Updated : 09 Mar 2022 09:34 IST

మండపేటలో యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడంతో చనిపోయాడంటూ ఆందోళన

నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత

మండపేట, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ కొట్టడం వల్లే చనిపోయాడని అతడి బంధువులు ఆరోపిస్తూ మృతదేహంతో నాలుగు గంటలపాటు ఆందోళన చేశారు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 వరకు ఆందోళన కొనసాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతర పరిణామాల్లో.. సీఐ దుర్గాప్రసాద్‌ను వీఆర్‌కు పంపినట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. తొలి ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలివీ.. మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్‌ (కాళీ)(20) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా మండపేటలోనే ఉంటూ తండ్రికి వ్యవసాయంలో సహకరిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలికతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో బాలిక తల్లి తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రికి డబ్బు అవసరమైతే కూడా కాళీయే సర్దాడని అతడి బంధువులు చెప్పారు. అయితే, బాలిక తల్లి మాత్రం, తమ కుమార్తెతో కాళీ చనువుగా ఉండకుండా చూడాలని మండపేట పోలీస్టేషనులో ఫిర్యాదు చేశారు. టౌన్‌ సీఐ దుర్గాప్రసాద్‌ కాళీని ఆదివారం స్టేషనుకు పిలిచి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అతడ్ని కొట్టారని, మర్మావయవాల వద్ద గాయాలయ్యాయని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక రోజంతా ఒళ్లు నొప్పులతో బాధపడటంతో స్థానిక వైద్యుడికి చూపించామని, మంగళవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో వెతకగా ఏడిద రోడ్డులో మరణించి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సాయంత్రం 4.30 సమయంలో అక్కడ నుంచి కలువపువ్వు సెంటరుకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదని, సీఐని సంఘటన స్థలానికి పిలిపించాలని రాత్రి 8.30 వరకు ఆందోళన కొనసాగించారు. సాయంత్రం 5.30 ప్రాంతంలో సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి బాధితులతో చర్చించారు. సీఐని పిలిపించాలని బాధితులు పట్టుబట్టారు. ఇంతలో వైకాపా, జనసేన నాయకులూ అక్కడకు చేరుకున్నారు. బాధితులు ఎవరిపై ఫిర్యాదు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వివరించారు. దాంతో.. సీఐ దుర్గాప్రసాద్‌, ఓ కానిస్టేబుల్‌, బాలిక తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. అప్పటికీ ఆందోళనకారులు వెళ్లకపోగా.. సీఐని పిలిపించకపోతే ఆత్మాహుతికి పాల్పడతామని మృతుడి సోదరులు అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటికే సర్కిల్‌ పరిధిలోని సీఐ, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసులను సంఘటన స్థలంలో మోహరించారు. బాధితులను ఒప్పించడంతో ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts