Samatha Spoorthi: మహిమాన్విత మూర్తి.. సమతాస్ఫూర్తి

మహాద్భుతం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన మహిమాన్విత మానవతా సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నడయాడిన భరతఖండం పునీతమైంది. ఆ ఆదర్శమూర్తి నింపిన స్ఫూర్తిని

Updated : 06 Feb 2022 06:45 IST

ప్రధాని చేతుల మీదుగా శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ

దేశఖ్యాతిని తెలుగు ఇనుమడింపజేస్తోందని మోదీ ప్రశంసలు

మహాద్భుతం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన మహిమాన్విత మానవతా సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నడయాడిన భరతఖండం పునీతమైంది. ఆ ఆదర్శమూర్తి నింపిన స్ఫూర్తిని దిగంతాలకు పరిమళింపజేసే మహాఘట్టం సాక్షాత్కారమైంది. భాగ్యనగర సిగలో అద్భుతఘట్టం చేరింది. భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల మూర్తి విగ్రహం ఆవిష్కృతమైంది. తొలుత విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన విష్వక్సేన యాగంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ తరువాత విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు. అనంతరం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.

ఆద్యంతం ఆధ్యాత్మికతను పంచుతూ.. విశిష్టాద్వైతాన్ని దశదిశలా వినిపించేలా సాగుతున్నాయి రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు. విగ్రహావిష్కరణ కోసం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో సమతామూర్తి కేంద్రం చుట్టూ తిరిగి విహంగ వీక్షణం చేశారు. అనంతరం ప్రధాని యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ వెంట గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం సంస్థల ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. సమతామూర్తి కేంద్రం విశేషాలను ప్రధానికి చినజీయర్‌స్వామి వివరించారు.

విజయాన్ని కాంక్షిస్తూ విష్వక్సేనేష్టి

వసంత పంచమి పర్వదినం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేకంగా విష్వక్సేనేష్ఠిని నిర్వహించారు. ప్రధాని చేపట్టే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించారు. నరేంద్రమోదీ హాజరై విష్వక్సేన పూజలో పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి మోదీకి స్వర్ణకంకణధారణ చేశారు. అనంతరం విష్వక్సేనేష్టి పూర్ణాహుతిలో మోదీ పాల్గొని క్రతువును పూర్తి చేశారు. యాగశాలల నుంచి నేరుగా సమతామూర్తి కేంద్రానికి విచ్చేసిన మోదీ.. విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు.

సమతామూర్తి ఆవిష్కరణ

దివ్యదేశాల నుంచి సమతామూర్తి కేంద్రానికి ప్రధాని చేరుకున్నారు. భద్రవేదిలోని కింది అంతస్తులో శ్రీరామానుజాచార్యుల జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన మండపంలో కలియతిరిగి అక్కడి విశేషాలు తెలుసుకున్నారు. తర్వాత మొదటి అంతస్తులోని స్వర్ణమూర్తి వద్దకు చేరుకోగా.. అక్కడి విశిష్టతలను చినజీయర్‌స్వామి వివరించారు. దీన్ని ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారని, రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించిన సందర్భంగా 120 కిలోల బంగారంతో మూర్తిని నిర్మించినట్లు చెప్పారు. రెండో అంతస్తుకు చేరాక అక్కడ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామని, దాని విశేషాలను వివరించారు. అనంతరం భద్రవేదిపైన రామానుజాచార్యుల భారీ విగ్రహం కొలువు దీరిన పద్మపీఠం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం లేజర్‌ దీపాల కాంతుల్లో రామానుజాచార్యుల భారీ విగ్రహానికి తిలకం పెట్టడంతో 3డీ టెక్నాలజీలో తెరపైకి తీసి.. సమతామూర్తిని జాతికి అంకితం చేశారు. అనంతరం ఉజ్జీవన సోపానంపైన ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని ఆవిష్కరణలో పాల్గొన్నారు. 3డీ మ్యాపింగ్‌ టెక్నాలజీతో రూపొందించిన లేజర్‌ షో అలరించింది. మోదీ సహా ముఖ్యులు విజయస్తూపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకుని ఈ ప్రదర్శనను వీక్షించారు.  రామానుజాచార్యుల విశిష్టత, సమతా సిద్ధాంతాన్ని చాటిన తీరు.. ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ ప్రదర్శన రూపొందించారు. తర్వాత మోదీ మళ్లీ యాగశాలకు చేరుకుని, శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.


సమాజంలో చెడు విస్తృతమైనపుడు మహాపురుషులు పుట్టుకువస్తారు. ఎన్నికలు ఉండొచ్చు.. లేకపోవచ్చు. సమస్యలు రావచ్చు, పోవచ్చు. సమాజంలో చెడుపై పోరాటం చేసేందుకు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించినప్పుడే సన్మానం, ఆదరణ లభిస్తుంది

- ప్రధాని మోదీ


నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారు. శ్రీరాముడిలా మోదీ కూడా ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు.

- చినజీయర్‌ స్వామి


బంగారు వర్ణపు పంచెలో.. మెరిసిన మోదీ

ఈనాడు, హైదరాబాద్‌ : సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది.  తొలుత అతిథిగృహానికి చేరుకుని యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. భక్తితో నమస్కరిస్తూ ముందుకుసాగారు. చినజీయర్‌స్వామి చెప్పే విషయాన్ని వింటూ దివ్యదేశాల విశిష్టత, సమతామూర్తి ప్రాజెక్టు విశేషాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
108 మెట్లు దిగి.. కార్యక్రమ ఆరంభం నుంచి చివరి వరకు నియమనిష్టలతో మోదీ వ్యవహరించారు. ప్రసంగం ముగించుకున్నాక ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్‌ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. ముందుగా డైనమిక్‌ ఫౌంటెన్‌ వద్ద ప్రత్యేకంగా వాహనాలు ఉంచినా.. వాటిలో ఎక్కలేదు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు.


ప్రధానికి ఘనస్వాగతం

ఈనాడు, హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు, రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం ఘనస్వాగతం లభించింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, భాజపా నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. తనకు అభివాదం చేస్తున్న నాయకులందరినీ వరుసగా పలకరిస్తూ మోదీ ముందుకు సాగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని