Union Budget 2022: మళ్లీ మనదే జోరు!

కరోనా కష్టాలను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. వడివడిగా అడుగులు వేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వృద్ధిని సాధించబోతోంది. తద్వారా చైనాను తోసిరాజని.. ‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా మన దేశం తిరిగి గుర్తింపు పొందబోతోంది.

Updated : 01 Feb 2022 03:56 IST

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌
వచ్చే రెండేళ్లూ కొనసాగనున్న హవా
2022-23లో 8-8.5% వృద్ధి
కొవిడ్‌ను తట్టుకుని నిలదొక్కుకున్న వ్యవసాయ రంగం
 భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేలా దృఢంగా దేశం
 ఆర్థిక సర్వే అంచనాలు
దిల్లీ

కరోనా కష్టాలను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. వడివడిగా అడుగులు వేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వృద్ధిని సాధించబోతోంది. తద్వారా చైనాను తోసిరాజని.. ‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా మన దేశం తిరిగి గుర్తింపు పొందబోతోంది. ఆ హోదాను కనీసం రెండేళ్ల పాటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. సోమవారం వెలువడిన ఆర్థిక సర్వే ఈ మేరకు అంచనాలు వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు కట్టింది. దీన్నిబట్టి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా ముందు నాటి స్థాయిని దాటి పుంజుకున్నాయని స్పష్టమవుతోంది. ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం ఇంకా ఉందని సర్వే తేల్చింది. మొత్తం మీద స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సూచీలను పరిశీలిస్తే భవిష్యత్‌ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సన్నద్ధంగా ఉందని వివరించింది. దేశంలో పెరుగుతున్న వ్యాక్సినేషన్‌ విస్తృతి, సరఫరా రంగంలో వచ్చిన సంస్కరణలు, నియంత్రణల సడలింపు వంటివి వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవనున్నాయని పేర్కొంది.

పార్లమెంటుకు సమర్పించిన నిర్మల
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్షిక ‘రిపోర్టు కార్డు’గా పరిగణించే ఈ సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటుకు సమర్పించారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, మహమ్మారి సంబంధ అవరోధాల కారణంగా పొంచి ఉన్న ముప్పులను అందులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో.. పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు, ఉద్యోగాలను సృష్టించేందుకు నిర్మల పలు చర్యలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొవిడ్‌ ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం జీడీపీ 1.3 శాతం ఎక్కువగా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ తెలిపారు. తాజా ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివీ.

* వచ్చే ఏడాది చమురు ధరలు పీపాకు 70-75 డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాల ప్రాతిపదికన సర్వేలో లెక్కలు కట్టారు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధర 90 డాలర్లుగా ఉంది. రాబోయే సీజన్‌లో సాధారణ వర్షపాతం ఉండొచ్చని, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఒక క్రమపద్ధతిలో ద్రవ్య లభ్యతను తగ్గించుకోవచ్చన్న అంచనాలూ దీనికి ఆధారభూతమయ్యాయి.
* 2022-23 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుకు సంబంధించి సర్వేలో పేర్కొన్న అంచనాలు.. ప్రపంచబ్యాంకు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వేసిన 9 శాతం అంచనా కన్నా ఇది తక్కువగా ఉంది. ఎస్‌ అండ్‌ పీ, మూడీస్‌ కట్టిన లెక్కల కన్నా ఇది స్వల్పంగా ఎక్కువగా ఉంది.

తక్కువ ప్రాతిపదికేమీ కాదు..
2022-23లో అంచనా వేసిన 8-8.5 శాతం వృద్ధి అనేది తక్కువ ప్రాతిపదికన రూపొందించింది కాదు. 2021-22లో వాస్తవ జీడీపీ వృద్ధి 9.2 శాతంగా ఉండొచ్చని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. కొవిడ్‌ ముందు నాటి (2019-20) ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ప్రాతిపదికన చూస్తే దాన్ని 10 శాతంగా పరిగణించొచ్చు.

పెరిగిన రాబడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి పెరిగింది. దీంతో ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని కొనసాగించడానికి, అవసరమైతే పెంచడానికి సర్కారుకు వెసులుబాటు లభించింది. 2021-22 బడ్జెట్‌లో పేర్కొన్న 6.8 శాతం ద్రవ్యలోటుకు పరిమితం కావడానికి ఇది వీలు కల్పిస్తోంది.
* గత రెండేళ్లలో కొవిడ్‌ ఉద్ధృతి.. దేశ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చింది. ఎంఎస్‌ఎంఈ రంగాలు, వాణిజ్యం, రవాణా, పర్యాటకం, చిల్లర వ్యాపారం, హోటల్‌, వినోదం వంటి రంగాలతో కూడిన ఒక భాగం మొదటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఆ ప్రభావం నుంచి చివరిగా బయటపడేది కూడా ఆ రంగాలే. మరోవైపు పలు రంగాలు కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా తట్టుకొన్నాయి. కొన్ని.. మహమ్మారి సమయంలోనూ వృద్ధి సాధించాయి.
* మొత్తంమీద 2019-20లో సేవల రంగం వాటా 55 శాతంగా ఉండగా.. 2021-22లో అది 53 శాతానికి తగ్గింది.

టీకాలే కీలకం..
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశంగానే భావించరాదు. స్థూల ఆర్థిక సూచీగా దీన్ని పరిగణించాలి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంలో ఇదే కీలకం. జనవరి 16 నాటికి దేశంలో 156 కోట్ల డోసుల టీకాలను వేశారు. మరణాలను తగ్గించడంలో, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోది చేయడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి.

సామాజిక సేవలపై పెరిగిన వ్యయం
2021-22 ఆర్థికసంవత్సరంలో సామాజిక సేవల రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసిన వ్యయం రూ.71.61 లక్షల కోట్లకు చేరింది. 2020-21 నాటితో పోలిస్తే ఇది 9.8 శాతం అధికం. విద్యపై రూ.6.21 లక్షల కోట్లు, ఆరోగ్యంపై రూ.3.5 లక్షల కోట్లు, ఇతర విభాగాలపై రూ.7.37 లక్షల కోట్లు వెచ్చించారు. 2019-20తో పోలిస్తే 2021-22లో ఆరోగ్య రంగంపై వ్యయం 73 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభణే ఇందుకు కారణం.
* కొవిడ్‌-19 షాక్‌ను వ్యవసాయ రంగం అద్భుతంగా తట్టుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3.9 శాతం మేర వృద్ధిని సాధించే వీలుంది. అంతకుముందు సంవత్సరంలో అది 3.6 శాతంగా ఉంది. పంట మార్పిడికి, సేద్యానికి సంబంధించిన అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి; సేంద్రియ సేద్యాన్ని మరింత పెంచాలి.
* అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య వంటి విభాగాల వల్ల వ్యవసాయ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందుతోంది. వారి సరాసరి నెలవారీ ఆర్జనలో అది దాదాపు 15 శాతంగా ఉంటోంది.
పంట మార్పిడికి సాధనంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమన్వయంతో చర్యలు చేపట్టాలి. తద్వారా అధిక విలువ కలిగిన పంటలవైపు మళ్లి, పంటలకు నీటి వినియోగాన్ని తగ్గించాలి. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది దోహదపడుతుంది.
డ్రోన్లు, కృత్రిమ మేధ ఆధారిత విధానాలను విరివిగా ఉపయోగించాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.

మెరుగుపడ్డ ఉపాధి సూచికలు
కొవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో 2020 ఏప్రిల్‌-జూన్‌లో దేశవ్యాప్తంగా ఉపాధికి సంబంధించిన భిన్న సూచికలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం అవి కోలుకొని, తిరిగి వృద్ధి బాటపట్టాయి. పట్టణాల్లో ఉపాధి మెరుగుపడింది. కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో.. అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి ఉద్యోగాల మార్పిడి కొనసాగినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారుల సంఖ్య సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో నిరుద్యోగిత రేటు, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, కార్మిక జనాభా రేటు.. దాదాపుగా కొవిడ్‌ ముందునాటి స్థితికి చేరాయి. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి హామీ పథకంలో చేరిన వారి సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. కొవిడ్‌ రెండో ఉద్ధృతి కొనసాగిన 2021 జూన్‌లో ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 4.59 కోట్లకు చేరింది.

అంతరిక్షంలో ప్రైవేటు జోరు
రోదసి రంగంపై ప్రైవేటు రంగం, విద్యా సంస్థల ఆసక్తి పెరుగుతోంది. వాహకనౌకల తయారీ నుంచి భూ పరిశీలన కోసం ఉపగ్రహాలను పంపడం వరకూ వివిధ అంశాలకు సంబంధించి 40 ప్రతిపాదనలు ఈ సంస్థల నుంచి వచ్చాయి. ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల అంతరిక్ష వాణిజ్యంలో భారత్‌ తన వాటాను మరింత పెంచుకోవడానికి వీలు కలుగుతోంది.

తగ్గిన విద్యార్థుల నమోదు
భారతీయ విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం చూపింది. 6-14 ఏళ్ల గ్రామీణ విద్యార్థుల నమోదు పడిపోయింది. ఆన్‌లైన్‌ విద్య మొదలైనా ఇది డిజిటల్‌ అంతరాన్ని మరింత పెంచింది. 7-10 ఏళ్ల వారిలో తగ్గుదల ఇంకా ఎక్కువ ఉంది. ఆర్థిక పరిస్థితులు మారిపోయి చాలామంది తమ పిల్లల్ని ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చారు. లక్షల సంఖ్యలో విద్యా సంస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది.

ఎరువుల రాయితీ రూ.85,300 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో ఎరువులపై ప్రభుత్వ రాయితీ రూ.85,300 కోట్లు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 2.85 కోట్ల టన్నులకు చేరింది. 2020-21లో ఎరువులపై ఇచ్చిన రాయితీ రూ.1,38,500 కోట్లు.

కార్మిక సంస్కరణల్లో పురోగతి
కార్మిక సంస్కరణల్లో దేశంలో పురోగతి కనిపిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత తదితర అంశాలపై 17 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి.

రైల్వేలో పెట్టుబడుల దశాబ్దం
సామర్థ్యం పెంపు చర్యలను వేగవంతం చేస్తున్న దృష్ట్యా రైల్వే రంగంలో రాబోయే పదేళ్లలో భారీ స్థాయి మూలధన పెట్టుబడులు రానున్నాయి. 2030 నాటికి డిమాండు కంటే రైల్వే అన్ని విధాలా ముందుంటుందని అంచనా. సరకు రవాణాలో రైల్వే వాటా ఇప్పుడున్న 26-27% నుంచి 40-45 శాతానికి చేరుతుంది. 2014 వరకు ఏటా రూ.46,000 కోట్ల లోపు పెట్టుబడులు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.2,15,000 కోట్లు దాటింది. రైలు మార్గాల విద్యుదీకరణ 2023 డిసెంబరుకు పూర్తవుతుంది. ఏటా 1835 కి.మీ. మేర నూతన రైలు మార్గాలు సిద్ధమవుతున్నాయి. 2030 నాటికి సామర్థ్యం ఇప్పుడున్న 470 కోట్ల టన్నుల నుంచి 820 కోట్ల టన్నులకు చేరుతుంది.

2020-21లో 13,327 కి.మీ. జాతీయ మార్గాలు
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2020-21లో 13,327 కి.మీ. మేర జాతీయ మార్గాలు నిర్మించారు. మునుపటి ఏడాది కంటే ఇది 30% ఎక్కువ. రహదారులకు కేటాయింపులు పెరగడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

రవాణా రంగంలో అనిశ్చితి
కరోనా వైరస్‌లో ఒమిక్రాన్‌ రకం కారణంగా అంతర్జాతీయంగా పర్యాటక రంగంలో అనిశ్చితి నెలకొంది. భారత్‌ సహా అన్నిచోట్లా దీని ప్రభావం కనిపిస్తోంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల రాక 74% మేర తగ్గిపోయింది.

అప్రమత్తత అవసరం..
అంతర్జాతీయ పరిణామాల కారణంగా తలెత్తే ద్రవ్యోల్బణం పట్ల భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదలపై కన్నేసి ఉంచాలి. భారత్‌ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతోంది. వీటి ధరలు పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణానికి రెక్కలు రావడం ఖాయం.  
* అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయి. అమెరికా వంటి అగ్రదేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే.. భారత్‌ నుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని