Updated : 18 Feb 2022 05:50 IST

CHANDRA BABU:అవినాష్‌పై ఆరా తీస్తుంటే సీబీఐనే నిందిస్తారా?

సమాధానం చెప్పలేక దర్యాప్తు సంస్థ కక్ష కట్టిందంటారా?
కోర్టులే లేకపోతే రఘురామకృష్ణరాజునూ చంపేసేవారేమో?
సర్పంచుల అవగాహన సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ ఛార్జిషీట్‌లో పెడితే సమాధానం చెప్పలేని సకల శాఖల మంత్రి సజ్జల.. సీబీఐ కక్ష కట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఏమన్నారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలని సూచించారు. కోర్టులే లేకపోతే ఎంపీ రఘరామకృష్ణరాజును కూడా చంపేసేవారేమోనని వ్యాఖ్యానించారు.  

తెదేపా మద్దతుతో గెలిచిన సర్పంచులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో చంద్రబాబు అధ్యక్షోపన్యాసం చేశారు. ‘నాడు సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎం జగన్‌.. అన్నా అని పిలిచి చివరికేం చేశారో అందరూ చూశారు. డీజీపీని కూడా సవాంగన్నా అని పిలిచి ఇప్పుడు పీకేశారు. అలా అని డీజీపీగా సవాంగ్‌ చేసిన పనుల్ని సమర్థించం. ఆయన పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నా కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే భావప్రకటన అని చెప్పారు. పోలీసులపై మంత్రి అప్పలరాజు దాడి చేసినా కనీస చర్యలు తీసుకోలేదు’ అని మండిపడ్డారు.

వైకాపా హయాంలో ఒక్క రోడ్డయినా వేశారా?

‘గ్రామాల్లో తెదేపా హయాంలో వేసిన రోడ్లే తప్ప వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డయినా వేశారా? పైగా 14, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల్లో రూ.7,658 కోట్లు దారి మళ్లించారు. దీంతోపాటు జల్‌జీవన్‌ పథకంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో రూ.3 వేల కోట్లు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లాలో సత్యసాయి నీటి పథకంలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పథకం మూత పడింది. ఇళ్ల స్థలాల చదును పేరుతో వైకాపా నేతలు వేల కోట్లు కొట్టేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నరేగాలో రూ.261 కోట్లు అవినీతి జరిగిందని కేంద్రం తేల్చింది. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.

సర్పంచికి ఉండే అవగాహన కూడా సీఎంకి లేదా?

‘ప్రధానికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఎలా అధికారమిచ్చిందో సర్పంచులకూ అలాగే ఇచ్చింది. రాష్ట్ర సచివాలయానికి అధిపతి ముఖ్యమంత్రి అయినప్పుడు గ్రామ సచివాలయానికి అధిపతి సర్పంచి కాదా? వాలంటీర్లను పెట్టి సర్పంచుల అధికారాన్ని తొలగిస్తారా? సర్పంచులకు ఉండే కామన్‌సెన్స్‌ కూడా ముఖ్యమంత్రికి లేదా?’ అని ధ్వజమెత్తారు. ‘సీఎం జగన్‌ అబద్ధాన్ని కూడా అతికేలా చెప్పి, చాలా విషయాల్లో ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. అబద్ధాన్నే జగన్‌ అతికేలా చెబుతున్నప్పుడు మనం నిజాన్ని ప్రజలు నమ్మేలా ఎందుకు చెప్పలేకపోతున్నాం? గ్రామస్థాయి నుంచి ప్రజలకు నిజాలు వివరించాలి. అది సర్పంచుల స్థాయి నుంచే మొదలవ్వాలి. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా రౌడీయిజాన్ని ఎదిరించి, తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థులు గెలిచారు. మనం గెలిచిన స్థానాలను కూడా ఫలితాలు తారుమారు చేసి వైకాపా ఖాతాలో వేసుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి పోటీలో ఉన్న వారిని వేధించినా రాజీలేని పోరాటం చేసి గెలిచిన అందరికీ అభినందనలు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చిన హక్కుల్లో పంచాయతీలకు 19 హక్కుల్ని తెదేపా హయాంలోనే కల్పించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థను జగన్‌ సర్వనాశనం చేశారు. సర్పంచుల హక్కుల్ని కాలరాస్తున్న వైకాపా ప్రభుత్వంపై పోరాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.


చేనేతలకు జగన్‌ నూలు పోగంత సాయం కూడా చేయలేదు
కార్మికుల ఆత్మహత్యలపై అధ్యయనానికి కమిటీ
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేత వర్గానికి కనీస ప్రోత్సాహం లేకపోవడంతో కార్మికులు ఆత్మహత్మకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో వారికి కనీసం నూలు పోగంత సాయం కూడా అందడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రచారార్భాటానికి చేసేంత ఖర్చు కూడా చేనేతల అభ్యున్నతికి వెచ్చించడం లేదని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చేనేత సామాజికవర్గం నేతలతో చంద్రబాబు గురువారం సమావేశం నిర్వహించారు. చేనేతల సమస్యలు, వాటిపై చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అప్పుల బాధతో పెడనలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు పద్మనాభం కుటుంబానికి లక్షన్నర, ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రకటించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని