Updated : 12 Mar 2022 06:15 IST

AP BUDGET:4 స్తంభాల సుపరిపాలన

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నాం
బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి 4 మూల స్తంభాల విధానాన్ని స్వీకరించినట్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రతాంశాలే ప్రాతిపదికగా పాలిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వికేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) ప్రభుత్వం సాధిస్తోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగానే నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. నీతి ఆయోగ్‌, ఎస్‌డీజీ ఇండియా 2020-21 నివేదిక ప్రకారం.. పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య మెరుగు, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం, సముద్ర, జలజీవుల పరిరక్షణ వంటి లక్ష్యాల్లో రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉందని పేర్కొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలతో భరోసా

రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్‌ఆర్‌ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీవంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభా ఆధారపడుతున్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ వైద్యశాలలు, వైద్య కళాశాలలు,  ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా నీతిఆయోగ్‌ బహుళ పేదరిక నివేదిక (ఎంపీఐ)లో రాష్ట్రం ఉన్నత స్థానంలో నిలిచిందని తెలిపారు. ‘పేదరికం తగ్గింపులో రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. వైఎస్సార్‌ పింఛను కానుక కింద 61.74 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది’ అని వివరించారు.

జాతీయ స్థాయిలో మెరుగు

‘గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల నెట్‌వర్క్‌, రైతు భరోసా కేంద్రాలవంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య, ఆరోగ్య వ్యవస్థల ఆధునికీకరణ, మహిళా స్వయం సహాయ సంఘాలను గతంలో కంటే బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. రాష్ట్రంలో శిశు, కౌమార దశలోని పిల్లల మరణాలు 2 శాతంకంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. పాఠశాలలకు విద్యార్థుల హాజరులో 98%కంటే ఎక్కువ వృద్ధి సాధించాం. స్థూల నమోదు నిష్పత్తిలో షెడ్యూలు కులాలు, తెగలు, బాలికల విషయంలో జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రం మెరుగ్గా ఉంది. కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 298 మంది పిల్లలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేశాం. కేంద్ర మద్దతుతో రహదారులు, గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం భారీ కార్యక్రమాలను ప్రారంభించింది’ అని బుగ్గన వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్‌సీవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేసినట్లు బుగ్గన తెలిపారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని