PRC: కదం తొక్కిన ఉద్యోగులు

‘‘కొత్త పీఆర్సీ... కోతల పీఆర్సీ మాకొద్దు, చెల్లించిన 9నెలల మధ్యంతర భృతిని వెనక్కి ఇవ్వాలనడం సిగ్గు సిగ్గు, మాట తప్ప వద్దు.. మడమ తిప్ప వద్దు’’ అంటూ ఉద్యోగుల నినాదాలతో జిల్లా కేంద్రాలు మార్మోగాయి. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన

Published : 26 Jan 2022 05:20 IST

రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు

కిక్కిరిసిన కలెక్టరేట్లు, కూడళ్లు, ధర్నాచౌక్‌లు

ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: ‘‘కొత్త పీఆర్సీ... కోతల పీఆర్సీ మాకొద్దు, చెల్లించిన 9నెలల మధ్యంతర భృతిని వెనక్కి ఇవ్వాలనడం సిగ్గు సిగ్గు, మాట తప్ప వద్దు.. మడమ తిప్ప వద్దు’’ అంటూ ఉద్యోగుల నినాదాలతో జిల్లా కేంద్రాలు మార్మోగాయి. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛన్‌దార్లు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఆందోళనలతో చాలాచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. పీఆర్సీపై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లలేమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టంచేశారు.

కర్నూలులో రోడ్డుపై బైఠాయింపు: కర్నూలులో రివర్స్‌ పీఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు.

జనసంద్రంగా కడప వీధులు: కడప కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లు ధర్నా నిర్వహించారు. నగర వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. వచ్చే నెల 7నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ నేతలు ప్రకటించారు. పీఆర్సీపై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు.

అనంతలో అర్ధనగ్న ప్రదర్శన: అనంతపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు కదం తొక్కారు. పండిత పరిషత్‌ ఉపాధ్యాయులు ‘పి.ఆర్‌.సి. వద్దు’ అంటూ శరీరంపై రాసుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగుల ఆగ్రహం: చిత్తూరులోని ఎన్జీవో భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ఉద్యోగులు, పింఛన్‌దారులు కదం తొక్కారు. మహిళా ఉద్యోగులూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు.

నెల్లూరులో ఉద్యమ గీతాలతో ఉత్సాహం: కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించడంతోపాటు... కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ గీతాలు ఆలపించారు.

కిటకిటలాడిన ఒంగోలు: ఉద్యోగ, ఉపాధ్యాయ నిరసనలతో ఒంగోలు కిటకిటలాడింది. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కో ప్రాంతం నుంచి బ్యానర్లు పట్టుకుని ర్యాలీగా కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకున్నారు.

గుంటూరులో కదన కుతూహలం: గుంటూరులో వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు ర్యాలీలతో కదం తొక్కారు. కొందరు తమ పిల్లలను వెంట తీసుకొచ్చారు. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ర్యాలీలో అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

గర్జించిన ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఉద్యోగులు గర్జించారు. జడ్పీ సెంటర్‌ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ధర్నాలో పాల్గొన్నారు.

నినదించిన కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చీకటి జీవోలను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

విశాఖలో మోకాళ్లపై నిరసన: విశాఖ కలెక్టరేట్‌ కూడలి నుంచి జగదాంబ కూడలి వరకు వేలాది మంది ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. కొందరు ఉద్యోగినులు మోకాళ్లపై నిరసన తెలిపారు. ఆందోళనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ సంఘీభావం తెలిపారు.

విజయనగరంలో ప్రదర్శన: విజయనగరంలో వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎలుగెత్తిన శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని 80 అడుగుల రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని