AP PRC: వేలగొంతులు ఒక్కటై..

నిర్బంధాల్ని ఛేదించి.. నిలువరింతల్ని దాటి.. అడ్డంకుల్ని అధిగమించి.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. చినుకు చినుకు కలిసి కుంభవృష్టిగా మారినట్లు.. ఒక్కొక్కరిగా మొదలై వందలు, వేల సంఖ్యలో పోటెత్తారు. ప్రభుత్వం హెచ్చరించేకొద్దీ..

Updated : 04 Feb 2022 09:24 IST

పిక్కటిల్లిన ఉద్యోగ గర్జన
పోలీసు నిర్బంధాల్ని ఛేదించి అడ్డంకుల్ని అధిగమించి..

ఒక్కొక్కరిగా మొదలై.. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగులు
జనసంద్రమైన విజయవాడ
నాలుగు కి.మీ. మేర ఎటు చూసినా వారే

ఈనాడు, అమరావతి: నిర్బంధాల్ని ఛేదించి.. నిలువరింతల్ని దాటి.. అడ్డంకుల్ని అధిగమించి.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. చినుకు చినుకు కలిసి కుంభవృష్టిగా మారినట్లు.. ఒక్కొక్కరిగా మొదలై వందలు, వేల సంఖ్యలో పోటెత్తారు. ప్రభుత్వం హెచ్చరించేకొద్దీ.. పోలీసులు నిలువరించేకొద్దీ.. రెట్టించిన పోరాట స్ఫూర్తితో దూసుకొచ్చారు. తమ ఉద్యమ ఆకాంక్షను అణగదొక్కలేరని నిరూపిస్తూ జనసంద్రమై ఎగిశారు. సమూహశక్తిని, పోరాట స్ఫూర్తిని ప్రభుత్వానికి చాటిచెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు వెల్లువెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్‌ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసిపోయింది. లక్ష మందికి పైగా ఉద్యోగులు తరలివచ్చారని నాయకులు ప్రకటించారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకూ విజయవాడలోని బీఆర్టీఎస్‌ ఉద్యమ నినాదాలతో హోరెత్తింది. ‘మాయదారి పీఆర్సీ మాకొద్దు.. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు. చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి’ అంటూ ఉద్యోగుల గర్జనతో అట్టుడికింది.

పీఆర్సీ సాధన సమితి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జెండాలు చేతబూనిన ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. వేతనాలు తగ్గించి ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందంటూ మండిపడింది. ఉద్యమ గేయాలు, గీతాలు ఆలపిస్తూ ప్రభుత్వ తీరుపై గళమెత్తింది. వినూత్న రీతిలో ప్రదర్శనలతో నిరసన తెలిపింది. ప్రసంగాలతో ఉద్యమ స్ఫూర్తి నింపింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మెతో సత్తా చాటుతామని పునరుద్ఘాటించింది.  

అడ్డంకుల్ని అధిగమించి చేరుకున్నారిలా..

జిల్లాలు, మండలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను పోలీసులు గృహనిర్బంధం చేసినా కొంతమంది ఎలాగోలా తప్పించుకుని విజయవాడకు చేరుకున్నారు. ఇంకొందరైతే రెండు, మూడు రోజుల ముందే ఇక్కడికి వచ్చేశారు. రైళ్లు, బస్సుల్లో అణువణువూ పోలీసులు తనిఖీలు చేస్తుంటే వారికి చిక్కకుండా ఉండేందుకు రోగులు, కూలీలు, భక్తుల మాదిరి మారువేషాలు వేసుకుని మరీ పలువురు చేరుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బెజవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా అడ్డగిస్తే వాటిని దాటుకుంటూ వేల మంది గమ్యస్థానం వైపు కదిలారు. ఇక్కడికి చేరిన తర్వాత నగరంలోని హోటళ్లలో తలదాచుకుంటే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో పరిచయస్తులు, బంధుమిత్రుల ఇళ్లలో కొంతమంది బస చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్నవారు, నగరంలో బృందాలుగా తిరుగుతున్న ఉద్యోగుల్ని ఉదయం 9.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్లకు తరలించారు. అయినా మిగతావారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ‘చలో విజయవాడ’లో పాల్గొనటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు.

పుట్ట పగిలి బయటకొచ్చిన చీమలదండులా..

చలో విజయవాడను అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గుర్తించిన ఉద్యోగులు.. తాము బృందాలుగా ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఎవరికివారు విడిపోయి, ప్రజల్లో కలిసిపోయారు. గురువారం ఉదయం 8.30- 9 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో ఒంటరిగా తిరిగారు. చలో విజయవాడ కార్యక్రమానికి సమయం ఆసన్నమయ్యేసరికి ఉదయం 9.30 గంటలకంతా ఎక్కడెక్కడో ఉన్నవారంతా పుట్టల్లో నుంచి చీమల దండు వచ్చినట్లు ఒక్కసారిగా వీధులు, సందులు, కూడళ్లు, వివిధ భవనాల్లో నుంచి బయటకొచ్చారు. క్షణాల్లో వేల మంది సంఘటితమయ్యారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ నుంచి కొన్ని బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి మరికొన్ని బృందాలు బీఆర్టీఎస్‌ రోడ్డు వైపు ప్రదర్శనగా బయల్దేరాయి. బీఆర్టీఎస్‌ రోడ్డులోని మీసాల రాజేశ్వరరావు వంతెన వద్దకు చేరుకునేసరికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది ఉద్యోగులు జనసంద్రాన్ని తలపించారు. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని చూసిన పోలీసులు.. వారిని అడ్డుకుంటే మరింత ఇబ్బంది అవుతుందేమోనన్న ఉద్దేశంతో  వదిలేశారు. దీంతో బీఆర్టీఎస్‌ రోడ్డులోని పడవలరేవు కూడలి వరకూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కాలినడకన ప్రదర్శనగా తరలివెళ్లారు. పీఆర్సీ సాధన సమితి జెండాలు చేతబట్టి ఉద్యమ నినాదాలతో హోరెత్తించారు. పడవలరేవు కూడలి సమీపానికి చేరుకున్న తర్వాత అంతా బీఆర్టీఎస్‌ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆ సమయంలో మొత్తం బీఆర్టీఎస్‌ రహదారి నాలుగు కిలోమీటర్లు ఉద్యోగ, ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకంతా బీఆర్టీఎస్‌ రోడ్డుతోపాటు దాన్ని ఆనుకుని ఉన్న సందులు, వీధుల్లో ఎటు చూసినా ఉద్యోగులు, ఉపాధ్యాయులే కనిపించారు. కొందరైతే సమీపంలోని భవనాలపైకి ఎక్కి వాటిని సెల్‌ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.

వాహనమే వేదికగా ప్రసంగాలు

దాదాపు లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బీఆర్టీఎస్‌ రోడ్డుపైకి చేరుకుని అక్కడ బైఠాయించిన తర్వాత 11.30 గంటల సమయంలో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంకట్రామిరెడ్డి, కె.సూర్యనారాయణ, సుధీర్‌బాబు, హృదయరాజు తదితరులు ర్యాలీగా అక్కడికి వచ్చారు. పడవలరేవు కూడలి వద్ద వేదిక ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకులు ముందుగానే భావించినా పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు ఓ వాహనానికి మైకులు అమర్చి దానిపై నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. వారి ప్రసంగాలు సాగుతున్నంతసేపు ఉద్యోగులు వారికి మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంట వరకూ ఈ సభ కొనసాగింది. తర్వాత ఉద్యోగులంతా అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.

తొలుత నిర్బంధాలు.. ఆ తర్వాత

చలో విజయవాడ కార్యక్రమాన్ని జరగనీయకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎవర్నీ రానీయకుండా అడ్డుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. గురువారం ఉదయం 9.30 గంటల వరకూ కూడా వారి నిర్బంధాలు, అడ్డగింతలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగుల్ని గవర్నర్‌పేట, కృష్ణలంక తదితర పోలీసుస్టేషన్లకు తరలించారు. మరికొందరు ఉద్యోగుల్ని ఆటోనగర్‌లోని ఆటోమొబైల్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్బంధించారు. అయితే వాటన్నింటినీ అధిగమించి ఒక్కసారిగా వేల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్‌ రోడ్డులోకి తరలిరావటంతో వారిని అదుపు చేయటం కష్టమని భావించిన పోలీసులు ఒక వ్యూహం ప్రకారం.. ఎవర్నీ అడ్డుకోకుండా వదిలేశారు. పోలీసుల చేతుల్లో లాఠీలు కనిపించలేదు. కానీ వందల మంది మోహరించారు. అంతకు ముందు నిర్బంధించిన ఉద్యోగుల్ని మధ్యాహ్నం తర్వాత పోలీసులు విడిచిపెట్టారు.

అంధులు సైతం కదిలొచ్చారు..

ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి దివ్యాంగులు, అంధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తరలివచ్చారు. వారు ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వ్యంగ్యంగా గేయాలు ఆలపించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో సీపీఎస్‌ ఉద్యోగులు, కొంతమంది పింఛనుదారులు కూడా వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులూ వేల సంఖ్యలో వచ్చారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ తదితర సంఘాల నుంచి వేల మంది తరలివచ్చి జెండాలు ప్రదర్శించారు. పోలీసులూ ఉద్యోగులేనని వారూ ఉద్యమానికి సహకరించాలంటూ ఆందోళనల్లో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. కొంతమంది ఉద్యోగులు శీర్షాసనం వేసి ‘రివర్స్‌ పీఆర్సీ’ అంటూ ఎద్దేవా చేశారు. మరికొందరు యాచన చేసి, ఇంకొందరు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

 మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చి.. మద్దతు పలికిన జనం

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. బీఆర్టీఎస్‌ రహదారి పొడవున నివాసితులు వారి ఇళ్ల ముందు మంచినీళ్లు, మజ్జిగ బిందెల్లో ఉంచి అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కూర్చోవటానికి కుర్చీలు ఇచ్చి సహకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని