Updated : 15 Mar 2022 10:18 IST

వివేకా హత్యలో రాజకీయ పెద్దల హస్తం

సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారు
గంగిరెడ్డి బెయిలు రద్దు చేయాలని సీబీఐ వాదన
హైకోర్టులో విచారణ నేటికి వాయిదా

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు. వివేకా హత్యలో రాజకీయ పెద్దల హస్తం ఉందని, నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. మేజిస్ట్రేట్‌ ఎదుట సీఆర్‌పీసీ 164 స్టేట్‌మెంట్‌ ఇస్తామని చెప్పిన సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి సైతం... గంగిరెడ్డి, ఆయన అనుచరుల బెదిరింపుల కారణంగానే వెనక్కి తగ్గారని వివరించారు. ఆ తర్వాతే శంకరయ్యకు పోస్టింగ్‌ ఇచ్చారని, గంగిరెడ్డి తప్ప.. మిగిలిన నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం కలుగుతోందని, బెయిలు రద్దు చేయాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ స్పందిస్తూ... దిగువ కోర్టు గంగిరెడ్డికి బెయిలిచ్చింది ఎప్పుడు? దాన్ని రద్దు చేయాలని సీబీఐ కింది కోర్టులో పిటిషన్‌ వేసింది ఎప్పుడు? దానిని ఆ కోర్టు కొట్టేసిందెప్పుడు? బెదిరింపులకు పాల్పడ్డట్టు ఇచ్చిన వాంగ్మూలాల వివరాలను హైకోర్టు ముందుంచాలని సీబీఐని ఆదేశించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. పులివెందుల జ్యుడీషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ కోర్టు జూన్‌ 2019లో గంగిరెడ్డికి మంజూరు చేసిన డీఫాల్ట్‌ బెయిలును రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.
గంగిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐది ఆందోళన మాత్రమేనన్నారు. మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడిన ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటే గంగిరెడ్డికి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

ఆ రెండు పిటిషన్లపై విచారణ 21కి వాయిదా
ఈనాడు డిజిటల్‌, కడప: వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 21కి వాయిదా పడింది. ఈ కేసులో నాలుగో నిందితుడైన ఉమాశంకర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఇదివరకు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇదే కేసులో కీలక సాక్షులైన రంగన్న, దస్తగిరికి భద్రత కల్పించాలని సీబీఐ కడప కోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ మేజిస్ట్రేట్‌ సోమవారం నిర్ణయం తీసుకున్నారు.  

వైఎస్‌ వివేకా వర్ధంతి నేడు
వైఎస్‌ వివేకా మూడో వర్ధంతిని కడప జిల్లా పులివెందులలో ఆయన కుటుంబీకులు మంగళవారం నిర్వహించనున్నారు. వివేకా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళి అర్పించనున్నారు. ఈ మేరకు వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సోమవారం పులివెందులకు చేరుకున్నారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని