MLC Ashok Babu: ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టు.. బెయిలు

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి హడావుడిగా అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. 18 గంటలపాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సత్యవతి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు.

Updated : 12 Feb 2022 05:37 IST

గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
శుక్రవారం రాత్రి బెయిల్‌ ఇచ్చిన సీఐడీ కోర్టు

ఈనాడు, అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి హడావుడిగా అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. 18 గంటలపాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సత్యవతి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు. ఓ వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి 11.30కు ఇంటికి చేరుకున్న అశోక్‌బాబును మఫ్టీలో వేచి చూస్తున్న పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి 7గంటల వరకు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సుదీర్ఘ విచారణల అనంతరం ఆయనకు బెయిల్‌ లభించింది. అంతకుముందు శుక్రవారం ఉదయం నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా మాజీ మంత్రులు, నాయకులు, న్యాయవాదులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేశారంటూ పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో దేవినేని ఉమా సహా పలువురు నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం, నల్లపాడు స్టేషన్లకు తరలించి సాయంత్రం వరకు పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు అశోక్‌బాబును ఉన్నఫళంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసేశారు. కోర్టు రోడ్డు, అరండల్‌పేట పైవంతెన కింది భాగంలో ఉన్న రహదారులు, జీజీహెచ్‌ పరిసరాలు, నగరంపాలెం ఎస్‌బీఐ జంక్షన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జీజీహెచ్‌తో పాటు కొత్తపేట తదితర ప్రాంతాలకు కోర్టు రోడ్డు నుంచే చాలా మంది ప్రయాణిస్తారు. వారంతా 2 కి.మీ.చుట్టూ తిరిగి మార్కెట్‌సెంటర్‌ నుంచి ప్రయాణించాల్సి వచ్చింది. జీజీహెచ్‌కు వెళ్లే అంబులెన్సులకుసైతం ఈ ఇబ్బందులు తప్పలేదు.

అప్రజాస్వామిక అరెస్టు: తెదేపా
పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్న వారిని బెదిరించేందుకే ఎమ్మెల్సీ అశోక్‌బాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని తెదేపా నేతలు మండిపడ్డారు. ముందస్తు నోటీసులివ్వకుండా సీఐడీ పోలీసులు అశోక్‌బాబును అరెస్టు చేసి తరలించటాన్ని వారు తప్పుబట్టారు. శుక్రవారం వస్తే ఎవరిని జైలుకు పంపుదామా? అని వైకాపా ప్రభుత్వం ఎదురుచూస్తోందని విమర్శించారు.  గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్న అశోక్‌బాబును పరామర్శించటానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌అహ్మద్‌, కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు నాయకులు, న్యాయవాదులు సీఐడీ కార్యాలయ పరిసరాలకు చేరుకున్నారు. అశోక్‌బాబు వద్దకు వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఎంపీ రఘురామరాజును ఇదే సీఐడీ కార్యాలయంలో పోలీసులు కొట్టారని, ప్రస్తుతం అశోక్‌బాబు విషయంలోనూ థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఉంటారని మాజీ మంత్రి దేవినేని ఉమా అనుమానం వ్యక్తం చేశారు. అశోక్‌బాబును చూపించాలని పట్టుబట్టారు. తెదేపా ప్రజాప్రతినిధులను హింసించటమే పనిగా జగన్‌రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. లోగడ ఆయనపై ఉన్న కేసును కొట్టివేశారని, దాన్ని తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో తప్పుడు సెక్షన్లు పెట్టి బెయిల్‌ రాకుండా చేస్తున్నారని, కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. మంత్రి అప్పలరాజు పోలీసు అధికారులను తిడితే కేసు లేదని, తెదేపా నాయకులపై మాత్రం కేసులకు అంతు లేదని నక్కా ఆనందబాబు విమర్శించారు. అశోక్‌బాబు ఎమ్మెల్సీగా ఎన్నికై మూడేళ్లయిందని, ఆయన ఉద్యోగ సర్వీసుకు సంబంధించిన వ్యవహారంపై వివాదం వస్తే ఇన్నాళ్లపాటు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అశోక్‌బాబు తరఫున వెళ్లిన న్యాయవాదులు జంధ్యాల కోటేశ్వరరావు, హరిబాబులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు