Dr Sailaja Kiron: సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి అతివల సొంతం

మహిళలు పుట్టుకతోనే సమర్థులని, నిర్ణయాత్మక శక్తిని సైతం కలిగి ఉంటారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. నిస్వార్థగుణంతో తమ భవిష్యత్తును త్యాగం చేస్తూ కుటుంబానికి అంకితమవుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు.

Updated : 21 Nov 2022 15:40 IST

తానా’ వెబినార్‌లో మార్గదర్శి ఎండీ డా.శైలజాకిరణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహిళలు పుట్టుకతోనే సమర్థులని, నిర్ణయాత్మక శక్తిని సైతం కలిగి ఉంటారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. నిస్వార్థగుణంతో తమ భవిష్యత్తును త్యాగం చేస్తూ కుటుంబానికి అంకితమవుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. చాలామందికి కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తానా ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత శక్తి’ అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన వెబినార్‌లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ.. మహిళలకు సహజంగానే బహుముఖ సామర్థ్యం ఉంటుందని, దానివల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో తప్పక రాణిస్తారని తెలిపారు. నిర్వహణ సామర్థ్యం, సంక్షోభ సమయాలను దీటుగా ఎదుర్కొనే శక్తి వారి సొంతమన్నారు. స్వతంత్ర భావాలు కలిగేందుకు, విచక్షణ జ్ఞానాన్ని పెంచేందుకు విద్య తోడ్పడుతుందని పేర్కొన్నారు. మహిళలు.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే విజయానికి తొలి మెట్టు అని శైలజాకిరణ్‌ తెలిపారు. 1995లో మార్గదర్శి రూ.350 కోట్లు టర్నోవర్‌ సాధించగా.. మరో 15-20 ఏళ్లలో రూ.10 వేల కోట్ల టర్నోవర్‌ చేరుకోవాలని లక్ష్యం పెట్టుకొని క్రమంగా దాన్ని సాధించామని తెలిపారు. కలలు కనడంతోనే ఆగిపోవద్దని అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటూ విజయం దిశగా అడుగులు వేయాలని సూచించారు. రామోజీ ఫౌండేషన్‌ రంగారెడ్డి జిల్లాలోని నాగన్‌పల్లి, కృష్ణా జిల్లాలో పెద్దపారుపూడి గ్రామాలను దత్తత తీసుకొని, వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. తమ సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి వివరించారు. పూర్వ అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి మాట్లాడుతూ.. మన పురాణాల్లో స్త్రీకి ఉన్న ప్రాధాన్యం, శక్తి సామర్థ్యాలను వివరించారు. స్త్రీ ఔన్నత్యాన్ని చాటే తెలుగు పద్యాలనూ వినిపించి అందర్నీ మెప్పించారు. మహిళలకు ఈ కార్యక్రమం మరింత ప్రేరణగా నిలుస్తుందని తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారని గార్గీ, మైత్రేయిల గురించి తానా కల్చరల్‌ కో ఆర్డినేటర్‌ తూనుగుంట్ల శిరీష వివరించారు. తానా పూర్వ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, ఏలూరి మాధురి, తానా కార్యవర్గం, సభ్యులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని