AP BUDGET:సవాళ్ల పద్దు

రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు

Updated : 11 Mar 2022 06:31 IST

నేడే రాష్ట్ర బడ్జెట్‌

సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధ్యమేనా?

రూ.2.50 లక్షల కోట్ల అంచనా వ్యయం?

ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల నియోజకవర్గ నిధి ఇచ్చే యోచన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపుతున్నా నిధులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. నిరుటి పెండింగు బిల్లులు ఈ ఏడాది బడ్జెట్‌లో చూపడం లేదు. ఫలితంగా ఆ నిధులు పొందాలంటే మళ్లీ కొత్తగా బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు పొందాల్సి వస్తోంది. అనేక ప్రభుత్వ శాఖల్లో మూలధన వ్యయం అంచనాలే తక్కువగా ఉంటే.. అందులో ఖర్చు మరీ తీసికట్టు అవుతోంది. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే రాష్ట్రంలో పనులు ఎలా జరుగుతాయి? అని సాక్షాత్తూ హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిలదీసింది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతౌల్యం చేసేందుకు, మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించే సవాలును ఈ బడ్జెట్‌లో ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు రూ.1,11,792 కోట్లుగా ఉన్నాయి. మిగిలిన రెండు నెలల్లో మరో రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లు రావచ్చని అంచనా. జనవరి నెలాఖరు వరకు మొత్తం ఖర్చు రూ.1,69,842 కోట్లకే పరిమితమైంది. మొత్తం రూ.   2.28 లక్షల కోట్ల బడ్జెట్‌ అంచనాల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఇతరత్రా అప్పుల రూపంలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో బడ్జెట్‌ స్వరూపం పెరిగితే అదనపు మొత్తాలు ఎలా తీసుకురాగలదన్నది కీలకాంశమే.

మిరప రైతులకు ఏమిస్తారు?

తామరపురుగు తాకిడితో మిరప రైతులు మునుపెన్నడూ లేనంతగా నష్టపోయారు. ఎకరానికి రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టి.. పలుచోట్ల కాయ కోయకుండానే వదిలేశారు. రాష్ట్రంలో సాగు చేసిన మొత్తం పంటలో 80% నష్టం ప్రకారం చూసినా.. ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.4వేల కోట్ల పెట్టుబడులు పోయినట్లే. రైతులైతే.. అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక భూముల్ని బేరం పెడుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో అయినా.. ఉపశమనం కలిగించేలా ప్రకటన వస్తుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.


వీటన్నింటికీ నిధుల సమీకరణ ఎలా?

నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్‌లో చూపనున్నారు. నేరుగా లబ్ధిదారులకు ఇచ్చే ప్రయోజనాల రూపంలో సుమారు రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఏపీఎస్‌ఐడీసీ నమూనాలో గతంలో 2020-21 బడ్జెట్‌లో రూ.18,500 కోట్ల మేర రుణాలు తెచ్చి ఈ పథకాలకు వెచ్చించారు. ఈ నమూనా సరికాదని కేంద్ర ఆర్థికశాఖ, ఫైనాన్షియల్‌ సర్వీసు విభాగమూ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలాగన్న ప్రశ్నకూ బడ్జెట్టే జవాబివ్వాల్సి ఉంటుంది. మరోవైపు మూలధన వ్యయం ఆధారంగా బహిరంగ మార్కెట్‌ రుణంలో 0.5 శాతం మేర కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోంది. కేంద్రం నిర్దేశించిన ప్రకారం మూలధన వ్యయం చేయడం లేదని ఆరు నెలల తర్వాత జరిపిన సమీక్షలో తేలింది. 

* పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ దిశగా ముందుకెళ్లాలంటే ఎంత లేదన్నా ఈ బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు అవసరం.

* రాజధాని అమరావతిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళిక ప్రకారం సౌకర్యాలు కల్పించాల్సిందేనని, రైతులకు ప్లాట్లు అభివృద్ధిచేసి ఇవ్వాలని హైకోర్టు గడువు విధించింది. 

* రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ నిధులు ఎలా సమకూరుస్తారో బడ్జెట్‌లో చూడాల్సి ఉంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని