Updated : 28 Jan 2022 04:04 IST

Sajjala: ఆర్థిక బిల్లులను ఆపడం క్రమశిక్షణ ఉల్లంఘనే

వారు పరిపక్వత లేమితో వ్యవహరిస్తున్నారు
అవసరమైతే 4 మెట్లు దిగేందుకు సిద్ధంగా ఉన్నాం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘కొన్నిచోట్ల ఆర్థిక సంబంధమైన బిల్లులను అప్‌లోడ్‌ చేయకుండా ఆపుతున్నారు. అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. చాలా తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక చర్యగానూ భావించవచ్చు. అయినా సరే వచ్చి, చర్చించి సమస్యను పరిష్కరించుకోండని చెబుతున్నాం. మేం వేచి చూస్తున్నా వారు రాకపోవడం దురదృష్టకరం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘సమ్మెకు వెళ్తామంటున్నారు. చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె నిషిద్ధం. అయినా ప్రభుత్వం దీనిపై ఆలోచించడం లేదు. సీఎం సమక్షంలో ఫిట్‌మెంట్‌ ప్రకటించి, అంతా అయ్యాక... మళ్లీ మొదటికి వెళ్లడమంటే పరిపకత్వలేని తనం. అంతకంటే పెద్ద మాట మాట్లాడాలి. అందరూ బాధ్యతాయుత నేతలు. తొందరపాటు నిర్ణయం వద్దు. చర్చలకు రావాలని మళ్లీ కోరుతున్నాం. అపోహలను తొలగించేందుకు అవసరమైతే నాలుగు మెట్లు దిగాలనే ఉద్దేశంతో మూడోసారి వచ్చాం. ఆహ్వానం పంపడంతోపాటు ఫోన్‌చేసి స్వయంగా నాయకులతో మాట్లాడాం. చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుంది తప్ప, ఎక్కడో కూర్చొని డిమాండ్‌ పెట్టి... టీవీల్లో మాట్లాడితే సరిపోదు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చర్చిద్దామని ఇంతలా చెబుతున్నా రాకపోవడం దురదృష్టకరం. ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంటోందని చెబుతున్న ప్రతినిధులను... ఎలా పరిష్కరించుకోవాలనే దానికి వేరొక మార్గం ఏదైనా ఉందా? అని అడిగితే సమాధానం లేదు. చర్చలకు రాకుండా... షరతులు పెట్టడం సరికాదు’ అని తెలిపారు.

ఇతర ఉద్యోగ సంఘాల నేతలూ రావొచ్చు
‘పోరాట సమితి సభ్యులే కాకుండా, ఇతర ఏ సంఘాల సభ్యులు వచ్చినా చర్చలు జరుపుతాం. వారిచ్చే మంచి సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం’ అని సజ్జల పేర్కొన్నారు. ‘వాళ్లు ప్రత్యర్థులు, శత్రువులు కాదు. మా ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు. పే స్లిప్‌లు వస్తే ఎవరికెంత పెరిగిందో తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా నష్టపోతే సరిచేసేందుకు కట్టుబడి ఉన్నాం. సీఎం పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. మీ నాయకులకు చెప్పి, చర్చలకు పంపండని ఉద్యోగలోకానికి విన్నవిస్తున్నాం. చేయి దాటిపోకముందే అంశాన్ని ముగించే దిశగా ఆలోచించాలని కోరుతున్నాం’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘మీరు రాయబారులు కాదు. హెచ్‌ఆర్‌ఏపై వాళ్లు చర్చకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. ఎంత పీఆర్సీ పెరిగినా కొంత అటోఇటో తేడా ఉంటుంది. దీనిపై టీవీలు, టెంట్లలో మాట్లాడతారా? అధికారిక కమిటీతో మాట్లాడతారా? రాజకీయపార్టీగా మేం దీనిని రాజకీయం చేయడంలేదు’ అని మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


బాధ్యత ఉండాలి కదా?: బొత్స

‘27న మళ్లీ మనం కూర్చుందాం అని వారే చెప్పారు. అయినా రాలేదు. బాధ్యత ఉండాలి కదా. వారు చెప్పేదే జరగాలంటే కుదరదు కదా. ప్రభుత్వాన్ని నడిపేది వాళ్లే కదా’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘మొదట కమిటీకి ఆర్డర్‌ ఏదని ప్రశ్నించారు. ఉత్తర్వు వచ్చాక.... ఈ కమిటీతో మాకేమవసరం అంటున్నారు. చర్చలకు రమ్మంటే రానంటున్నారు. చర్చల సమయంలో ఆర్థిక శాఖ అధికారులది తప్పని నిరూపించగలిగితే ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం’ అని తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని