Karnataka: కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌’ వివాదం

కర్ణాటకలో హిజాబ్‌ వస్త్ర ధారణ వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాగల్‌కోటె, దావణగెరె, మండ్య,

Updated : 09 Feb 2022 07:36 IST

రెండు వర్గాల విద్యార్థుల పోటాపోటీ నినాదాలు

లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం

మూడు రోజులు కళాశాలల మూసివేత

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌ వస్త్ర ధారణ వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాగల్‌కోటె, దావణగెరె, మండ్య, బెళగావి, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, రాయచూరు, కలబురగి, కోలారు తదితర జిల్లాల్లోని కళాశాలల వద్ద ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరిలో ఉడుపిలోని ప్రభుత్వ కళాశాలలో ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్‌ ధరించి హాజరయ్యారు. దీంతో వారిని కళాశాలలోకి వచ్చేందుకు అనుమతించలేదు. పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి వచ్చారు. ఇలా.. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.

కాషాయ జెండా ఎగరవేసి..

హిజాబ్‌ను వ్యతిరేకించే క్రమంలో కొందరు విద్యార్థులు శివమొగ్గలోని కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రత్యేకించిన స్తంభంపై కాషాయ జెండాను ఎగురవేశారు. అనంతరం ‘జై శ్రీరాం’ అంటూ నినదించారు.

సహనంతో ఉండండి: ముఖ్యమంత్రి బొమ్మై

న్యాయస్థానం తీర్పు వెల్లడించేంత వరకు సహనంతో ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని ఎవరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదని కోరారు.  
లోక్‌సభలోనూ ప్రతిధ్వని: హిజాబ్‌ అంశం లోక్‌సభలోనూ ప్రతిధ్వనించింది. కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీ సభ్యులు ఈ అంశంపై లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులంతా కళాశాలలు, యాజమాన్యం సూచించిన ఏకరూప వస్త్రాలనే ధరించాలన్నారు. 

* రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న కర్ణాటక విద్యార్థినులు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానంటూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. 

సంయమనమే రక్ష: హైకోర్టు

‘అత్యంత సున్నితమైన సామాజిక అంశం ఎంతటి ఉద్రిక్తతలకు దారి తీసిందో మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు వీధుల్లో గొడవలకు దిగటం, నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడటం, పోలీసులతో దెబ్బలు తినడం సరైన చర్య కాదు. ఈ సంఘటనలతో న్యాయవాదులు కూడా కలత చెందారు. ఆందోళన మనస్తత్వంతో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ సమయంలోనే ప్రజలంతా సంయమనం పాటించాలి’’ అని కర్ణాటక హైకోర్టు సూచించింది. విద్యార్థులంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రజల మనోభావాలు, విశ్వాసాలను గౌరవిస్తూనే తగిన నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ తెలిపారు. హిజాబ్‌ వివాదంపై కుందాపుర, ఉడుపి జిల్లాల విద్యార్థినులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిగింది. విచారణ ప్రారంభించిన సమయంలో ఓ విద్యా సంస్థలో కాషాయ పతాకాన్ని ఎగరవేయడం, కళాశాలల ఆవరణల్లో అలజడులు జరుగుతున్న అంశం న్యాయమూర్తులు, న్యాయవాదులకు తెలిసి విచారం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడులో హిజాబ్‌ వస్త్రధారణలపై ఆయా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం పరిశీలించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని