాసానికి ఏసీపీలు హనుమంతరావు, రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా చేరుకుని విచారణకు వెంట తీసుకెళుతున్నట్లు ఆయనకు తెలిపారు. నోటీసు ఇవ్వకుండా విచారణ దేనికంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఇదే సమయంలో తెదేపా నేతలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, నాగుల్‌మీరా, కార్యకర్తలు చేరుకున్నారు. దాదాపు 3గంటలసేపు పోలీసులు, నేతలకు మధ్య చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసుస్టేషన్‌కు వచ్చేందుకు వెంకన్న అంగీకరించడంతో కార్యకర్తలను చెదరగొడుతూ బందోబస్తు మధ్య ఆయన్ని తరలించారు. మంత్రి అనుచరుడు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్దా వెంకన్నపై పోలీసు కేసు నమోదైంది. రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు సెక్షను 153ఏ, భయోత్పాతం సృష్టించినందుకు సెక్షన్‌ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505(2) రెడ్‌విత్‌ 34 కింద కేసులు నమోదు చేశారు.

డీజీపీ వాటా ఎంత..?: బుద్దా
మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని బుద్దా వెంకన్న ఉదయం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీజీపీ వాటా ఎంతని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్‌ ఆఫ్‌ జగన్‌ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ‘మంత్రి కొడాలి నానిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? క్యాసినో నిర్వహించినట్లు సాక్ష్యాలున్నాయి. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు. అలాంటివారికి టిక్కెట్లివ్వడం చంద్రబాబు తప్పు. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా చంద్రబాబు ఇంటికి రా. చంద్రబాబు ఇంటి గేటు తాకగలవా?’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘నాని చరిత్ర గుడివాడలో అందరికీ తెలుసు. వర్ల రామయ్య పోలీసు అధికారిగా ఉన్నప్పుడు అరెస్టు చేశారని మర్చిపోయావా? గుడివాడ సంస్కృతిని చెడగొట్టావ’ంటూ విమర్శలు గుప్పించారు. షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట మారేది కొడాలి నానే అని జోస్యం చెప్పారు. తర్వాత ఆయన జగన్‌ను దూషిస్తారని పేర్కొన్నారు. ‘2024లో ఓడాక నీ పరిస్థితేమిటో తెలుస్తుంది. నీవు మాట్లాడే భాషేంటి?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్‌ నాయకులు వర్ల రామయ్య, మాజీ ప్రజాప్రతినిధులు బోండా ఉమా, జవహర్‌వంటి వారిని దూషించడం ఆయనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.

వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..
పోలీసులు అదుపులోకి తీసుకున్నాక బుద్దా వెంకన్న మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు  కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను అబద్ధాలు చెప్పలేదని, ఉన్న విషయాన్నే తెలిపానని వివరించారు.

 


బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకోవడం దారుణం
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గుడివాడ క్యాసినోపై వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకోవడమేంటని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా వాళ్లపై దాడిచేసిన వారిని వదిలేసి మాపైనే కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య. చేసిన పొరపాట్లకు పోలీసులు విచారణను ఎదుర్కొక తప్పదు’ అని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు ప్రజారక్షకులా? లేదా వైకాపా నేతలకు కాపలాదారులా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే లేని పోలీసులు.. ప్రతిపక్ష నేతను దుర్భాషలాడితే లేనివారు.. తెదేపా కేంద్ర కార్యాలయాన్ని వైకాపా మూకలు ధ్వంసం చేస్తే లేని పోలీసులు బూతులేంటని ప్రశ్నించిన బుద్దా వెంకన్నను మాత్రం అదుపులోకి తీసుకున్నారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు ఖండించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని