ఎప్పుడేం జరిగింది?

ఒక మహోన్నత ఆశయంతో, మహా నగర నిర్మాణానికి బీజావాపన చేసింది మొదలు... వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తేవడం... ఉవ్వెత్తున సాగిన రైతుల ఉద్యమం, సుదీర్ఘ న్యాయ పోరాటం, హైకోర్టు తీర్పు వరకు...

Published : 04 Mar 2022 04:10 IST

ఒక మహోన్నత ఆశయంతో, మహా నగర నిర్మాణానికి బీజావాపన చేసింది మొదలు... వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తేవడం... ఉవ్వెత్తున సాగిన రైతుల ఉద్యమం, సుదీర్ఘ న్యాయ పోరాటం, హైకోర్టు తీర్పు వరకు... ఒకటా రెండా ఎన్నెన్నో ఘట్టాలు. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెప్టెంబరు 3న ఆంధ్రప్రదేశ్‌  రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం చేసింది మొదలు, గురువారం హైకోర్టు తీర్పు వెలువడేంత వరకు... గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో చోటు    చేసుకున్న వివిధ ఘట్టాలు, వైకాపా ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడం, రైతుల ఉద్యమంలోని కీలక ఘట్టాలు, పరిణామాల సమాహారం ఇది..!

2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం

2014 డిసెంబరు 23: ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ

2014 డిసెంబరు 30: ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం. సీఆర్‌డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ.ల (తర్వాత దీన్ని 8,603 చ.కి.మీ.లకు పెంచారు) విస్తీర్ణంలో కేపిటిల్‌ రీజియన్‌ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం

2015 జనవరి 1: రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం

2015 ఫిబ్రవరి 28: కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు

2015 అక్టోబరు 22: ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన

2016 ఏప్రిల్‌ 25: వెలగపూడి సచివాలయాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు

2016 జూన్‌ 6: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం.

2016 అక్టోబరు 28: పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన

2017 ఫిబ్రవరి 3: పరిపాలన నగరం మాస్టర్‌ ప్లాన్‌, శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల ఆకృతుల రూపకల్పనకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థతో ఒప్పందం

2017 మార్చి 1: ప్రాథమిక డిజైన్లు అందజేసిన ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ

2017 మార్చి 2: వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు

2017 మే 15: స్టార్టప్‌ ఏరియాని సింగపూర్‌ కన్సార్షియం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఒప్పందం. శంకుస్థాపన

2017 డిసెంబరు 27: రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

2019 ఫిబ్రవరి 3: హైకోర్టు ఐకానిక్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ (ప్రస్తుత హైకోర్టు) ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తరుణ్‌ గొగొయ్‌.


వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు

2019 డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం ప్రకటన

2019 డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు

2019 డిసెంబరు 20: పరిపాలనను వికేంద్రీకరించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సు

2020 జనవరి 7: చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన అన్నదాతలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాన్ని చుట్టుముట్టిని రైతులు. రైతులతో పోలీసుల ఘర్షణ.

2020 జనవరి 10: పొంగళ్లు సమర్పించి, మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడకు వెళుతున్న రాజధాని మహిళలు, రైతులపై పోలీసుల దాష్టీకం. వెలగపూడి వద్ద రణరంగంగా మారిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు

2020 జనవరి 20: చలో అసెంబ్లీకి రాజధాని రైతుల పిలుపు. అసెంబ్లీ సమీపానికి చేరుకున్న రైతులు.. పోలీసుల లాఠీఛార్జి

2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ

2020 జనవరి 22: బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్‌కి తెదేపా సభ్యుల నోటీసులు. సభలో గందరగోళం. బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపుతూ అప్పటి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం

2020 జూన్‌ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం

2020 జూన్‌ 17: మండలిలో తెదేపా సభ్యుల ఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు

2020 జులై 18: బిల్లుల్ని గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం

2020 జులై 31: బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌

2020 ఆగస్టు 8: సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కేసు

2021 మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గ గుడికి వెళుతున్న మహిళా రైతుల్ని అడ్డుకున్న పోలీసులు. మహిళలపై దురుసు ప్రవర్తన. కొందరికి గాయాలు

2021 నవంబరు 1: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు

2021 నవంబరు 11: ప్రకాశం జిల్లాలోని చదలవాడ వద్ద పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసుల దాడి

2021 నవంబరు 22: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

2022 మార్చి 3: రాజధాని రైతుల ఉద్యమం 807వ రోజుకి చేరింది. రాజధాని కేసులపై హైకోర్టు తీర్పు వెలువడింది.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని