Teachers:బోధనేతర పనులకు ఉపాధ్యాయులొద్దు

ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించకూడదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘ఉపాధ్యాయులు

Updated : 10 Mar 2022 06:34 IST

వారు పూర్తిగా బోధనలోనే ఉండాలి

విద్యాశాఖపై  సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించకూడదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. లేదంటే పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులున్నారు. వారి సేవలను సమర్థంగా వాడుకోగలిగితే నాణ్యమైన విద్య అందుతుంది. అన్ని తరగతులకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. విద్యార్థులకు ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదాన్ని నేర్పేటప్పుడు నిఘంటువులో ఆ పదాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతోపాటు వాక్యాల్లో ఎలా వినియోగించాలో నేర్పాలి’ అని ఆదేశించారు. ‘కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతమున్న వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చాలి.

ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు కెరీర్‌ మార్గదర్శకత్వం ఇవ్వాలి. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులను విడివిడిగా కలుస్తూ వారి భవిష్యత్తుకు మార్గం వేసేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి’ అని సూచించారు.

15 నుంచి రెండో విడత ‘నాడు-నేడు’

‘రెండో విడత ‘నాడు- నేడు’ను ఈనెల 15 నుంచి ప్రారంభించాలి. పాఠశాలలకు క్రీడా స్థలాలు ఉండాలి. ప్రతి ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యా కానుక అందించాలి. ప్రైవేటు కళాశాలల్లో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయో.. లేదో చూడాలి. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద కల్పిస్తున్న సౌకర్యాల నిర్వహణ సరిగా లేకుంటే నిరర్ధకమవుతాయి. మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంట్లు తదితరాలపై ఫిర్యాదులు వచ్చిన వారం రోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ సిబ్బంది, విలేజ్‌ క్లినిక్‌లలోని సిబ్బందికి పాఠశాలల్లో వసతుల నిర్వహణపై సూచనలు ఇవ్వాలి’ అని ఆదేశించారు.

* ‘రాష్ట్రం నైపుణ్యమున్న మానవ వనరులకు చిరునామాగా మారాలి. ఈ మేరకు నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావాలి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక నైపుణ్య కళాశాలతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ సమ్మిళితంగా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం సూచించారు.  

* ‘నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని పాఠశాలలను మ్యాపింగ్‌ చేశాం. ఫిబ్రవరి 14 నుంచి ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన సాగుతోంది. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్‌ అభ్యసన, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి కో-ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, మరో మహిళా కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాలలు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాం’ అని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, మంత్రి ఆదిమూలపు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని