Updated : 02 Mar 2022 08:11 IST

Andhra News: జీతాలు, పెన్షన్లు కొందరికే జమ.. లక్ష మందికి పైగా అందలేదంటున్న నాయకులు

 రూ.2,000 కోట్ల రుణానికి ప్రతిపాదన

  సగమే తీసుకున్న రాష్ట్రం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇంకా చాలా మందికి జమ కాలేదు. బిల్లులు సమర్పించి ఖజానా అధికారుల నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లినా కూడా ఇంకా జీతాలు అందుకోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాష్ట్రంలో నిధుల లభ్యత ఆధారంగా కొద్ది మందికి జీతాలు, కొద్ది మందికి పెన్షన్లు మొదటి వారంలో ఇస్తూ వస్తున్న క్రమంలోనే ఈ నెల కూడా అదే పంథా కొనసాగుతోందని సమాచారం. జీతాలు, పెన్షన్ల తాజా పరిస్థితి గమనించేందుకు కొందరు వెబ్‌సైట్‌లో పరిశీలించగా వారికి చెల్లింపులు ‘సక్సెస్‌’ అయినట్లు చూపుతున్నా వారి ఖాతాలకు ఇంకా జమ కాని పరిస్థితి నెలకొంది.  ఇలాంటి వారికి కొద్ది ఆలస్యంగానైనా ఆయా మొత్తాలు జమ అవుతాయని, బ్యాచ్‌ మొత్తం ఒకేసారి జమ కాబోవని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులు కొత్త జీతాల బిల్లులు సిద్ధం చేసి మినహాయింపులు కోత పెట్టి, అదనంగా చేర్చాల్సినవి చేర్చి పక్కాగా సిద్ధం చేసిన మేరకు ఉద్యోగులు జీతాలు అందుకోవలసి ఉంది. జనవరి నెల జీతంతోనే కొత్త పీఆర్సీ అమలు చేస్తూ వచ్చినా అప్పట్లో ఉద్యోగులు, డీడీవోల సహాయ నిరాకరణ వల్ల పక్కాగా ఆ పని జరగలేదు. ప్రస్తుతం డీడీవోలు, ఖజానా అధికారుల సాయంతోనే బిల్లులు పాస్‌ చేసే ప్రక్రియ చేపట్టడంతో అసలు కొత్త జీతం ఎంతో స్పష్టంగా ఉద్యోగులందరికీ ఫిబ్రవరి జీతంతో అవగతమవుతుంది. చాలా మంది ఉద్యోగుల ఆదాయపు పన్నును ప్రధానంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మినహాయించుకుంటూ ఉంటారు. జనవరి నెలలో  మినహాయించుకునే వెసులుబాటు రాకపోవడంతో చాలా మందికి ఫిబ్రవరి జీతం దాదాపు ఆదాయపు పన్ను రూపంలోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితీ ఏర్పడిందని చెబుతున్నారు. కొందరు ఉద్యోగులు ఇంకా ఆదాయపు పన్ను వివరాలు డీడీవోలకు సమర్పించకపోవడంతో వారి బిల్లులు సమర్పించలేదు. మరో వైపు జనవరి జీతాల ఖాతాను సస్పెన్స్‌ ఖాతా ద్వారా సర్దుబాటు చేసి ఫిబ్రవరి జీతాల బిల్లులు చేయాలని తొలుత ఆదేశించిన అధికారులు.. ఆ తరవాత మినహాయింపు ఇచ్చారు. ఆ విధంగా సమర్పించినా మంగళవారం చాలా మందికి జీతాలు, పెన్షన్లు అందలేదు.

* రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న వారు దాదాపు 3.50 లక్షల మంది ఉన్నారు. అందులో లక్ష మంది వరకు మంగళవారం రాత్రికి కూడా పెన్షన్‌ అందలేదని రాష్ట్ర పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. తనకి కూడా ఇంకా పెన్షన్‌ రాలేదన్నారు.

రూ.1,000 కోట్ల రుణ స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.1,000 కోట్ల రుణం స్వీకరించింది. 17 ఏళ్ల కాలపరిమితితో 7.13శాతం వడ్డీతో ఈ రుణం తీసుకుంది. నిజానికి రూ.2వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ప్రతిపాదించినా మరో రూ.1,000 కోట్ల రుణ స్వీకరణను తిరస్కరించింది. 15ఏళ్ల  కాలపరిమితికి నిర్దేశించిన రుణం తీసుకోలేదు. ఎక్కువ వడ్డీ రేటుతో ఇచ్చేందుకు రుణ దాతలు ముందుకు రావడం వల్లే వాయిదా వేసుకుని ఉండొచ్చనే చర్చ ఉంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని