Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మనవాళ్లెందరో?

ఉక్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసులు, విద్యార్థులను స్వరాష్ట్రానికి చేరవేసేందుకు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వారి వివరాలు సేకరిస్తోంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు మన దేశంలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను సంప్రదిస్తోంది.

Updated : 27 Feb 2022 09:21 IST

వివరాల సేకరణకు చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసులు, విద్యార్థులను స్వరాష్ట్రానికి చేరవేసేందుకు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వారి వివరాలు సేకరిస్తోంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు మన దేశంలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను సంప్రదిస్తోంది. వైద్య విద్య కోసం ఏటా తెలంగాణ నుంచి ఉక్రెయిన్‌కు విద్యార్థులు వెళుతున్న నేపథ్యంలో సంబంధిత కన్సల్టెన్సీల నుంచి సమాచారం సేకరిస్తోంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లోనూ పలువురు తెలంగాణ వారు బోధకులుగా పనిచేస్తున్నారు. ఈ వివరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. తమ వద్ద ఇప్పటికే నమోదైన వివరాలు లేవని వెల్లడించినట్లు తెలిసింది. విమానాశ్రయాల్లో విదేశాలకు వెళ్లేవారి వివరాలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తీసుకుంటున్నా.. అవి రాష్ట్రాలవారీగా లేవు. భారతీయులనే నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వపరంగా వివరాల సేకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. దిల్లీ, హైదరాబాద్‌లలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు సహాయ కేంద్రాలకు వస్తున్న ఫోన్ల ఆధారంగా అక్కడి అధికారులు సైతం ఈ వివరాలు నమోదు చేస్తున్నారు. రెండోరోజు శనివారం రాత్రి 7 గంటల వరకు 162 మంది విద్యార్థులు, ప్రవాసులు ఈ కేంద్రాలకు ఫోన్‌ చేశారు. ఇందులో ఉక్రెయిన్‌ నుంచి 42 మంది విమానాల సమాచారం అడిగి తెలుసుకున్నారు. వారి వివరాలను అధికారులు విదేశాంగశాఖకు, స్థానిక రాయబార కార్యాలయానికి పంపించారు.

విదేశాల్లోని విద్యార్థుల లెక్కలేవి?

ఏ రాష్ట్రం నుంచి ఏ దేశానికి ఎంతమంది విద్యార్థులు వెళ్లారన్న గణాంకాలు లేకపోవడంతో విదేశాల్లో విపత్తులు, ప్రమాదాల సమయంలో అంతా గజిబిజిగా మారుతోంది. ఇటీవల కాలంలో తక్కువ ఖర్చులో విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఏజెంట్లు కూడా పుట్టుకొచ్చారు. హైదరాబాద్‌లో వైద్య విద్య కోసం విదేశాలకు పంపే సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కన్సల్టెన్సీలు అనుమతులు తీసుకునేలా, ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని అయిదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.  మున్ముందు ఈ సంఖ్య పెరగడమే తప్ప తగ్గేలా లేదు.ఈ పరిస్థితుల్లో మన విద్యార్థులు ఏ దేశంలో ఎంత మంది ఉన్నారు? అవసరమైతే వారిని వెంటనే గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని