YSRCP MP: అర్ధరాత్రి ఠాణాలో వైకాపా ఎంపీ హల్‌చల్‌

అధికార వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తన అనుచరులతో విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషనులో హల్‌చల్‌ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 30 మంది అనుచరులతో వచ్చి

Updated : 17 Feb 2022 03:20 IST

బంధువుల కోసం స్టేషనుకు నందిగం సురేష్‌

వీడియో తీస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌పై అనుచరుల దాడి.. దుష్ప్రచారమన్న ఎంపీ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- కృష్ణలంక: అధికార వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తన అనుచరులతో విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషనులో హల్‌చల్‌ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 30 మంది అనుచరులతో వచ్చి గంటకుపైగా వీరంగం చేశారు. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ తదితరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన సమీప బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టలేదంటూ ఆయన స్టేషన్‌లో హడావుడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆయన అనుచరులు స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ను లాక్కొని దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..

ట్రిపుల్‌ రైడింగును ఆపడంతో..

మంగళవారం అర్ధరాత్రి బస్టాండు వద్ద ఉన్న గంగ్రోతి హోటల్‌ పరిసరాల్లో కృష్ణలంక స్టేషనుకు చెందిన ఎస్‌ఐ మూర్తి తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన మహేష్‌, నితిన్‌, కార్తీక్‌లు సినిమా చూసి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్నారు. ఒకే వాహనంపై ముగ్గురు ఉండడాన్ని గమనించిన ఎస్సై వారిని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. తాము సినిమాకు వెళ్లామని, టిఫిన్‌ చేయడానికి వచ్చామని అంటూ.. తాము ఎంపీ బంధువులమని చెప్పారు. ట్రిపుల్‌ రైడింగ్‌ ఎలా చేస్తున్నారంటూ ఎస్సై వారిని మందలించి, ఒకరిపై చేయి చేసుకున్నారు. విచారణ నిమిత్తం ముగ్గురినీ కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. 

ఎంపీ బంధువులమని చెప్పినా..

స్టేషన్‌కు వెళ్లిన అనంతరం వారిపై ఎస్‌ఐ చేయి చేసుకోవడాన్ని ఓ యువకుడు వీడియో తీసి ఎంపీకి పంపారు. దానిని పరిశీలించిన ఎంపీ సురేష్‌.. ఎస్‌ఐకి ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు. దీంతో ఎంపీ సుమారు 20 మంది అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తన బంధువులని చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో మరింత రెచ్చిపోయిన ఆయన ఎస్‌ఐ మూర్తితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న దక్షిణ డివిజన్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, కృష్ణలంక సీఐ సత్యానంద్‌ హుటాహుటిన స్టేషన్‌కు వచ్చి ఎంపీకి సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా.. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టేషనులోనే హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి

స్టేషన్‌లో ఎంపీ అనుచరుల వీరంగాన్ని హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా.. దానిని గమనించిన ఎంపీ అనుచరులు హెడ్‌కానిస్టేబుల్‌ను దూషించి ఫోన్‌ను లాక్కున్నారు. ముగ్గురు యువకులను విడిపించుకొని స్టేషను నుంచి వెళ్లే సమయంలో ఫోను ఇవ్వమని హెడ్‌కానిస్టేబుల్‌ ఎంపీ అనుచరులను కోరగా వారు ఆ ఫోనును విసిరేసి, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతను కిందపడిపోయారు. ముగ్గురు యువకులపై మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేసి, వదిలేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో మహేష్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివి వాలంటీర్‌గా పనిచేస్తుండగా నితిన్‌, కార్తీక్‌లు డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల కూడా ఎంపీ నందిగం సురేష్‌ విజయవాడలో ట్రాఫిక్‌ హెడ్‌కానిస్టేబుల్‌తో దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది.

గోప్యత పాటిస్తున్న పోలీసులు

ఈ సంఘటనపై పోలీసులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. ఈ విషయంలో ఎవరి పాత్ర ఎంత? తదితర అంశాలపై గోప్యంగా విచారిస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎంపీ అనుచరులపై కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై కృష్ణలంక సీఐ సత్యానంద్‌ విలేకరులతో మాట్లాడారు. ఎస్‌ఐ మూర్తిపై ఎంపీ మనుషులు దాడి చేశారా అని ప్రశ్నించగా ఇది నిజం కాదని అన్నారు. స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారనడంలోనూ వాస్తవం లేదన్నారు. అయితే హెడ్‌కానిస్టేబుల్‌కు వైద్య పరీక్షలు చేయించి అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

నచ్చని వారు చేస్తున్న ప్రచారం

‘నాకు మేనల్లుడు వరుసయ్యే యువకుడిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారంటే ఫోన్‌ చేశాను. పోలీసులు ఫోన్‌ తీయకపోవడంతో నేను వెళ్లాను. నేను ఎంపీ అని తెలియక ఎస్సై హడావుడిగా మాట్లాడారు. మాస్క్‌ తీసి ఎంపీని అని చెబితే గుర్తించలేకపోయామని, పొరపాటు జరిగిందన్నారు. అక్కడ జరిగింది ఒకటయితే నచ్చనివారు మరోరకంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడెక్కడో జరిగినదాన్ని నామీదకు వేస్తే ఎలా? ఇదంతా గిట్టనివారు, మీడియా చేస్తున్న హడావుడే. అక్కడ ఎలాంటి వివాదం చోటుచేసుకోలేదు’

-నందిగం సురేష్‌, ఎంపీ, బాపట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని