Padma Awards: పద్మాభిషేకం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఇటీవల హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ

Published : 26 Jan 2022 05:21 IST

జనరల్‌ బిపిన్‌ రావత్‌, కల్యాణ్‌సింగ్‌లకు పద్మవిభూషణ్‌

కొవిషీల్డ్‌ తయారీదారు సైరస్‌ పూనావాలా, టెక్‌ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌లకూ పద్మభూషణ్‌

రాజకీయ కురువృద్ధులు గులాం నబీ ఆజాద్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్యలకూ...

ఏపీ నుంచి ముగ్గురికీ, తెలంగాణ నుంచి ముగ్గురికీ పద్మశ్రీ గౌరవం

కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌

ఈనాడు, దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఇటీవల హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ సహా నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించింది. కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ రూపకర్తలైన భారత్‌ బయోటెక్‌ అధినేతలు కృష్ణ ఎల్ల-సుచిత్ర ఎల్ల దంపతులకూ... కొవిషీల్డ్‌ తయారీదారైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, టెక్‌ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లకు నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, రాజకీయ కురువృద్ధులు గులాం నబీ ఆజాద్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్యలతో పాటు మొత్తం 17 మందికి పద్మభూషణ్‌ను ప్రకటించింది. 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 3 దక్కాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి వీరికి పద్మశ్రీ...

పద్మశ్రీకి ఎంపికైనవారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు, భద్రాచల సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌ (మరణానంతరం) ఉన్నారు. తెలంగాణ నుంచి బీమ్లానాయక్‌ సినిమా పాట ద్వారా విశేష జనాదరణ పొందిన నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోయ గిరిజన గాయకుడు రామచంద్రయ్య, కాకతీయ నృత్యకళకు పునరుజ్జీవం పోస్తున్న కూచిపూడి నృత్యకారిణి, గురువు పద్మజారెడ్డి ఉన్నారు. ప్రముఖ సినీనటి షావుకారు జనకికి తమిళనాడు కోటాలో పద్మశ్రీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణలు అభినందనలు తెలిపారు.

34 మంది మహిళలకు...

మొత్తం పద్మ అవార్డుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు 13, మహారాష్ట్రకు 10 దక్కడం గమనార్హం. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో విడతలవారీగా జరిగే కార్యక్రమంలో విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పౌరపురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం వీటిని ప్రకటించారు.


పద్మ విభూషణ్‌లు వీరు...

1) జనరల్‌ బిపిన్‌ రావత్‌: ఉత్తరాఖండ్‌లో 1958, మార్చి 16న జన్మించారు. 1978లో దేహ్రాదూన్‌లోని భారత సైనిక శిక్షణ కేంద్రంలో 11వ గూర్ఖా రైఫిల్స్‌ విభాగంలోని అయిదవ రెజిమెంటల్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి... 2020 జనవరిలో భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా నియమితులయ్యారు. గత డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.

2) కల్యాణ్‌సింగ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో 1932, జనవరి 5న జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. భారతీయ జన్‌సంఘ్‌, జనతా పార్టీ, భాజపాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించి, తర్వాత దాన్ని భాజపాలో విలీనం చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా, రాజస్థాన్‌ గవర్నర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌ అదనపు బాధ్యతలు)గా సేవలు అందించారు. ఆయన సీఎంగా ఉండగానే బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన చోటుచేసుకొంది. కల్యాణ్‌సింగ్‌ గత ఏడాది ఆగస్టులో మృతిచెందారు.

3) ప్రభా ఆత్రే: మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు. శాస్త్రీయ సంగీత రీతుల్లో పేరొందిన కిరానా ఘరానా రీతిలో... ఆమె తన గాన మాధుర్యంతో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు. 1990లో పద్మశ్రీ, 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2002లో పద్మభూషణ్‌ వరించాయి. 1932, సెప్టెంబరు 13న పుణెలో జన్మించారు.

4) రాధేశ్యాం ఖేమ్కా: 1935లో బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో సంపన్న మార్వాడీ కుటుంబంలో జన్మించారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో సంరక్షణకు కృషిచేసిన కుటుంబం ఆయనది. అత్యంత అరుదైన సనాతన సాహిత్యాన్ని, మహా పురాణాలను సామాన్యులకు అందించడంలో ఖేమ్కా విశేష కృషి చేశారు. పాత్రికేయునిగా, గీతా ప్రెస్‌ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో మృతిచెందారు.


పద్మభూషణ్‌ గౌరవం పొందిన మరికొందరు...

* విక్టర్‌ బెనర్జీ: జాతీయ అవార్డులు పొందిన బెంగాలీ సినీనటుడు (పశ్చిమ బెంగాల్‌)

* గుర్‌మీత్‌ బావా: జానపద కళాకారుడు (పంజాబ్‌)

* మాధుర్‌ జాఫ్రీ: ప్రపంచ ప్రఖ్యాత షెఫ్‌, ఫుడ్‌ జర్నలిస్ట్‌ (అమెరికా)

* దేవేంద్ర ఝఝారియా: పారా ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ (రాజస్థాన్‌)

* రషీద్‌ ఖాన్‌: హిందూస్థానీ సంగీత కళాకారుడు (ఉత్తర్‌ప్రదేశ్‌)

* సంజయ రాజారాం: ప్రపంచ ప్రఖ్యాత గోధుమవంగడ శాస్త్రవేత్త (మెక్సికో)

* ప్రతిభా రే: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఒడియా రచయిత. క్వీన్‌ ఆఫ్‌ ఒడియా లిటరేచర్‌గా ఖ్యాతి (ఒడిశా)

* స్వామి సచ్చిదానంద: రచయిత, తాత్వికుడు, సంఘ సంస్కర్త, వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడంలో ప్రసిద్ధి (గుజరాత్‌)

* వశిష్ట్‌ త్రిపాఠి: ప్రముఖ న్యాయకోవిదుడు (ఉత్తర్‌ప్రదేశ్‌)

* రాజీవ్‌ మహర్షి: కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌, సివిల్‌ సర్వీస్‌ (రాజస్థాన్‌)


పద్మ పురస్కార విజేతలకు ముఖ్యమంత్రి జగన్‌ అభినందనలు

ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగు వారికి ఈ పురస్కారాలు దక్కడం గర్వకారణం’ అని పేర్కొన్నారు.


పద్మ అవార్డు గ్రహీతలకు చంద్రబాబు శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ముగ్గురికి పద్మ అవార్డులు రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమని తెదేపా అధినేత చంద్రబాబు హర్షం ప్రకటించారు. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జీఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మభూషణ్‌ అవార్డు దక్కడంపై శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ యాజమాన్యమైన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం వచ్చిందన్నారు. పద్మశ్రీకి ఎంపికైన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, వైద్యులు సుంకరవెంకట ఆదినారాయణ, తెలంగాణకు చెందిన దర్శనం మొగలయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డిలతోపాటు ప్రముఖ నటి షావుకారు జానకి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర పిచాయ్‌లకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కళల విభాగంలో షేక్‌ హాసన్‌కు మరణానంతరం పద్మశ్రీ రావడం ఆయనకు లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని