Andhra News: సహజ మరణాలని చెప్పండి.. మీకు సాయం చేసేలా చూస్తాం

జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుగా చెబుతున్నవన్నీ సహజ మరణాలేనంటూ ప్రభుత్వ పెద్దలు శాసనసభలో చేస్తున్న ప్రకటనలకు బలాన్ని చేకూర్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

Updated : 16 Mar 2022 09:28 IST

ఏలూరులో అధికారులు చెప్పారంటున్న బాధిత కుటుంబీకులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుగా చెబుతున్నవన్నీ సహజ మరణాలేనంటూ ప్రభుత్వ పెద్దలు శాసనసభలో చేస్తున్న ప్రకటనలకు బలాన్ని చేకూర్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు బాధిత కుటుంబీకులే ధ్రువీకరిస్తున్నారు. ‘నాతో పాటు నాటుసారా వల్ల అండ కోల్పోయిన 12 కుటుంబాల వారిని ఏలూరుకు తీసుకెళ్లారు. ఉదయంనుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నాం. మాకు భోజనం పెట్టారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో వీఆర్వోను కేటాయించి మావాళ్లు చనిపోయిన రోజు ఏం జరిగిందో, వారు ఎలా మరణించారో మమ్మల్ని అడిగారు. నాటుసారా వల్లే మావాళ్లు చనిపోయారని అందరం చెప్పాం. మేం చెప్పినవన్నీ రాసుకున్నారు. మా ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరు, ఇతర వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత.. ‘మేము మీడియాను పిలుస్తాం. మద్యం తాగే అలవాటుంది.. కానీ తినకుండా ఉండటం వల్లే మావాళ్లు అనారోగ్యానికి గురై చనిపోయారని చెప్పండి. తాగి చనిపోయారంటే నష్టపరిహారం రావడానికి సమయం పడుతుంది. మేం చెప్పినట్లు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా చేస్తాం. మీకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది’ అని అక్కడుండే ఓ అధికారి మాకు చెప్పారు. అలా అని నిర్బంధం చేయలేదు. ‘మాకు మీరు ఎలాంటి సాయం చేయకపోయినా ఫరవాలేదు. మావాళ్లను పోగొట్టుకుని ఇంత దూరం వచ్చాం. నిజమే చెబుతాం తప్ప అబద్ధం చెప్పబోం. కల్తీసారా వల్ల మావాళ్లను కోల్పోయి దిక్కుతోచక ఉన్న మాకు సాయం చేస్తే చేయండి. లేదా మమ్మల్ని పంపించేయండి’ అని చెప్పి అందరం వచ్చేశాం’ అని బి.రాంబాబు కుమార్తె తెలిపారు. ‘మాకు మీ డబ్బులొద్దు.. ఏమీ వద్దు.. అలా చెప్పం అన్నాం. సారా మరణాలని చెబితే ప్రభుత్వంనుంచి డబ్బులేమీ రావన్నారు. మా పిల్లలకు మంచి చేస్తారేమోననే ఆశతో వెళితే అబద్ధాలు చెప్పమన్నారు’ అని పితాని రమణ భార్య విజయలక్ష్మి వాపోయారు. సోమవారం ఏలూరుకు వెళ్లిన మరో రెండు కుటుంబాలవారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘నాటుసారా కట్టడికి చర్యలు తీసుకుని మాకు సాయం చేసి పరిస్థితిని చక్కదిద్దడం మాని విషయాన్ని దాచేందుకు ప్రభుత్వం ఎందుకింత చేస్తోందో అర్థం కావట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

22మందిపై కేసులు

జంగారెడ్డిగూడెంలో తాజాగా చాలా మరణాలకు కల్తీసారానే కారణమని ఈ సంఘటనలతో సంబంధం లేనివారు కూడా చెబుతున్నారు. సారా ప్రభావం లేదని చెబుతున్న యంత్రాంగం హడావుడిగా పలువురిని ఎందుకు అరెస్టు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 243 లీటర్ల నాటుసారా, 18,300 లీటర్ల బెల్లంఊటను ఎస్‌ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. 63,048 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. 22మందిపై కేసులు పెట్టి నలుగురిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని