Viveka Murder Case: పెద్ద నాయకుల ప్రమేయం

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు’

Updated : 05 Mar 2022 09:46 IST

వివేకాకు గుండెపోటు ప్రచారాన్ని తెరపైకి తెచ్చినవారికి హత్య కుట్రలో పాత్ర
అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సమక్షంలో ఆధారాల ధ్వంసం
సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వివేకానందరెడ్డి బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి
వివేకాకు, జగన్‌కు మధ్య విభేదాలున్నాయని వెల్లడి

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకు వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందన్నారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డిల సమక్షంలోనే ఘటనా స్థలంలోని ఆధారాల ధ్వంసం జరిగిందని చెప్పారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు అక్కడున్న రక్తాన్ని పనిమనుషులు తుడిచారని వివరించారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు స్నేహితుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి కాటన్‌, బ్యాండేజీతో పాటు డాక్టర్లు, కాంపౌండర్లను ఏర్పాటుచేశారని తెలిపారు. 2019 మార్చి 15వ తేదీ వేకువజామున 4 గంటల సమయంలోనే వివేకా మృతి గురించి ఆయనకు తెలుసన్నారు. గతేడాది ఆగస్టు 28న ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అది తాజాగా వెలుగుచూసింది. ప్రధానాంశాలివే.

వివేకాకు, జగన్‌కు మధ్య విభేదాలు

2004 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ కావాలని జగన్‌మోహన్‌రెడ్డి పట్టుబట్టారు. కానీ... ఆ టికెట్‌ వివేకానందరెడ్డికి లభించింది. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో వివేకా చేరడం జగన్‌కు ఇష్టం లేదు. 2010లో జగన్‌ వైకాపా స్థాపించడం వివేకాకు ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీలో చేరలేదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో ఆయన విజయమ్మపై పోటీచేసి ఓడిపోయారు. వివేకా సోదరుడు సుధీకర్‌రెడ్డితోపాటు వివేకా అనుచరులు ఆయన్ను వైకాపాలో చేరాలని కోరారు. మొదట్లో వద్దన్నా, తర్వాత జగన్‌ సరేననడంతో 2012 డిసెంబరులో వివేకా వైకాపాలో చేరారు. కానీ వారిద్దరి మధ్య విభేదాలు ఉండేవి.

భారతి బంధువులు కావటంతో అవినాష్‌, భాస్కర్‌రెడ్డి జగన్‌కు దగ్గరయ్యారు

జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి తల్లి.. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డికి సోదరి. జగన్‌ పెళ్లి తర్వాత అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి జగన్‌కు దగ్గరయ్యారు. అవినాష్‌రెడ్డికి కడప లోక్‌సభ టికెట్‌ లభించటానికి మూడు కారణాలున్నాయి. అవి.. భారతికి బంధువులు కావటం; 2011 ఉప ఎన్నికల్లో విజయమ్మపై వివేకా పోటీ చేయటం; వివేకాకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుకూలంగా లేకపోవటం, వివేకా వైకాపాలో చేరటం, 2017లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడంపై భాస్కర్‌రెడ్డి కుటుంబీకులు అసంతృప్తితో ఉండేవారు. వారు శివశంకర్‌రెడ్డికి మద్దతిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వివేకా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తరఫున తిరిగేవారు. వారి అసంతృప్తికి ఇదీ ఓ కారణం. తన ఓటమికి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమయ్యారని వివేకా ఆగ్రహంగా ఉండేవారు. ఎర్ర గంగిరెడ్డి వారితో చేతులు కలిపారంటూ అతడినీ దూరం పెట్టారు.

అవినాష్‌ నా ఫోన్‌ తీయలేదు

వివేకానందరెడ్డి చనిపోయారని 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.18 గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నాకు ఫోన్‌ చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి, వివేకా సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డికి ఉదయం 6.26కు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పాను. టైపిస్టు ఇనయతుల్లాకు ఫోన్‌ చేసి వివేకా ఇంటికి వెళ్లి చూసి ఏం జరిగిందో చెప్పాలన్నాను. తర్వాత మా కుటుంబమంతా రెండు వాహనాల్లో హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరాము. అవినాష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత నాకు సమాచారం ఇవ్వలేదు. ఆయనకు ఫోన్‌ చేస్తే తీయలేదు. అప్పుడు ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా మరణం గురించి చెప్పాను. ఆయన చాలా తేలిగ్గా.. ‘అట్లానా’ అనడంతో నాకు ఆశ్చర్యం కలిగింది.

2019 మార్చి 14న నా మనవరాలి పుట్టినరోజుకు హైదరాబాద్‌ రావాలని ఎర్ర గంగిరెడ్డితో పాటు రాజారెడ్డి అనే మరో వ్యక్తిని 12న ఆహ్వానించాను. నా కుటుంబసభ్యులు కాకుండా పులివెందుల నుంచి ఆహ్వానించింది వారిద్దరినే. తనకు అత్యవసరమైన పని ఉందని, తాను రాలేనని రాజారెడ్డితో గంగిరెడ్డి చెప్పారు. ఎంత పని ఉన్నా, మా కుటుంబంలో ఏ శుభకార్యాలకూ ఆయన హాజరుకాకుండా లేరు. అలాంటిది రాలేననడం, అదీ నాతో కాకుండా రాజారెడ్డితో చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. వివేకా హత్యకు గురైన రోజు రాత్రి ఆయన పులివెందుల్లోనే ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని