Azadi Ka Amrit Mahotsav: భాష మార్చి... ‘అమృత’ దాడి!

ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక... ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఎంత కట్టడి చేసినా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది.

Updated : 23 Feb 2022 05:55 IST

ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక... ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఎంత కట్టడి చేసినా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది. ఎంతగా  అంటే ఈ పత్రికను లక్ష్యంగా చేసుకొని ఏకంగా ఓ చట్టమే తెచ్చింది బ్రిటిష్‌ సర్కారు. గాంధీజీతో పాటు రష్యా విప్లవవీరుడు లెనిన్‌ నుంచి కూడా ప్రశంసలందుకొని... బ్రిటిష్‌ పాలనపై మడమ తిప్పని పోరాటం చేసి... జాతీయోద్యమంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న అరుదైన భారతీయ పుత్రిక అమృత బజార్‌ పత్రిక!

బెంగాల్‌ రాష్ట్రంలోని జెసోర్‌ జిల్లా మగూరా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)  అనే చిన్న పల్లెటూరిలో మొదలైందీ అమృత బజార్‌ కథ! బెంగాలీ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన శిశిర్‌, మోతీలాల్‌ ఘోష్‌ అనే అన్నదమ్ములు 1868 ఫిబ్రవరిలో దీన్ని ఆరంభించారు. రూ.32కు కొన్న చెక్క ముద్రణయంత్రంపై దీన్ని వారపత్రికగా తీసుకొచ్చేవారు. గ్రామీణ ప్రాంత, రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేవారు. బిహార్‌ చంపారన్‌లో గాంధీజీ పర్యటనతో నీలిమందు రైతుల సమస్య లోకానికి తెలిసిందనుకుంటాం. కానీ అంతకుముందే నీలిమందు రైతుల సమస్యలను, బ్రిటిష్‌ సర్కారు ఆర్థిక విధానాలను ప్రశ్నించి ప్రచురించింది అమృతబజార్‌ పత్రిక.

క్రమంగా తన రూపురేఖల్ని మారుస్తూ, ఆంగ్లేయులపై పోరాటాన్ని విస్తృతం చేయటానికి పత్రిక కార్యాలయాన్ని 1871లో కోల్‌కతాకు మార్చారు. అమృతబజార్‌ పత్రిక బెంగాలీ భాషలో రాసే కథనాలు ప్రజాదరణ పొందాయి. ఇవి బ్రిటిష్‌ సర్కారుకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఎలాగైనా సరే దీన్ని కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వం... తమ ఉన్నతాధికారి సర్‌ ఆష్లే ఎడెన్‌ను సంపాదకుడు శిశిర్‌ వద్దకు రాయబారానికి పంపించింది. ప్రచురణకు ముందు వార్తలను తమకు చూపితే... ప్రభుత్వ పరంగా ‘అన్నివిధాలుగా సాయం’ చేస్తామని ప్రతిపాదించాడు ఆష్లే! కానీ శిశిర్‌ తలొగ్గలేదు. ‘దేశంలో ఒక్కడైనా నిజాయతీగల జర్నలిస్టును ఉండనివ్వండి’ అంటూ తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక అమృతబజార్‌ను లక్ష్యంగా చేసుకొని... 1878లో అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ లైటన్‌ వర్నాక్యులర్‌ ప్రెస్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషా పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శించటాన్ని నిషేధించారు. ఆంగ్ల పత్రికలకు మాత్రం మినహాయింపునిచ్చారు. కారణం... ఆ సమయానికి ఆంగ్ల పత్రికలన్నీ దాదాపుగా బ్రిటిష్‌ అనుకూలంగానే వ్యవహరించేవి.

దీంతో శిశిర్‌ తెలివిగా... రాత్రికి రాత్రి... అమృత బజార్‌ పత్రికను ఆంగ్ల పత్రికగా మార్చేశారు. సర్కారుపై దాడిని మాత్రం ఆపలేదు. ఏమీ చేయలేని ఆంగ్లేయ సర్కారు చోద్యం చూస్తూ ఉండిపోయింది. తరువాత 1919లో పత్రిక డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం సమయంలో పంజాబ్‌లో పత్రికపై నిషేధం విధించారు. అయినా వెరవకుండా అమృత బజార్‌ తన పోరాటం కొనసాగించింది. 1905 బెంగాల్‌ విభజన సమయంలోనైతే వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌పై కటువుగా విమర్శల వర్షం కురిపించింది. ‘‘ఎలాంటి అనుభవం, శిక్షణ లేని షోకిల్లా రాయుడికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన ఫలితమిది’’ అని కర్జన్‌ బెంగాల్‌ విభజనపై వ్యాఖ్యానించింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి సుభాష్‌ చంద్రబోస్‌పై వేటు వేయడాన్ని తప్పుపట్టింది. అమృతబజార్‌ పత్రిక కథనాల ఫలితంగానే బోస్‌కు మళ్లీ సీటిచ్చారు.


వైస్రాయ్‌ చెత్తబుట్టలోంచి..

శిశిర్‌ తర్వాత ఆయన కుమారుడు తుషార్‌ కాంతి ఘోష్‌ 1931లో బాధ్యతలు చేపట్టి... 60 ఏళ్లు ఎడిటర్‌గా కొనసాగారు. 1935లో ఆంగ్లేయ న్యాయమూర్తుల వివక్షను ఎత్తిచూపినందుకుగాను తుషార్‌ను జైలుకు పంపించారు. కశ్మీర్‌లో దోగ్రా రాజులను తొలగించేందుకు బ్రిటిష్‌ సర్కారు ప్రణాళికను... వైస్రాయ్‌ చెత్తబుట్టలోంచి పట్టుకున్న అమృత్‌బజార్‌ పత్రిక పరిశోధనాత్మక కథనం రాసింది. దాంతో ఆంగ్లేయులు తమ ప్రణాళికను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అలా... కాంగ్రెస్‌ ఆవిర్భావం నుంచి... స్వాతంత్య్ర సాధన దాకా జాతీయోద్యమంలో ప్రతిఘట్టానికీ అద్దం పట్టి... భారతీయుల గొంతుకై... ఆంగ్లేయులకు లొంగకుండా నిల్చిన ఘనత అమృత్‌ బజార్‌ పత్రిక సొంతం. జాతీయోద్యమంలో సమరయోధులెంతటి కృషి చేశారో ఈ పత్రిక కూడా అంతే పోరు సల్పింది. అందుకే... భారత్‌లో అత్యుత్తమ పత్రిక అమృత్‌బజార్‌ అంటూ 1920లో రష్యా విప్లవ నేత లెనిన్‌ కితాబు పంపించారు. గాంధీ సైతం ‘నిజంగా ఇది అమృతం’ అనేవారు. 123 సంవత్సరాలు కొనసాగిన అమృత్‌ బజార్‌ పత్రిక 1991లో మూతబడింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని