Updated : 08 Feb 2022 08:55 IST

AP PRC: మాపై రౌడీ షీట్లా... ఆ హక్కు మీకెవరిచ్చారు?

 స్పందనలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తను నిలదీసిన నరసాపురం ఉపాధ్యాయురాలు

సెల్‌ఫోన్‌ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

నరసాపురం, న్యూస్‌టుడే: ‘మాపై రౌడీషీట్లా.. ఆ హక్కు మీకెవరిచ్చారు’ అని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఖండవల్లి బాలకుమారి కృష్ణా జిల్లాకు చెందిన ఓ సామాజిక కార్యకర్తను చరవాణిలో నిలదీశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. నేపథ్యం ఇదీ... పాఠాలు చెప్పడం మానేసి... ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నారని, వారిపై రౌడీషీట్లు తెరవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన బాలకుమారి సంబంధిత వ్యక్తితో సెల్‌లో మాట్లాడారు. ‘మేం 24 గంటలు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నేను ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో గతంలో నలుగురు విద్యార్థులు ఉండే వారు. ఇప్పుడు 130 మంది చదువుకుంటున్నారు. పాఠశాల అభివృద్ధికి సొంత డబ్బులు రూ.10 లక్షలు ఖర్చు పెట్టా. గతంలో నెలకు రూ.1200 వేతనానికి పనిచేశా. ప్రస్తుతం జీతం పెరిగినా ఇతర వ్యయాలు భారీగా పెరిగాయి. మేం ప్రభుత్వ ఉద్యోగులం అవడంతో ఏవిధమైన రాయితీలు పొందలేకపోతున్నాం. పిల్లల చదువులకు రుసుం చెల్లించాల్సి వస్తోంది. భర్త ఒకచోట, భార్య మరోచోట ఉంటున్నాం. హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంతో ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నాకు తెలిసిన సామాజిక కార్యకర్తలు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం’ లేదని చెప్పడంతో ఫిర్యాదు చేసిన వ్యక్తి క్షమాపణ చెప్పారు. ఆమె సేవల గురించి విన్న ఆయన ఆమెను అభినందించారు.

‘చలో విజయవాడ’కు వెళ్లిన ఉపాధ్యాయుల వివరాల సేకరణ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రధానంగా వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలపై దృష్టి సారించారు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కమ్యూనిస్టుల వ్యూహాలు ఫలించడంతో సభ విజయవంతమైనట్లు భావిస్తున్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులు పాఠశాలలకు వెళ్లి సంబంధిత ఉపాధ్యాయుల గురించి ఆరా తీశారు. ఆ రోజు ఎవరెవరు సెలవు పెట్టారు..? ఎవరు విజయవాడ వెళ్లారు..? అనే వివరాలు సేకరించారు. వారి ఇంటి చిరునామా, ఫొటోలు అడగడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై యూటీఎఫ్‌ నగర శాఖ అధ్యక్షుడు రవిబాబు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై రాష్ట్ర శాఖకు తెలియజేశామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని