Andhra News: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు విధానం సరికాదు!

ఆంధ్రపదేశ్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు ఉద్యోగ విధానంపై 11వ వేతన సవరణ కమిషన్‌ కీలక సిఫార్సులు చేసింది. ప్రభుత్వ కీలక బాధ్యతల్లోకి ఉద్యోగులుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు విధానంలో నియామకాలు చేపట్టడం సరికాదని తేల్చిచెప్పింది.

Published : 07 Mar 2022 08:47 IST

కాంట్రాక్టు ఉద్యోగులను కీలకాంశాలకు బాధ్యులను చేయలేం

ఈనాడు, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు ఉద్యోగ విధానంపై 11వ వేతన సవరణ కమిషన్‌ కీలక సిఫార్సులు చేసింది. ప్రభుత్వ కీలక బాధ్యతల్లోకి ఉద్యోగులుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు విధానంలో నియామకాలు చేపట్టడం సరికాదని తేల్చిచెప్పింది. ‘ఒప్పంద లేదా పొరుగుసేవల విధానంలో ఒక ఉద్యోగిని శాశ్వత పోస్టుల్లో నియమించడం సమంజసం కాదు. వీరు రెగ్యులర్‌ సిబ్బందితో సమానమైన స్ఫూర్తిని చూపలేరు. పాలనాపరంగా వారిని బాధ్యులను చేయలేనందున కీలకమైన బాధ్యతలు వారికి అప్పగించలేం’ అని అశుతోష్‌ మిశ్ర నివేదిక తేల్చిచెప్పింది. ఒకవైపు పొరుగుసేవల సిబ్బందికి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా, వారి వేతనాల్లో ఎలాంటి కోత లేకుండా ఆపస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా నేరుగా వేతనాలు చెల్లిస్తున్నామని సర్కారు చెబుతుండగా మరోవైపు అశుతోష్‌ మిశ్ర నివేదిక పొరుగుసేవల ఉద్యోగులు కొందరు ఏజెన్సీల చేతిలో మోసపోతున్నారని వెల్లడించింది. వేతన సవరణ కమిషన్‌ నివేదిక గత అక్టోబరులోనే ప్రభుత్వానికి అందింది. ఆ నివేదికలోనూ ఔట్‌సోర్సింగు ఏజెన్సీల చేతిలో తాము ఆర్థికంగా మోసపోతున్నామని పొరుగుసేవల సిబ్బంది తమకు తెలియజేసినట్లు పేర్కొనడం గమనార్హం. పొరుగుసేవల సిబ్బందిని కేవలం కొన్ని సేవలకే వినియోగించుకోవాలని, అదీ ఆ సేవలు టెండర్లు పిలిచి పొరుగు సేవల ఏజెన్సీలకే అప్పచెప్పాలని వేతన కమిషన్‌ సిఫార్సు చేసింది. ఏ ఒక్క ఉద్యోగినీ విడిగా పొరుగుసేవల ఏజెన్సీ నుంచి ఇకముందు తీసుకోవద్దని సిఫార్సు చేసింది. కార్యాలయాల శుభ్రత, నిర్వహణ, బిల్లుల వసూళ్లు, కార్యాలయాల రక్షణ, వాహనాల సరఫరా, డ్రైవర్ల సరఫరా వంటి ఏజెన్సీలు, రిసెప్షన్‌ డెస్కుల నిర్వహణకే పొరుగుసేవల ఏజెన్సీలను వినియోగించుకోవాలని వేతన సవరణ కమిషన్‌ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని