Andhra News: పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పదకొండో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి ఆర్థికశాఖ

Updated : 09 Mar 2022 07:51 IST

 పిల్లల దత్తత సమయంలోనూ సెలవులు
పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పదకొండో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ విడుదల చేశారు. వివరాలివి..
* పిల్లలను దత్తత తీసుకునే ఉద్యోగినులకు దత్తత సెలవు 180 రోజుల వరకూ మంజూరుచేస్తారు. ఇద్దరిలోపు పిల్లలు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఒక ఏడాది లోపు వయసు ఉన్నవారిని దత్తత తీసుకున్నప్పుడు ఈ సెలవు ఇస్తారు. పురుష ఉద్యోగులకూ ఇలాంటి సందర్భాల్లో పితృత్వ సెలవు 15 రోజులు ఇస్తారు. పెళ్లి చేసుకోని పురుషులు, భార్య మరణించిన వారికి, విడాకులు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలల లోపు ఈ సెలవు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెలవు కాలానికి జీతం ఇస్తారు.
* దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే.. ఆ సెలవు ఏడాది పాటు కూడా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ 6-7 నెలల మధ్య వారయితే ఆరు నెలల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది.
* పిల్లల సంరక్షణకు తీసుకునే సెలవు తమ ఉద్యోగ కాలం మొత్తం మీద 180 రోజుల పాటు మహిళా ఉద్యోగులు తీసుకోవచ్చు.
* ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగు సిబ్బందికి, ఎముకలు, అవయవాల పరంగా ఇబ్బందులున్న ఉద్యోగులు, ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు ఏడాదికి 7 రోజుల పాటు వర్తింపజేయనున్నారు.
* కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్‌, క్షయ, కుష్టు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ  ఉత్తర్వులిచ్చారు. ఎన్‌జీవోల్లో మూలవేతనం రూ.35,570కు పరిమితం చేస్తూ ఎక్స్‌గ్రేషియా కనీసం రూ.11,560, గరిష్ఠంగా రూ.17,780 చెల్లిస్తారు. చివరి గ్రేడు ఉద్యోగికి కనీసం రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని