CM Jagan: ఆర్‌బీకేల్లో డ్రోన్లు

రైతు భరోసా కేంద్రాల స్థాయిలో డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని, వాటిని నిర్వహించే వ్యవస్థలనూ గ్రామస్థాయిలోనే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నానో ఎరువులు ఉపయోగించే...

Updated : 03 Mar 2022 04:32 IST

రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాలు

రాష్ట్ర క్రెడిట్‌ సెమినార్‌లో సీఎం

2022-23 సంవత్సరానికి రూ.2.54 లక్షల కోట్లతో నాబార్డు దార్శనిక పత్రం విడుదల

ఈనాడు, అమరావతి: రైతు భరోసా కేంద్రాల స్థాయిలో డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని, వాటిని నిర్వహించే వ్యవస్థలనూ గ్రామస్థాయిలోనే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నానో ఎరువులు ఉపయోగించే ఆధునిక యుగంలో ఉన్నాం. దాన్ని మరింత అందుకునే దిశగా.. వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టి పెడతాం’ అని తెలిపారు. రాయితీపై వ్యవసాయ ఉపకరణాలను రైతులకు అందించడంతోపాటు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌లో 2022-23 సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యరంగాలకు రూ.2.54 లక్షల కోట్లతో రూపొందించిన నాబార్డు రుణ దార్శనిక పత్రాన్ని (ఫోకస్‌ పేపర్‌)ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలకు నాబార్డు, బ్యాంకులు సహాయ పడుతున్నాయని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ‘ఫ్లోరోసిస్‌ సమస్యతో చాలా గ్రామాల్లో ఇబ్బంది నెలకొంది. నీటికొరత ఉన్న ప్రాంతాలకు రవాణా వ్యయం ఎక్కువవుతోంది. ఎంపికచేసిన ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు బ్యాంకులు సాయం అందించాలి. సహకార బ్యాంకులు, సహకార సంఘాలను ఆధునికీకరిస్తున్నాం. ఆర్‌బీకేల్లోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లే బ్యాంకులు, సహకార సంఘాలకు అనుసంధాన కార్యకర్తలుగా వ్యవహరిస్తారు. ప్రతి రైతుకూ రుణం అందించేలా చూస్తారు. లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే కార్యక్రమాలకు బ్యాంకుల సహకారం అవసరం. గ్రామస్థాయిలోనే ప్రాథమిక ఆహారశుద్ధి కేంద్రాలు, గోదాములు, శీతల గిడ్డంగులు అందుబాటులోకి తెస్తున్నాం. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరవు నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గ్రామీణప్రాంతాల్లో ఉపాధికల్పనలో ముఖ్యమైన ఎంఎస్‌ఎంఈ రంగంపై ప్రత్యేకదృష్టి సారించాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్రానికి ఈ ఏడాది రూ.35వేల కోట్ల సాయం

రంగాల వారీగా రుణ మంజూరును పెంచేందుకు, పెట్టుబడి ప్రాధాన్యాలను బ్యాంకర్లకు వివరించేందుకు నాబార్డు దార్శనికపత్రం సహాయపడుతుందని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. నాబార్డు ద్వారా 2020-21 సంవత్సరంలో రూ.32,844 కోట్ల ఆర్థిక సహాయం చేయగా, 2021-22లో ఇప్పటివరకు రూ.35వేల కోట్లకు పైగా అందించామని నాబార్డు జీఎం ఉదయ్‌భాస్కర్‌ వివరించారు.

రూ.2.54 లక్షల కోట్లతో దార్శనిక పత్రం

2022-23 సంవత్సరంలో ప్రాధాన్యరంగాలకు రూ.2.54 లక్షల కోట్ల రుణ ప్రణాళికను నాబార్డు రూపొందించింది. గతేడాదితో పోలిస్తే రుణ మంజూరు 10% పెంచాలని అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి రూ.1.71 లక్షల కోట్లు అవసరమని దార్శనిక పత్రంలో పేర్కొంది. మొత్తం రుణంలో... వ్యవసాయ రంగానికి 67.24%, ఎంఎస్‌ఎంఈలకు 20.63%, గృహనిర్మాణానికి 6.17% అవసరమని వివరించింది.

* వ్యవసాయ అనుబంధ రంగంలో భాగంగా టర్మ్‌రుణాల కింద పశుపోషణకు రూ.13,754 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.4,047 కోట్లు, మత్స్య పరిశ్రమకు రూ.4,222 కోట్లు, ఉద్యానశాఖకు రూ.3,333 కోట్లు, ఆహారశుద్ధికి రూ.4,069 కోట్లు, నిల్వ, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనకు రూ.2,860 కోట్లు అవసరమని నాబార్డు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని