Ap news:విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

విద్యారంగంలో ప్రభుత్వం తెస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో విద్యార్థులు.. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ ద్వారా

Updated : 17 Mar 2022 06:41 IST

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థులు: సీఎం జగన్‌

రూ.709 కోట్ల విద్యా దీవెన  నిధుల విడుదల

ఈనాడు, అమరావతి: విద్యారంగంలో ప్రభుత్వం తెస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో విద్యార్థులు.. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడంతోపాటు సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని వివరించారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు, సీబీఎస్‌ఈ సిలబస్‌ తెస్తున్నామన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యా దీవెన పథకం కింద 2021 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొత్తాన్ని  మే నెలలో చెల్లిస్తామని తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా త్రైమాసికాల వారీగా తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ‘వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికీ ఇచ్చే రూ.20వేలలో ఇప్పటికే రూ.10వేలు ఇచ్చాం. రెండో విడత మొత్తాన్ని ఏప్రిల్‌ 5న ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి.. తల్లుల ఖాతాల్లోకి నిధుల్ని జమ చేస్తాం’ అని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుపై తనలా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని పేర్కొన్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక పేరుతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య సిలబస్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నామని ఆయన వివరించారు.

పాదయాత్రలో జరిగిన ఘటనే కనిపిస్తోంది

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడాలంటే.. పాదయాత్ర సమయంలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన తనకు కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ‘కళాశాలలో ఫీజు రూ.లక్ష ఉంటే రీయింబర్స్‌మెంట్‌ ద్వారా రూ.30వేలే వచ్చింది. మిగిలిన రూ.70వేల భారాన్ని తండ్రిపై మోపలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి చెప్పారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదు’ అని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లుంటే.. తామే చెల్లించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు, వారి తల్లులు సీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని