Andhra News: తనయుడికి తలకొరివి పెడుతూ ఆగిన తండ్రి గుండె

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. చదువు పూర్తి చేశాడు.. రేపోమాపో ఉద్యోగం వస్తుంది.. పెళ్లి చేసేయాలి.. మనవడో, మనవరాలో పుడితే వాళ్లను ఆడిస్తూ

Updated : 13 Feb 2022 07:00 IST

విశాఖపట్నం (సింధియా), న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. చదువు పూర్తి చేశాడు.. రేపోమాపో ఉద్యోగం వస్తుంది.. పెళ్లి చేసేయాలి.. మనవడో, మనవరాలో పుడితే వాళ్లను ఆడిస్తూ జీవితం గడిపేయాలి.. ఇలా ఎన్నో కలలుగన్న ఆ తండ్రి కన్నకొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయారు. తనకు చితి పేర్చాల్సిన కుమారుడికి తానే తలకొరివి పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కుమారుడికి అంత్యక్రియలు చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కన్నా.. నేనూ నీ వెనకే వస్తున్నా అంటూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషాద ఘటన విశాఖ నగరంలోని మల్కాపురంలో చోటు చేసుకుంది. యారాడకు చెందిన బాయిన అప్పారావు కుటుంబం బతుకుదెరువు కోసం మల్కాపురం వచ్చి జీవిస్తోంది. ఈయన కుమారుడు గిరీష్‌ (22) ఏవియేషన్‌ కోర్సు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అనారోగ్యం బారినపడటంతో శుక్రవారం గిరీష్‌ మృతి చెందాడు. స్థానిక గుల్లలపాలెం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిపారు. గిరీష్‌ చితిచుట్టూ తిరుగుతూ ఆయన తండ్రి అప్పారావు(50) ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించారు. అయిదేళ్ల కిందటే అప్పారావుకు గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్స్‌ వేశారు. కుమారుడి మరణంతో షాక్‌కు గురై ఆయనా చనిపోయారు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహమైంది. భర్తను, కుమారుణ్ని ఒకేసారి పోగొట్టుకున్న ఆ భార్య, కుమార్తెలతో కలిసి బోరున విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని