Andhra News: వార్డు సచివాలయ సిబ్బందికి మరుగుదొడ్ల బాధ్యత

గుంటూరు నగరపాలక సంస్థలో మరుగుదొడ్లను వాడుకునే వారి నుంచి రుసుము వసూలు బాధ్యతను వార్డు సచివాలయంలోని అడ్మిన్‌ కార్యదర్శులకు అప్పగించడం తీవ్ర దుమారాన్ని రేపింది. నగర పరిధిలోని 5 మరుగుదొడ్ల నిర్వహణను వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు

Updated : 02 Mar 2022 03:18 IST

 వార్డు అడ్మిన్‌ కార్యదర్శులతో రుసుము వసూలు

గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఉత్తర్వులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గుంటూరు నగరపాలక సంస్థలో మరుగుదొడ్లను వాడుకునే వారి నుంచి రుసుము వసూలు బాధ్యతను వార్డు సచివాలయంలోని అడ్మిన్‌ కార్యదర్శులకు అప్పగించడం తీవ్ర దుమారాన్ని రేపింది. నగర పరిధిలోని 5 మరుగుదొడ్ల నిర్వహణను వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు అప్పగిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఉత్తర్వులనిచ్చారు. విధిగా వసూలయ్యేలా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనిపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పౌర సేవల్ని ఇంటి గడప వద్దకు చేరుస్తున్న సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ తరహా ఉత్తర్వులనిచ్చారని మండిపడింది. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

నిర్వహణకు 14 మంది అడ్మిన్‌ కార్యదర్శులు.. రాత్రిళ్లూ విధులు

సాధారణంగా మరుగుదొడ్ల నిర్వహణకు టెండర్లు నిర్వహించి ఏదైనా గుత్తేదారు సంస్థకు అధికారులు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. దీనికి భిన్నంగా నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులే తీసుకుని ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించడం తీవ్ర విమర్శలపాలవుతోంది. 15 ఏళ్లనుంచి వీటి నిర్వహణను చూస్తున్న గుత్తేదారు సంస్థ కాలపరిమితి ముగిసినందున రుసుము వసూలు బాధ్యతను తీసుకుని వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 14 సచివాలయాల పరిధిలోని వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించారు. నగర పరిధిలోని బండ్ల బజారులోనున్న మరుగుదొడ్డి నిర్వహణకు ఇద్దరు అడ్మిన్‌ కార్యదర్శుల్ని నియమించారు. మిగతా అన్నింటికీ ముగ్గురు చొప్పున నియమించారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఒకరు, ఆపై అక్కడినుంచి రాత్రి 10గంటల వరకు మరొకరు, రాత్రి 10 గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు ఇంకో ఉద్యోగి విధులు నిర్వర్తించేలా 24 గంటల కాలనిర్ణయ పట్టిక ప్రకటించారు. మహిళా అడ్మిన్‌ కార్యదర్శులు సైతం రాత్రిళ్లు విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఏ సమయంలో ఏ ఉద్యోగి విధులు నిర్వర్తించేది ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వసూళ్ల లక్ష్యం

ఏ మరుగుదొడ్డి వద్ద ఎంత వసూలు కావాలో రోజువారీ లక్ష్యాలను అధికారులు నిర్దేశించారు. గాంధీపార్కులోని మరుగుదొడ్డి వద్ద రోజుకు రూ.5 వేల చొప్పున, బండ్లబజారు వద్దనున్న మరుగుదొడ్డి నుంచి రూ.300, కృష్ణాపిక్చర్‌ ప్యాలెస్‌ వద్ద మరుగుదొడ్డి నుంచి రూ.400, ఎన్టీఆర్‌ బస్టాండు వద్ద మరుగుదొడ్డి నుంచి రూ.1000, కొల్లి శారద కూరగాయల మార్కెట్‌ వద్ద మరుగుదొడ్డి నుంచి రూ.2వేల చొప్పున వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టారు. సంబంధిత ఉద్యోగికి కేటాయించిన సమయంలో వసూలైన మొత్తాన్ని ఆదే రోజు కార్పొరేషన్‌ పరిధిలోని ఆర్‌ఐకి అప్పగించాలని స్పష్టం చేశారు. రోజువారీగా వసూలైన మొత్తాన్ని మరుసటి రోజు ఆ ఆర్‌ఐ క్యాష్‌కౌంటర్‌లో జమ చేయాలని సూచించారు.

రుసుము దుర్వినియోగం కాకుండా ఉండేందుకే..

మరుగుదొడ్ల వద్ద రుసుము వసూళ్లను ప్రజారోగ్య సిబ్బందే చేస్తారు. వార్డు అడ్మిన్‌ కార్యదర్శులు పర్యవేక్షించడమే తప్ప నేరుగా రుసుము వసూలు చేయాల్సిన పనిలేదు. రుసుము దుర్వినియోగం కాకుండా ఈ బాధ్యతలను అప్పగించాం. గతంలో జరిగిన వసూళ్లను పరిశీలించి లక్ష్యాలనిచ్చాం. అలా అని లక్ష్యాలను పక్కాగా చేరుకోవాలనేం కాదు. దీనిపై అపోహలు వద్దు. 

   -నిరంజన్‌రెడ్డి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని