Viveka Murder Case: వివేకాపై అవినాష్‌, భాస్కర్‌రెడ్డిలకు ఈర్ష్య

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డిపై కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని అవినాష్‌రెడ్డి పెదనాన్న, భాస్కర్‌రెడ్డి సోదరుడు వై.ఎస్‌.ప్రతాప్‌రెడ్డి సీబీఐకి తెలిపారు.

Updated : 26 Feb 2022 09:02 IST

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను వాళ్లే ఓడించారు
వివేకా మృతదేహాన్ని చూశాక ఆయన గుండెపోటుతో మరణించలేదని గుర్తించా
సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్‌.ప్రతాప్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డిపై కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని అవినాష్‌రెడ్డి పెదనాన్న, భాస్కర్‌రెడ్డి సోదరుడు వై.ఎస్‌.ప్రతాప్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. భాస్కర్‌రెడ్డి ఎప్పుడూ వివేకానందరెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని వెల్లడించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను వివేకా పరిష్కరించేవారని.. దీంతో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదని వివరించారు. వివేకాను ఆయన శత్రువులూ గౌరవించేవారని, ఆయన నిర్ణయాల్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని చెప్పారు. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఈర్ష్యకు ఇవన్నీ కారణాలేనన్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేకా... పులివెందుల రింగ్‌రోడ్డులోని తన కార్యాలయానికి వచ్చి అరగంట మాట్లాడారని, 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్‌ వై.ఎస్‌.విజయమ్మకు లేదా షర్మిలకు ఇవ్వాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలిపారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాష్‌రెడ్డి మంచి అభ్యర్థి అవుతారన్న భావన వ్యక్తం చేశారని వివరించారు. ప్రజల్లోనూ అదే ప్రచారం ఉండేదని చెప్పారు. గతేడాది ఆగస్టు 16న ప్రతాప్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా అది వెలుగుచూసింది. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి అత్యంత సాధారణంగా, ఉదారంగా ఉండే రాజకీయ నాయకుడు. ఆయన శ్రేయోభిలాషులు చాలామంది ఆయనకే కడప లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని సిఫార్సు చేశారు’ అని ప్రతాప్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందులోని ఇతర ప్రధానాంశాలివే.

ఏదో తేడా ఉందని గుర్తించినా.. ఎవరికీ చెప్పలేదు

2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.50 గంటల సమయంలో నా సోదరుడు వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి ఫోన్‌ చేసి గుండెపోటు, రక్తపు వాంతులతో వివేకా మరణించారని చెప్పారు. ఉదయం 7.20 గంటలకు నేను అక్కడికి వెళ్లి చూసేసరికి మనోహర్‌రెడ్డి హాల్లో ఉన్నారు. బయట  అవినాష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లేసరికి అక్కడ ఎం.వి.కృష్ణారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇనయతుల్లా, ఆయన సోదరుడు ఉన్నారు. బెడ్‌ సమీపంలో రక్తపు మడుగు ఉంది.    తలగడ, బెడ్‌షీట్‌పై రక్తం ఉంది. కమోడ్‌ సమీపంలో రక్తపు మడుగులో వివేకా మృతదేహం ఉంది. గోడలపైన రక్తం ఉంది. నుదుటిపై తీవ్ర గాయాలున్నాయి. ఇవన్నీ చూశాక  గుండెపోటుతో మృతిచెందలేదని.. ఏదో తేడా ఉందని గుర్తించాను. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి.. ఈ నలుగురూ వివేకా గుండెపోటుతో చనిపోయారని అప్పటికే అందరికీ చెప్పటంతో నేను నా అభిప్రాయాన్ని ఎవరి వద్దా వ్యక్తం చేయలేదు.

ఆధారాలు ధ్వంసం చేయటం నచ్చలేదు

ఘటనా స్థలంలో పరిస్థితులు చూస్తే వివేకాది హత్యేనని నిర్ధారణ అవుతున్నా.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించటం, అక్కడున్న రక్తపు మడుగు, మరకలను శుభ్రం చేయించి ఆధారాలు ధ్వంసం చేయటం నాకు నచ్చలేదు. ఈ వ్యవహారంలో వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల ప్రమేయాన్ని నేను కొట్టిపారేయలేను. వివేకా బెడ్‌రూమ్‌లోకి నేను వెళ్లేసరికి ఓ పనిమనిషి అక్కడ రక్తపు మడుగు శుభ్రం చేస్తూ కనిపించారు. త్వరగా శుభ్రం చేయాలని శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రక్తపు మడుగును శుభ్రం చేయించేందుకు వారంతగా తొందరపడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘సార్‌ శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలాన్ని ఎందుకు శుభ్రం చేయిస్తున్నారు? ఆధారాలు ధ్వంసం చేసేస్తే కేసు మరింత క్లిష్టమైపోతుంది’ అని ఆయన నాతో అన్నారు.

ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలతో కూడిన బెడ్‌షీట్‌ను తొలగించి, దాన్ని మూలన పడేశారు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి బెడ్‌రూమ్‌కి, బయటకి పదే పదే తిరుగుతూ కనిపించారు. ఆ సమయంలో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆధారాలు ధ్వంసం చేశారు. వారు ఆధారాలు ధ్వంసం చేస్తున్న తీరు చూసి.. నేను ఉద్వేగం నియంత్రించుకోలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేశాను. అదే సమయంలో అక్కడ ఫ్రీజర్‌ బాక్సు కూడా గుర్తించాను. వివేకా గుండెపోటుతో మరణించారనే సిద్ధాంతాన్ని మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనేది తొలుత నాకు అర్థం కాలేదు. రక్తపు మడుగు వెంటనే శుభ్రం చేయాలని పనిమనిషిపై ఒత్తిడి తేవటం, ఆ సమయంలో వారి ప్రవర్తన చూసిన తర్వాత గుండెపోటు ప్రచారాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారనేది తెలిసింది. అక్కడ జరుగుతున్న ఆధారాల ధ్వంసాన్ని ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకే అలా చేశారు.

వివేకా ఓటమిలో క్రియాశీలక పాత్ర పోషించారు

2017 ఎన్నికల్లో వివేకా ఎమ్మెల్సీగా పోటీచేశారు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఆయన్ను ఓడించారు. వారివల్లే ఓడానని వివేకా కూడా ఆ తర్వాత గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని