CJI: ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటులో పెద్ద ముందడుగు

ఆర్బిట్రేషన్‌ కేంద్ర ఏర్పాటు సహా అన్నీ ఇంత త్వరగా పూర్తవుతాయని ఊహించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. వచ్చే ఏడాదికల్లా భవన నిర్మాణం పూర్తవుతుందని, దుబాయ్‌, సింగపూర్‌, లండన్‌

Updated : 13 Mar 2022 05:53 IST

ఏడాదిలో అంతర్జాతీయ కేంద్రాల సరసన హైదరాబాద్‌ కేంద్రం

  విలువైన భూమి... నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

  ఐఏఎంసీ శంకుస్థాపన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్బిట్రేషన్‌ కేంద్ర ఏర్పాటు సహా అన్నీ ఇంత త్వరగా పూర్తవుతాయని ఊహించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. వచ్చే ఏడాదికల్లా భవన నిర్మాణం పూర్తవుతుందని, దుబాయ్‌, సింగపూర్‌, లండన్‌ కేంద్రాల సరసన హైదరాబాద్‌ కేంద్రం నిలబడుతుందన్నారు. రాజధానిలోని ఐటీ కారిడార్‌(ఐకియా వెనుక భాగంలో)లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) భవనానికి శనివారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టీలు పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటులో ఇది పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం విలువైన భూమిని కేటాయించిందని, నిర్మాణ నిమిత్తం రూ.50 కోట్లు మంజూరు చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో దుబాయ్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేటర్ల సదస్సులో దీని గురించి వివరించడం ద్వారా పలువురు హైదరాబాద్‌ వైపు మొగ్గుచూపేలా ప్రయత్నించవచ్చన్నారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ట్రస్టీ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్బిట్రేషన్‌ కేంద్ర ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ రెండు నెలల్లోనే ఈ కేంద్రానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కోర్టులు సిఫార్సు చేసిన కేసులతో పాటు కక్షిదారుల సమ్మతితో కూడా వస్తున్నారన్నారు. కక్షిదారులు ఇక్కడి సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇది అంతర్జాతీయ కేంద్రాలకు దీటుగా ఉంటుందని, హైదరాబాద్‌కు ఖ్యాతి తీసుకువస్తుందన్నారు. అనారోగ్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ పి.కె.మిశ్రా, సుప్రీం కోర్టు న్యాయమూర్తి హిమాకోహ్లి, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఐఏఎంసీ సీఈవో సితేష్‌ ముఖర్జీ, రిజిస్ట్రార్‌ తారిఖ్‌ఖాన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీజేెఐని ఉభయ రాష్ట్రాల  హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు సన్మానించారు.

నేడు శ్రీశైలానికి సీజేఐ

శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ఆదివారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రానున్నారు.సోమవారం స్వామి అమ్మవార్లను దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు