CM Jagan: సమాజంలో అందరూ సమానులే

భగవద్రామానుజాచార్యులు ప్రవచించిన విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమాజంలో అందరూ సమానులే అనే సందేశాన్ని అందించేందుకు చినజీయర్‌స్వామి సమతామూర్తి విగ్రహాన్ని

Updated : 08 Feb 2022 03:20 IST

 ఆ సందేశాన్ని ముందుకు తీసుకుపోవలసింది మనమే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: భగవద్రామానుజాచార్యులు ప్రవచించిన విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమాజంలో అందరూ సమానులే అనే సందేశాన్ని అందించేందుకు చినజీయర్‌స్వామి సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సోమవారం ఆయన హాజరయ్యారు. పంచెకట్టు, నిలువుబొట్టులో పాల్గొన్నారు. దివ్యదేశాలను దర్శించుకుని సెల్ఫ్‌ గైడెడ్‌ టూల్‌ సాయంతో విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం 3డీ లేజర్‌ షోను వీక్షించారు. శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

జగన్‌ది రామానుజాచార్యుల జన్మనక్షత్రమే

అవధానంలో భాగంగా జన్మ నక్షత్రాన్ని బట్టి శ్లోకాలు చెప్పే అంశం నడిచింది. ఈ నేపథ్యంలో జగన్‌ జన్మనక్షత్రం ఆరుద్ర అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పి ఏయే శ్లోకాలు చదవాలో వివరించాలని పిల్లలను కోరారు. అప్పుడు ఓ బాలుడు శ్లోకాలు చెప్పి జగన్‌ జన్మనక్షత్రం సాక్షాత్తూ రామానుజాచార్యుల జన్మనక్షత్రం ఒక్కటేనని చెప్పడంతో సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అవలీలగా శ్లోకాలు చెప్పిన చిన్నారులను జగన్‌ అభినందించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అసమానతలను రూపు మాపాలని వెయ్యేళ్ల కిందటే రామానుజాచార్యులు దృఢ విశ్వాసంతో ముందుకు సాగారన్నారు. తనకు పాపం కలుగుతుందని చెప్పినా.. సమాజానికి మేలు కలుగుతుందన్న సదాశయంతో తన గురువు ఉపదేశించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిఒక్కరికి తెలియజేసిన గొప్ప మనిషి రామానుజాచార్యులని కొనియాడారు. 

మహనీయుల విశేషాలతో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌

చినజీయర్‌స్వామి మాట్లాడుతూ సమతాస్ఫూర్తిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే బృహన్‌మూర్తిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాజిక, లింగ సమానత్వం కోసం పోరాడిన అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా వంటి మహనీయుల జీవిత విశేషాలతో కేంద్రంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి-స్వర్ణ దంపతులు, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఉప సభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మైహోం సంస్థల ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు పాలొన్నారు.

నేడు అమిత్‌ షా రాక

ఉత్సవాలకు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

నయనమనోహరం.. 

గోవింద నామస్మరణలతో ముచ్చింతల్‌ మార్మోగింది. ఆరో రోజు.. వేలాది మంది రుత్విజుల వేదమంత్రోచ్చరణ మధ్య.. చినజీయర్‌స్వామి హస్తాల మీదుగా సమతామూర్తి కేంద్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలలోని 32 ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండితులు మహా కుంభాభిషేకం నిర్వహించారు.

మరో మూడు రోజులలో...

వివిధ తేదీలలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10న 19 ఆలయాలు, 11న 36, 13న 21 ఆలయాలలో మూర్తుల ప్రాణప్రతిష్ఠ జరగనుంది. 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వర్ణమూర్తి ఆవిష్కరణ జరగనుంది. వాస్తవంగా సోమవారం 33 ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని ప్రకటించినా... రాహుకాలం దృష్ట్యా అయోధ్య ఆలయ విగ్రహ ప్రతిష్ఠను వాయిదా వేశారు.

పూర్తయ్యాకే భక్తులకు అనుమతి

సమతామూర్తిని దర్శించేందుకు సోమవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అన్ని దివ్యదేశాలలో విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తికాకపోవడంతో భక్తులను అటువైపు అనుమతించడం లేదు. ప్రస్తుతం ఉజ్జీవన సోపానం మీదుగా నేరుగా బృహన్‌మూర్తిని దర్శించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాలలో ప్రతిష్ఠ ముగిశాకే దివ్యదేశాల సందర్శనకు భక్తులను అనుమతించనున్నట్లు చినజీయర్‌స్వామి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని